రన్నరప్ ట్రోఫీతో ప్లిస్కోవా, విన్నర్స్ ట్రోఫీతో బార్టీ
లండన్: పట్టుదలతో కష్టపడితే ఏనాటికైనా కలలు నిజమవుతాయని ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ నిరూపించింది. టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి ఒక్కసారైనా వింబుల్డన్ టైటిల్ సాధించాలని కలలు కన్నానని ఫైనల్‌కు ముందు బార్టీ తెలిపింది. ‘హౌస్‌ఫుల్’ సెంటర్ కోర్టులో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ఆటతీరుతో 25 ఏళ్ల బార్టీ తన కలను నిజం చేసుకుంది. ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన తుది పోరులో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించింది.
విజేతగా నిలిచిన బార్టీకి 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ ప్లిస్కోవాకు 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బార్టీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2019లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. మరోవైపు 29 ఏళ్ల ప్లిస్కోవాకు రెండోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. 2016 యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ ప్లిస్కోవా రన్నరప్‌గా నిలిచింది. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టి20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో బార్టీ 2016లో టెన్నిస్‌లో పునరాగమనం చేసింది.
తొలి సెట్‌లో రెండో గేమ్‌లో, నాలుగో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌లను బ్రేక్ చేసిన బార్టీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బార్టీ దూకుడు... ప్లిస్కోవా పేలవమైన ఆటతీరు చూశాక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఒక్క గేమ్ అయినా గెలుస్తాందా అనే అనుమానం కలిగింది. అయితే ప్లిస్కోవా ఆట నెమ్మదిగా గాడిలో పడటంతో ఐదో గేమ్‌లో ఆమె బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి గేమ్ గెలిచింది. ఆ వెంటనే ఆరో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ 5–1తో ముందంజ వేసింది. అదే జోరులో బార్టీ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.
రెండో సెట్‌లో ప్లిస్కోవా తన లోపాలను సరిదిద్దుకొని బార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. పలుమార్లు స్కోరు సమమయ్యాక చివరికు సెట్ టైబ్రేక్ వరకు వెళ్లింది. టైబ్రేక్‌లో ప్లిస్కోవా పైచేయి సాధించింది. నిర్ణాయక మూడో సెట్‌లోని రెండో గేమ్‌లో ప్లిస్కోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్టీ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్లిస్కోవా కోలుకునే ప్రయత్నం చేసినా బార్టీ దూకుడైన ఆటముందు ఆమె నిలువలేకపోయింది. బార్టీ సర్వీస్ చేసిన తొమ్మిదో గేమ్‌లో ప్లిస్కోవా కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ నెట్‌కు తగలడంతో బార్టీ విజయం ఖాయమైంది.
వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణి బార్టీ. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) ఈ ఘనత సాధించారు.
ఫైనల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆలోచిస్తూ శుక్రవారం రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అంతా అద్భుతంలా అనిపిస్తోంది. స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా కలను మీరు మరింత ప్రత్యేకం చేశారు.
–బార్టీ
Comments
Please login to add a commentAdd a comment