సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగానే అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. ఈ నెల 23–25 తేదీలలో విదేశీ మీడియా ఎదురుగా పేలుడు పదార్థాలతో పుంగ్యే–రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది. పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, సొరంగ మార్గాలు, అణ్వాయుధ సంస్థ, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
అమెరికా ప్రకటన చేసిన మర్నాడే...
ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే.. ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటనను స్వాగతించింది. కిమ్ మాటలు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment