గ్రాండ్‌స్లామ్‌ కలకు... అడుగు దూరంలో | Krejcikova to face Pavlyuchenkova in final in French Open | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌స్లామ్‌ కలకు... అడుగు దూరంలో

Published Fri, Jun 11 2021 4:31 AM | Last Updated on Fri, Jun 11 2021 4:31 AM

Krejcikova to face Pavlyuchenkova in final in French Open - Sakshi

అసమాన ఆటతీరుతో ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ వచ్చిన పావ్లుచెంకోవా, మరియా సాకరి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీ ఫైనల్‌ సమరాల్లో తామర జిదాన్‌సెక్‌పై పావ్లుచెంకోవా....సాకరిపై క్రిచికోవాగెలిచి తమ కెరీర్‌ల్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే టైటిల్‌ పోరులో వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త గ్రాండ్‌ స్లామ్‌ విన్నర్‌గా నిలుస్తారు.

పారిస్‌: దశాబ్ద కాలంగా గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లలో పాల్గొంటున్నా... ప్రస్తుతం జరుగుతోన్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ ముందు వరకు ఎన్నడూ క్వార్టర్‌ ఫైనల్స్‌ దాటని రష్యా ప్లేయర్‌ అనస్తాసియా పావ్లుచెంకోవా అద్భుతం చేసింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో రిబాకినా (కజకిస్తాన్‌)పై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆమె... సెమీస్‌లో కూడా అదే దూకుడును కొనసాగించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో గురువారం గంటా 34 నిమిషాల పాటు జరిగిన తొలి సెమీ ఫైనల్లో పావ్లుచెంకోవా 7–5, 6–3తో 85వ ర్యాంకర్‌ తామర జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)పై గెలుపొందింది.

వయసులో తనకన్నా ఆరేళ్లు చిన్నదైన జిదాన్‌సెక్‌తో ఆడిన మ్యాచ్‌లో 31వ సీడ్‌ పావ్లుచెంకోవా మ్యాచ్‌ ఆరంభంలో తడబడింది. తొలి సెట్‌లో 0–2తో వెనుకబడిన ఆమె... ఆ తర్వాత తేరుకొని స్కోర్‌ను 2–2తో సమం చేసింది. అనంతరం ఎనిమిదో గేమ్‌ను జిదాన్‌సెక్‌ సర్వ్‌ చేయగా... పావ్లుచెంకోవా ఒక దశలో 0–40తో వెనుకబడినా వరుసగా పాయింట్లు సాధించి 40–40తో ‘డ్యూస్‌’ చేసింది. అక్కడ తడబడిన జిదాన్‌సెక్‌ ఒక డబుల్‌ఫాల్ట్‌తో పాటు మరో అనవసర తప్పిదం చేసి సర్వీస్‌ను కోల్పోయింది. 11వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పావ్లుచెంకోవా... 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను సొం తం చేసుకుంది. రెండో సెట్‌లో జిదాన్‌సెక్‌ తేలిపోవడంతో మ్యాచ్‌ పావ్లుచెంకోవావశమైంది.  

హోరాహోరీ పోరు...
అనంతరం హోరాహోరీగా జరిగిన మహిళల రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బార్బొరా క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–5, 4–6, 9–7తో మరియా సాకరి (గ్రీస్‌)పై గెలిచింది. తద్వారా తొలి సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌కు షాకిచ్చి న సాకరి మరోసారి తన జోరు ప్రదర్శించినా... క్రిచికోవా కూడా చెలరేగడంతో హోరాహోరీ పోరు సాగింది. ముఖ్యంగా చివరి సెట్‌లోనైతే ఇద్దరూ ఒక్కో పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు 3 గంటల 18 నిమిషాల సమరం తర్వాత మ్యాచ్‌ ఫలితం రావడం విశేషం.  

ఫైనల్‌ కాని ఫైనల్‌...
ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్‌ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–2, 6–7(5/7), 7–5తో తొమ్మిదో సీడ్‌ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌కు చేరడం జొకోవిచ్‌కు ఇది 11వసారి కాగా... ఓవరాల్‌గా అతనికిది 40వ గ్రాండ్‌స్లామ్‌ సెమీ ఫైనల్‌. అతను నేడు జరిగే పురుషుల సెమీఫైనల్లో నాదల్‌తో తాడో పేడో తేల్చుకోనున్నాడు. గత ఏడాది వీరిద్దరు ఫైనల్లో తలపడగా నాదల్‌ వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ సారి  ఇద్దరు దిగ్గజాల మధ్య సెమీ ఫైనల్లోనే పోరు జరగనుంది.  

నేడు పురుషుల సెమీ ఫైనల్‌
అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌  VxS స్టెఫనోస్‌ సిట్సిపాస్‌
నొవాక్‌ జొకోవిచ్‌  VxS రాఫెల్‌ నాదల్‌  
సా.6.20నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 
        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement