Nuclear plants
-
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యో: జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. తీరప్రాంతమైన ఫుకుషిమా, మియాగి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు తెలిపారు. జపాన్ సముద్రంలో 60 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ ఏజన్సీ చెప్పింది. భారీ భూకంపమే అయినప్పటికీ సునామీ ఉండకపోవచ్చని స్పష్టం చేసింది. ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఏం సమస్యా ఎదురు కాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎనిమిదిన్నర లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో తెలిపింది. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రభుత్వం చెప్పింది. తక్షణ సాయం అందించేందుకు జపాన్ ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తున్నారు. పలు వార్తాల చానెళ్లలో భూకంపం కారణంగా పెచ్చులూడిన ఇళ్లు కనిపించాయి. -
‘అణు’ కేంద్రం ధ్వంసం చేస్తాం
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగానే అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. ఈ నెల 23–25 తేదీలలో విదేశీ మీడియా ఎదురుగా పేలుడు పదార్థాలతో పుంగ్యే–రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, సొరంగ మార్గాలు, అణ్వాయుధ సంస్థ, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అమెరికా ప్రకటన చేసిన మర్నాడే... ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే.. ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటనను స్వాగతించింది. కిమ్ మాటలు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. -
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా
బీజింగ్: చైనా అన్నంత పనిచేస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చెల్లబోదని అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిజంగానే భేఖాతరు చేస్తోంది. త్వరలోనే ఆ సముద్రంపై చైనా అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందట. ఈ విషయాన్ని అక్కడి మీడియా స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన రెండు రోజులకే చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరోసారి కయ్యానికి కాలు దువ్వడమేనని తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకంటే తమకే పెత్తనం ఉందని అటు చైనా, ఫిలిప్పీన్స్ ది హేగ్ లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ కు వెళ్లగా ట్రిబ్యునల్ మాత్రం పిలిప్పీన్స్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. చైనాకు ఎలాంటి పెత్తనం లేదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించింది. అయితే, తాము ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోబోమని, తాము చేసేది చేస్తామని చైనా ప్రకటించింది. అన్నట్లుగానే ఓ మీడియా ద్వారా తాము అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపడతామని, వాటి వల్ల దక్షిణ చైనా సముద్రంపై ప్రభావవంతమైన పట్టుసాధిస్తామని చెబుతోంది. ఒక వేళ ఇదే జరిగితే అంతర్జాతీయ సమాజంతో చైనా మరోసారి విమర్శలపాలు కాక తప్పదు. -
ఏపీలో ఎన్పీసీఐఎల్ అణువిద్యుత్ ప్లాంటు!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తిరస్కరించిన అణు విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐఎల్) ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీలో తగిన స్థలం కోసం అన్వేషిస్తోంది. నిజానికి బెంగాల్‌లోని హరిపూర్ పట్టణంలో ఎన్పీసీఐఎల్ ఈ అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గతంలో తలపెట్టింది. అయితే స్థానిక రైతులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదిత 6వేల మెగావాట్ల ఈ విద్యుదుత్పత్తి ప్లాంటుకు నో చెప్పింది. ఈ నేపథ్యంలో ఎన్పీసీఐఎల్ దృష్టి తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీనిపై ఎన్పీసీఐఎల్ బోర్డు సభ్యుల్లో ఒకరైన బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ శేఖర్ బసు శనివారం కోల్‌కతాలో మాట్లాడుతూ హరిపూర్‌లో ప్రతిపాదించిన అణువిద్యుత్ ప్లాంటు తరహాదానిని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రానికి చెందిన కోస్తా తీర ప్రాంతంలో భూమికోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. తగిన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని బసు వెల్లడించారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కోరుకున్నట్లయితే హరిపూర్‌లో ఏ సమయంలోనైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.