ఒకుమా: జపాన్‌ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది.
వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.
నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు.
జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా
జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment