చైనాకు చుక్కెదురు
సుదిర్మన్ కప్ ఫైనల్లో కొరియా అద్భుత విజయం
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): ప్రపంచ బ్యాడ్మింటన్‌లో కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగుతున్న చైనాకు దక్షిణ కొరియా షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కొరియా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియా 3–2తో చైనాను బోల్తా కొట్టించింది. 28 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో కొరియా టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి.
గతంలో కొరియా 1991, 1993, 2003లలో చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పదిసార్లు విజేతగా నిలిచిన చైనాకు (1995, 1997, 1999, 2001, 2005, 2007, 2009, 2011, 2013, 2015) చివరిసారి 2003 ఫైనల్లో కొరియా చేతిలోనే ఓటమి ఎదురైంది. 1989లో మొదలైన ఈ టోర్నీలో ఇండోనేసియా ఏకైకసారి టైటిల్‌ను నెగ్గింది.
చైనాతో జరిగిన ఫైనల్లో కొరియా ఒకదశలో 1–2తో వెనుకబడినా... చివరి రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలిచి విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఫు హైఫెంగ్–జాంగ్ నాన్ జోడీ 21–14, 21–15తో చోయ్ సోల్‌గియు–సెయుంగ్ జే సియో జంట (కొరియా)పై గెలిచి చైనాకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ (కొరియా) 21–12, 21–16తో హీ బింగ్‌జియావోను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది.
మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో చెన్ లాంగ్ 21–10, 21–10తో జిన్ హైక్ జియోన్ (కొరియా)పై గెలిచి చైనాను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో చాంగ్ యె నా–లీ సో హీ జంట (కొరియా) 21–19, 21–13తో చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ (చైనా) జోడీపై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో చోయ్ సోల్‌గియు–చే యూ జంగ్ ద్వయం 21–17, 21–13తో లు కాయ్–హువాంగ్ యాకియోంగ్ జంటను ఓడించి కొరియాకు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించింది.