సైనా గెలిచినా...
⇒ భారత్‌కు తప్పని ఓటమి
⇒ మలేసియా చేతిలో 2-3తో పరాజయం
⇒ సుదిర్మన్ కప్
డాంగ్వాన్ (చైనా): ఊహించినట్టే జరిగింది. డబుల్స్‌లో బలహీనత భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఫలితంగా సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మలేసియాతో సోమవారం జరిగిన గ్రూప్1-డి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్...
మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం గెలిచినప్పటికీ... మిగతా మూడు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. వరుసగా రెండో గెలుపుతో మలేసియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. బుధవారం కొరియా, భారత్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నాకౌట్‌కు చేరుకుంటుంది.
తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 15-21, 16-21తో గో వీ షెమ్-తాన్ వీ కియోంగ్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 24-22, 21-13తో తీ జింగ్ యిపై నెగ్గడంతో భారత్ 1-1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 16-21, 15-21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 21-18, 19-21, 21-15తో వివియాన్ కా మున్ హూ-వూన్ ఖె వీ ద్వయంపై గెలుపొందడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. అయితే నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-అరుణ్ విష్ణు జంట 14-21, 18-21తో చాన్ పెంగ్ సూన్-గో లియు యింగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది.
ప్రపంచ 56వ ర్యాంకర్ తీ జింగ్ యితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనాకు గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకొన్న ఈ హైదరాబాద్ అమ్మాయి గట్టెక్కింది. రెండో గేమ్‌లో సైనా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తనపై విధించిన ఎనిమిది నెలల నిషేధం పూర్తి కావడంతో ఈ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన లీ చోంగ్ వీ ఆటతీరులో ఏమాత్రం తేడా రాలేదు. పదునైన స్మాష్‌లతో చెలరేగిన అతను శ్రీకాంత్‌కు ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో వివియాన్-వూన్ ఖె వీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ద్వారా జ్వాల జంట బదులు తీర్చుకుంది.