Sudirman Cup
-
Sudirman Cup 2023: విజయంతో ముగింపు... భారత్‌కు తప్పని నిరాశ
సుజౌ (చైనా): సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు విజయంతో ముగించింది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. చైనీస్ తైపీ, మలేసియా జట్లతో జరిగిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవడంతో నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. తొలి మ్యాచ్‌లో సాయిప్రతీక్–తనీషా క్రాస్టో 21– 17, 14–21, 18–21తో కెనెత్ చూ–గ్రోన్యా సోమర్‌విలె చేతిలో ఓడిపోయారు. అనంతరం రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–8, 21–8తో జాక్ యుపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో అనుపమ 21–16, 21–18తో టిఫానీ హోపై, నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ 21–11, 21–12తో టాంగ్–రేన్ వాంగ్‌లపై, ఐదో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–19, 21–13తో కైట్లిన్–ఎంజెలా యులపై విజయం సాధించారు. -
Sudirman Cup 2023: భారత జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో ఈ టోర్నీ జరుగుతుంది. గ్రూప్ ‘సి’లో మలేసియా, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియా జట్లతో భారత జట్టు ఆడుతుంది. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో ఒక్కో మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు: ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, అనుపమ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల (పురుషుల డబుల్స్), పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్), తనీషా క్రాస్టో–సాయిప్రతీక్ (మిక్స్డ్ డబుల్స్). -
Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్ దశలోనే అవుట్
వాంటా (ఫిన్లాండ్): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్–జౌ హావో డాంగ్ జోడీ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9–21, 8–21తో చెన్ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్ యు–లి వెన్ మె చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్ యాన్ జె చేతిలో ఓడిపోయారు. చదవండి: Formula 1: హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’.... -
Sudirman Cup: స్టార్ ప్లేయర్లు లేకుండానే.. బరిలో భారత జట్టు
వాంటా (ఫిన్లాండ్): స్టార్ ప్లేయర్లు సింధు, సైనా, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గైర్హాజరీలో ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జట్టు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, థాయ్‌లాండ్, ఫిన్లాండ్ జట్లతో భారత్ ఉంది. ఆదివారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడనుంది. 27న రెండో లీగ్ మ్యాచ్‌లో చైనాతో, 29న మూడో లీగ్ మ్యాచ్‌లో ఫిన్లాండ్తో టీమిండియా తలపడనుంది. భారత్ క్వార్టర్ ఫైనల్ దశ చేరాలంటే రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఇక ప్రతి పోటీలో ఐదు మ్యాచ్‌లు (పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) జరుగుతాయి. ఐదింటిలో మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుకు విజయం ఖరారవుతుంది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఒలింపియన్ సాయిప్రణీత్ లేదా మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ బరిలోకి దిగుతారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప జంట... పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల జోడీ... మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ లేదా అదితి భట్ ఆడే అవకాశముంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి/అశ్విని పొన్నప్పలతో ఎవరు జత కడతారో వేచి చూడాలి. ►ఈ టోర్నీ తొలి రోజు మ్యాచ్‌లను మధ్యాహ్నం గం. 12:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–3లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
చైనాకు చుక్కెదురు
సుదిర్మన్ కప్ ఫైనల్లో కొరియా అద్భుత విజయం గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగుతున్న చైనాకు దక్షిణ కొరియా షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కొరియా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియా 3–2తో చైనాను బోల్తా కొట్టించింది. 28 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో కొరియా టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో కొరియా 1991, 1993, 2003లలో చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్లో పదిసార్లు విజేతగా నిలిచిన చైనాకు (1995, 1997, 1999, 2001, 2005, 2007, 2009, 2011, 2013, 2015) చివరిసారి 2003 ఫైనల్లో కొరియా చేతిలోనే ఓటమి ఎదురైంది. 1989లో మొదలైన ఈ టోర్నీలో ఇండోనేసియా ఏకైకసారి టైటిల్‌ను నెగ్గింది. చైనాతో జరిగిన ఫైనల్లో కొరియా ఒకదశలో 1–2తో వెనుకబడినా... చివరి రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఫు హైఫెంగ్–జాంగ్ నాన్ జోడీ 21–14, 21–15తో చోయ్ సోల్గియు–సెయుంగ్ జే సియో జంట (కొరియా)పై గెలిచి చైనాకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ (కొరియా) 21–12, 21–16తో హీ బింగ్జియావోను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో చెన్ లాంగ్ 21–10, 21–10తో జిన్ హైక్ జియోన్ (కొరియా)పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో చాంగ్ యె నా–లీ సో హీ జంట (కొరియా) 21–19, 21–13తో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ (చైనా) జోడీపై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో చోయ్ సోల్గియు–చే యూ జంగ్ ద్వయం 21–17, 21–13తో లు కాయ్–హువాంగ్ యాకియోంగ్ జంటను ఓడించి కొరియాకు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించింది. -
ముగిసిన భారత్ పోరు
సుదిర్మన్ కప్ క్వార్టర్స్‌లో 0–3తో చైనా చేతిలో ఓటమి గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): రెండోసారి క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు చేరిన భారత బ్యాడ్మింటన్ జట్టు ఈసారీ ఆ అడ్డంకిని దాటలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో శుక్రవారం జరిగిన సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 0–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 21–16, 13–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట లూ కాయ్–హువాంగ్ యాకియోంగ్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 17–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ చేతిలో ఓటమి చవిచూశాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్విక్ –చిరాగ్ శెట్టి జోడీ 9–21, 11–21తో ఫు హైఫెంగ్–జాంగ్ నాన్ ద్వయం చేతిలో పరా జయం పాలైంది. దాంతో చైనా 3–0తో విజయాన్ని ఖాయం చేసుకొని సెమీఫైనల్‌కు అర్హత సాధిం చింది. ఫలితం తేలిపోవడంతో మహిళల సింగిల్స్ (సింధు), మహిళల డబుల్స్ (అశ్విని–సిక్కి రెడ్డి) మ్యాచ్‌లను నిర్వహించలేదు. మరో క్వార్టర్ ఫైనల్లో జపాన్ 3–1తో మలేసియాను ఓడించింది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌తో కొరియా; జపాన్‌తో చైనా తలపడతాయి. 2011లో భారత జట్టు ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించి చైనా చేతిలోనే ఓడింది. -
నాకౌట్ దశకు భారత్ అర్హత
♦ రేపు చైనాతో అమీతుమీ ♦ సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ టీమ్ మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్1–డిలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌పై ఇండోనేసియా జట్టు 3–2తో విజయం సాధించినప్పటికీ ఆ జట్టు నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. మూడు జట్లున్న ఈ గ్రూప్‌లో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచి... భారత్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌లను (క్వార్టర్ ఫైనల్స్) ఖాయం చేసుకున్నాయి. లీగ్ దశ పోటీలు ముగిశాక గ్రూప్1–డిలో డెన్మార్క్, భారత్, ఇండోనేసియా ఒక్కో విజయంతో సమ ఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన మ్యాచ్ విజయాల సంఖ్య ఆధారంగా డెన్మార్క్ (6 విజయాలు), భారత్ (5 విజయాలు) ముందంజ వేయగా... ఇండోనేసియా (4 విజయాలు) ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ తలపడుతుంది. 28 ఏళ్ల సుదిర్మన్ కప్ చరిత్రలో ఇండోనేసియా జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మెగా ఈవెంట్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. 2011లో ఏకైకసారి భారత్ నాకౌట్ దశకు చేరుకొని... క్వార్టర్ ఫైనల్లో 1–3తో చైనా చేతిలో ఓడిపోయింది. బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సింధు భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ఎన్నికైంది. సుదర్మిన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో పీవీ సింధుకు అత్యధికంగా 129 ఓట్లు పడ్డాయి. మొత్తం మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. సింధుతోపాటు మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ–108 ఓట్లు), కిర్స్టీ గిల్మూర్ (స్కాట్లాండ్–103 ఓట్లు) కూడా బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. యుహాన్ తాన్ (బెల్జియం), విటిన్‌గస్ (డెన్మార్క్), గ్రెసియా పోలిల్ (ఇండోనేసియా) నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ కమిషన్‌లో నాలుగో సభ్యురాలిగా ఉన్న తాంగ్ యువాన్‌టింగ్ (చైనా) గతేడాది ఆటకు వీడ్కోలు పలకడంతో ఆమె స్థానంలో లిథువేనియాకు చెందిన అక్విలి స్టాపుసైటిటి ఎన్నికైంది. ఆమె రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతుంది. -
భారత్ ఆశలు సజీవం
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): నాకౌట్ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటుకుంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్రూప్1–డి మ్యాచ్‌లో భారత్ 4–1తో ఇండోనేసియాను ఓడించింది. తొలుత మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 22–20, 17–21, 21–19తో తొంతోవి అహ్మద్–గ్లోరియా జోడీని ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 21–16తో జొనాథన్ క్రిస్టీపై గెలవడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 17–21తో మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–8, 21–19తో ఫిత్రియానిపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–12, 21–19తో డెల్లా డెస్తియారా–రొసియాతా జోడీపై నెగ్గడంతో భారత్ 4–1తో గెలుపొందింది. బుధవారం ఇండోనేసియా, డెన్మార్క్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితంపై భారత్ నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇండోనేసియా ఓడిపోతే భారత్, డెన్మార్క్ జట్లు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఇండోనేసియా గెలిస్తే ఈ గ్రూప్‌లోని మూడు జట్లు ఒక్కో విజయంతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన గేమ్‌లు, పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుతాయి. -
భారత్‌కు నిరాశ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కీలకదశలో తడబాటుకు లోనైన భారత జట్టు సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఓటమితో ప్రారంభించింది. సోమవారం జరిగిన గ్రూప్1–డి తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పీవీ సింధు విజయం మినహా... మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 15–21, 21–16, 17–21తో జోకిమ్ ఫిషెర్ నీల్సన్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ కేవలం 27 నిమిషాల్లో 12–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 17–21, 15–21తో మథియాస్ బో–కార్స్టెన్ మోగెన్సన్ జోడీ చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–18, 21–6తో లైన్ జార్‌ఫెల్ట్‌ను ఓడించడంతో భారత్ బోణీ చేసింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 21–18, 15–21, 21–23తో కామిల్లా రైటర్ జుల్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడిపోయింది. భారత జట్టుకు నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేడు (మంగళవారం) ఇండోనేసియా జట్టుతో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. -
సుదిర్మన్ కప్‌లో భారత్‌కు విజయావకాశాలు: సింధు
ముంబై: త్వరలో జరగనున్న సుదిర్మన్ కప్ వరల్డ్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మంచి విజయావకాశాలున్నాయని భారత షట్లర్ పి.వి.సింధు అభిప్రాయపడింది. ‘భారత జట్టు గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయి. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాబట్టి, స్త్రీ, పురుష జట్లు కలిసి బాగా ఆడే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్లో ఇండోనేషియా, డెన్మార్క్‌లతో తలపడాలి. అన్ని మ్యాచుల్లో గెలుస్తామనే ఆశిస్తున్నాం’ అని సింధు చెప్పింది. ఆస్ట్రేలియాలో ఈ నెల 21 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో ఉన్న భారత జట్టు, గ్రూప్ 1డిలో డెన్మార్క్, ఇండోనేషియాలతో ప్రిలిమ్స్‌లో పోటీపడుతుంది. ఈ టోర్నమెంటులో భారత జట్టు పి.వి.సింధుపైనే ఎక్కువగా ఆశలుపెట్టుకుంది. ప్రస్తుతం పి.వి.సింధు ప్రపంచ నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. సైనా నెహ్వాల్ కుటుంబ కారణాల రీత్యా ఈ టోర్నమెంటులో పాల్గొనడం లేదు. అయితే సైనా లేకపోవడం జట్టుకు పెద్ద సమస్య కాదని సింధు అభిప్రాయపడింది. ‘సింగిల్స్‌లో, డబుల్స్‌లో ఒక్కరే అవసరం. కాబట్టి సైనా లేకపోవడం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం నేను నాలుగో ర్యాంకులో ఉన్నాను. టోర్నీ ముగిసేసరికి మెరుగైన ప్రతిభతో మూడో ర్యాంకుకు చేరుకుంటానని భావిస్తున్నాను. ఇప్పటికే నేను టాప్–2కి చేరుకున్నాను. టాప్ ర్యాంకుకి చేరుకోవాలనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు మంచి ప్రతిభ కనబర్చడం చాలా ముఖ్యం. బాగా ఆడితే నెం.1 ర్యాంకు వచ్చితీరుతుంది’ అని సింధు వివరించింది. -
భారత్ ఖేల్‌ఖతం
►కొరియా చేతిలో 1-4తో ఓటమి ►సైనా మినహా అందరూ పరాజయం ►సుదిర్మన్ కప్ డాంగ్వాన్ (చైనా) : ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ లీగ్ దశలోనే ముగిసింది. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మూడుసార్లు చాంపియన్ దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన గ్రూప్1-డి మ్యాచ్‌లో టీమిండియా 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించగా... పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. మలేసియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ గ్రూప్ నుంచి మలేసియా, దక్షిణ కొరియా క్వార్టర్ ఫైనల్ నాకౌట్ దశకు అర్హత పొందాయి. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం 10-21, 19-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రాంగ్ జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 22-20, 17-21, 21-13తో బే యోన్ జూపై గెలుపొంది స్కోరును 1-1తో సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ 21-13, 12-21, 12-21తో సన్ వాన్ హో చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-18, 12-21, 12-21తో చాంగ్ యె నా -జంగ్ క్యుంగ్ ఎన్ జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్‌లో మనూ అత్రి-సిక్కి రెడ్డి జంట 12-21, 20-22తో కిమ్ హా నా-కో సుంగ్ హ్యున్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. గతంలో బే యోన్పై ఏడుసార్లు నెగ్గి, నాలుగుసార్లు ఓడిపోయిన సైనాకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్‌లో గేమ్ పాయింట్ కాపాడుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 22-20తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. అయితే స్కోరు 13-14తో ఉన్న దశలో బే యోన్ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 20-14తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా తేరుకొని ఆరంభంలోనే 7-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరును తర్వాత కూడా కొనసాగించి 68 నిమిషాల్లో విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ శ్రీకాంత్‌ను కాదని అనుభవజ్ఞుడైన కశ్యప్‌ను బరిలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హోపై తొలి గేమ్ నెగ్గిన కశ్యప్ ఆ తర్వాత అదే దూకుడును కనబర్చలేకపోయాడు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ 75వ ర్యాంక్ కొరియా జోడీపై జ్వాల-అశ్విని ద్వయం పైచేయి సాధించలేకపోయింది. -
సైనా గెలిచినా...
⇒ భారత్‌కు తప్పని ఓటమి ⇒ మలేసియా చేతిలో 2-3తో పరాజయం ⇒ సుదిర్మన్ కప్ డాంగ్వాన్ (చైనా): ఊహించినట్టే జరిగింది. డబుల్స్‌లో బలహీనత భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఫలితంగా సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మలేసియాతో సోమవారం జరిగిన గ్రూప్1-డి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం గెలిచినప్పటికీ... మిగతా మూడు మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. వరుసగా రెండో గెలుపుతో మలేసియా నాకౌట్ దశకు అర్హత సాధించింది. బుధవారం కొరియా, భారత్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నాకౌట్‌కు చేరుకుంటుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 15-21, 16-21తో గో వీ షెమ్-తాన్ వీ కియోంగ్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 24-22, 21-13తో తీ జింగ్ యిపై నెగ్గడంతో భారత్ 1-1తో స్కోరును సమం చేసింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 16-21, 15-21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ చేతిలో ఓటమి చవిచూశాడు. నాలుగో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 21-18, 19-21, 21-15తో వివియాన్ కా మున్ హూ-వూన్ ఖె వీ ద్వయంపై గెలుపొందడంతో భారత్ 2-2తో స్కోరును సమం చేసింది. అయితే నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-అరుణ్ విష్ణు జంట 14-21, 18-21తో చాన్ పెంగ్ సూన్-గో లియు యింగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖాయమైంది. ప్రపంచ 56వ ర్యాంకర్ తీ జింగ్ యితో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనాకు గట్టిపోటీనే ఎదురైంది. తొలి గేమ్‌లో మూడు గేమ్ పాయింట్లను కాపాడుకొన్న ఈ హైదరాబాద్ అమ్మాయి గట్టెక్కింది. రెండో గేమ్‌లో సైనా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తనపై విధించిన ఎనిమిది నెలల నిషేధం పూర్తి కావడంతో ఈ టోర్నీ ద్వారా పునరాగమనం చేసిన లీ చోంగ్ వీ ఆటతీరులో ఏమాత్రం తేడా రాలేదు. పదునైన స్మాష్‌లతో చెలరేగిన అతను శ్రీకాంత్‌కు ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో వివియాన్-వూన్ ఖె వీ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ద్వారా జ్వాల జంట బదులు తీర్చుకుంది. -
భారత్‌కు మలేసియా పరీక్ష
నేటి నుంచి సుదిర్మన్ కప్ డాంగువాన్ (చైనా) : ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ‘సుదిర్మన్ కప్’ నేడు ప్రారంభమవుతుంది. నాకౌట్‌కు చేరడమే తొలి లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ‘గ్రూప్-1డి’లో ఉన్న భారత్ సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో... బుధవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ దక్షిణ కొరియాతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఐదింట్లో మూడు మ్యాచ్‌లు నెగ్గిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌లతో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ రెండు సింగిల్స్ లో భారత్ నెగ్గినా... జట్టు విజయావకాశాలు డబుల్స్ జోడీల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయి. తనపై విధించిన నిషేధం గడువు పూర్తి కావడంతో ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఈ టోర్నీతో పునరాగమనం చేయనున్నాడు. లీ చోంగ్ వీపై భారత ఆటగాళ్లకు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో మహిళల సింగిల్స్‌లో సైనాతోపాటు డబుల్స్‌లో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే భారత్ విజయం ఖాయమవుతుంది. సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ దక్షిణ కొరియా చాలా పటిష్టంగా ఉండటంతో భారత్ నాకౌట్ చేరే అంశం మలేసియాపై వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉంది. 2011లో నాకౌట్‌కు అర్హత పొందిన భారత్... 2013లో లీగ్ దశలోనే నిష్ర్కమించింది.