నాకౌట్ దశకు భారత్ అర్హత
♦ రేపు చైనాతో అమీతుమీ
♦ సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ టీమ్ మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్1–డిలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌పై ఇండోనేసియా జట్టు 3–2తో విజయం సాధించినప్పటికీ ఆ జట్టు నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. మూడు జట్లున్న ఈ గ్రూప్‌లో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచి... భారత్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌లను (క్వార్టర్ ఫైనల్స్) ఖాయం చేసుకున్నాయి. లీగ్ దశ పోటీలు ముగిశాక గ్రూప్1–డిలో డెన్మార్క్, భారత్, ఇండోనేసియా ఒక్కో విజయంతో సమ ఉజ్జీగా నిలిచాయి.
అయితే మెరుగైన మ్యాచ్ విజయాల సంఖ్య ఆధారంగా డెన్మార్క్ (6 విజయాలు), భారత్ (5 విజయాలు) ముందంజ వేయగా... ఇండోనేసియా (4 విజయాలు) ఇంటిముఖం పట్టింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో భారత్ తలపడుతుంది. 28 ఏళ్ల సుదిర్మన్ కప్ చరిత్రలో ఇండోనేసియా జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. 2011లో ఏకైకసారి భారత్ నాకౌట్ దశకు చేరుకొని... క్వార్టర్ ఫైనల్లో 1–3తో చైనా చేతిలో ఓడిపోయింది.
బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఈ హైదరాబాద్ క్రీడాకారిణి ఎన్నికైంది. సుదర్మిన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో పీవీ సింధుకు అత్యధికంగా 129 ఓట్లు పడ్డాయి. మొత్తం మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. సింధుతోపాటు మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ–108 ఓట్లు), కిర్‌స్టీ గిల్మూర్ (స్కాట్లాండ్–103 ఓట్లు) కూడా బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఈ ముగ్గురూ నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. యుహాన్ తాన్ (బెల్జియం), విటిన్‌గస్ (డెన్మార్క్), గ్రెసియా పోలిల్ (ఇండోనేసియా) నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో ఈ మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ కమిషన్‌లో నాలుగో సభ్యురాలిగా ఉన్న తాంగ్ యువాన్‌టింగ్ (చైనా) గతేడాది ఆటకు వీడ్కోలు పలకడంతో ఆమె స్థానంలో లిథువేనియాకు చెందిన అక్విలి స్టాపుసైటిటి ఎన్నికైంది. ఆమె రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతుంది.