జపాన్‌లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ?
ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం
2011, మార్చి 11. జపాన్‌ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి.
ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్‌లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి.
అణు జలాల శుద్ధి ఇలా..!
► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్‌డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్‌పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు.
► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్‌పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు.
► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది.
జపాన్ ఏమంటోంది ?
ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్‌లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు.
అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్‌హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు.
ఆ జలాలు విషతుల్యమేనా ?
ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్‌పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది.
మరో మార్గం లేదా ?
జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి.
వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ?
► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది.
► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి.
► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు.
► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు.
► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా
► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment