hydrogen bomb
-
మాజీ సీఎంకు నవాబ్ కౌంటర్: హైడ్రోజన్ బాంబు వేయబోతున్నా కాస్కో!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్హీరో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రోజుకో పరిణామంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో బీజేపీ, శివసేన,ఎన్సీపీ ప్రభుత్వం మధ్య రగిలిన వార్ మరింత ముదురుతోంది. తనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. రేపు (బుధవారం) హైడ్రోజన్ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్‌తో ఆయనకున్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతాను అంటూ నవాబ్ మాలిక్ ప్రకంపనలు సెగ రేపారు. ఫడ్నవిస్ తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమే అంటూ ప్రతిసవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇటీవల కాలంలో ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన నవాబ్‌మాలిక్‌పై మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు దేవేంద్ర ఫడ్నవిస్. నవాబ్కు, ఆయన కుటుంబ సభ్యులకు దావూద్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో దావూద్ గ్యాంగ్ సభ్యుడి మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం దుమారాన్ని రేపింది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్ మాలిక్ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని, అసలు వారినుంచి భూమి ఎందుకు కొన్నారని ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పపవార్కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. राष्ट्रवादी काँग्रेसचे राष्ट्रीय प्रवक्ते ना. नवाब मलिक यांच्या पत्रकार परिषदेचे थेट प्रक्षेपण https://t.co/4fHBSM4Lln — Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 9, 2021 -
‘అణు’ కేంద్రం ధ్వంసం చేస్తాం
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆరు అణ్వస్త్ర పరీక్షలు చేపట్టి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన కిమ్ జోంగ్ ఉన్ తన తాజా నిర్ణయంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తమ వద్ద హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పిన ఉత్తర కొరియా.. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, దక్షిణ కొరియా మీడియా చూస్తుండగానే అణ్వస్త్ర కేంద్రాలను మూసివేయనున్నట్లు వివరించింది. ఈ నెల 23–25 తేదీలలో విదేశీ మీడియా ఎదురుగా పేలుడు పదార్థాలతో పుంగ్యే–రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) వెల్లడించింది. పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, సొరంగ మార్గాలు, అణ్వాయుధ సంస్థ, ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అమెరికా ప్రకటన చేసిన మర్నాడే... ఉత్తర కొరియా అణ్వాయుధాలను వదులుకుంటే.. ఆ దేశానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే కిమ్ జోంగ్ ఉన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ‘తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రకటనను స్వాగతించింది. కిమ్ మాటలు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. -
పసిఫిక్‌ను కల్లోలం చేస్తాం
న్యూఢిల్లీ : అమెరికా, అంతర్జాతీయ సమాజానికి ఉత్తర కొరియా ఏ మాత్రం భయపడడం లేదు. భవిష్యత్‌లో దుశ్చర్యలకు పాల్పడితే.. దేశాన్ని సమూలంగా నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఉత్తర కొరియా ఏ మాత్రం జంకడం లేదు. అమెరికాకు దీటు బదులిచ్చేందుకు తాజాగా ఉత్తర కొరియా సమాయత్తం అవుతోంది. అమెరికాను భయపెట్టే స్థాయిలో శక్తివంతమైన హైడ్రోజన్ బాంబ్‌ను కొరియా పసిఫిక్ మహాసముద్రంలో పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి రి యోంగ్ హూ ప్రకటించారు. ఈ బాంబ్ పరీక్షతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ లక్ష్యం పూర్తవుతుందని ఆయన చెప్పారు. అణుకార్యక్రమాన్ని కిమ్ మొదలు పెట్టిన సమయంలో.. అంతర్జాతీయంగా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్న అంశంపై తాము భయపడ్డట్టు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి సాక్షిగా ట్రంప్ 26 లక్షల ప్రజలతో ఉన్న దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని హెచ్చరించడంతో.. మేం సరైన దిశలోనే వెళుతున్నట్లు అర్థమైందన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన మానసిక స్థితి సరిగ్గాలేదన్న విషయం అర్థమవుతుందని చెప్పారు. అణ్వస్త్రదేశంతో మాట్లాడే సమయంలో ట్రంప్.. జాగ్రత్తా మాట్లాడాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రి యోంగ్ హూ హెచ్చరించారు. హైడ్రోజన్ బాంబును పసిఫిక్ మహాసముద్రంపై పరీక్షించాలని మేం మొదట అనుకోలేదు.. ఒక వేళ పరీక్షిస్తే మాత్రం.. అందుకు అందుకు అమెరికా, దాని మిత్రపక్షాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ’మా దగ్గరున్న ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ హవాంగ్ -12, హవాంగ్ -14తో పసిఫిక్‌తో కల్లోలం చేయగలమని.. విదేశాంగ శాఖ మంత్రి రి యోంగ్ హూ స్పష్టం చేశారు. హైడ్రోజన్ బాంబు పరీక్షిస్తాం అమెరికాకు అల్టిమేటం ఇచ్చిన ఉత్తర కొరియా బెదిరింపులకు భయపడమని ప్రకటన -
ఉత్తరకొరియాను సమూల నాశనం చేస్తాం
-
ఉత్తరకొరియాను సమూల నాశనం చేస్తాం: అమెరికా
సాక్షి, వాషింగ్టన్: దేశ చరిత్రలో నేటి వరకూ అత్యంత శక్తిమంతమైన అణు పరీక్షను నిర్వహించామని ఉత్తరకొరియా ప్రకటించడంతో అమెరికా కిమ్ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరకొరియాపై సాయుధ దళాలను ప్రయోగించక తప్పదని పేర్కొంది. ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేయడానికి కూడా వెనుకాడబోమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మ్యాటిస్ పేర్కన్నారు. అమెరికా, దాని భూభాగాలు, గ్వామ్, అమెరికాతో సత్సంబంధాలు కలిగిన దేశాలకు హాని తలపెట్టాలని చూస్తే ఉత్తరకొరియాను అణచి వేస్తామని చెప్పారు. కిమ్.. ఐక్యరాజ్యసమితి గొంతును తలకెక్కించుకుంటే మంచిదని పేర్కొన్నారు. మ్యాటిస్ మీడియా సమావేశానికి కంటే ముందు పత్రికా ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్.. ప్యాంగ్యాంగ్పై అమెరికా దాడి చేస్తుందా? అనే ప్రశ్నకు ఆ దిశగా కూడా ఆలోచిస్తామన్నారు. ఉత్తరకొరియాకు మాటల్తో చెప్తే సరిపోదని, చేతలు అవసరమని మీడియా భేటీ అనంతరం ట్రంప్ ట్వీట్ చేశారు. హిరోషిమా, నాగసాకిలపై వినియోగించిన అణు బాంబు కంటే ఏడు రెట్లు అత్యధిక సామర్ధ్యం కలిగినది కూడా నార్త్ కొరియా చెప్పింది. దీన్ని ఖండాంతర క్షిపణి హస్వాంగ్-14కు అమర్చనున్నట్లు వెల్లడించింది. అమెరికాతో పాటు జపాన్, చైనా, భారత్, మరిన్ని ప్రపంచ దేశాలు కూడా ఉత్తరకొరియా ప్రకటనను ఖండించాయి. -
అమెరికా నెత్తిన హైడ్రోజన్ బాంబు గురి
సాక్షి, సియోల్: అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తరకొరియా ఆదివారం ప్రకటించింది. ఈ బాంబును జులైలో ప్రయోగించి ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం) హస్వాంగ్-14కి అమర్చేందుకు అనువుగా తయారు చేసినట్లు చెప్పింది. ఈ బాంబుతో అణు క్షిపణి అమెరికాను చేరుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐసీబీఎంకి హైడ్రోజన్ బాంబును అమర్చడానికి తగు ప్రయోగాలను చేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారని ఆ దేశ అధికారిక మీడియా ఓ ప్రకటనలో చెప్పింది. అభివృద్ధి చేసిన హైడ్రోజన్ బాంబును ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదు(10 కిలో టన్నుల నుంచి 100 కిలో టన్నుల వరకూ)లో ప్రయోగించొచ్చని తెలిపింది. మిగిలిన బాంబులతో పోల్చితే అత్యధిక ఎత్తులో ఈ బాంబును పేల్చొచ్చని చెప్పింది. దీని ద్వారా జరిగే వినాశనం కనీవినీ ఎరుగుని రీతిలో ఉంటుందని పేర్కొంది. జూచే బేసిస్ హైడ్రోజన్ బాంబు తయారీలో ఉపయోగించిన పూచికపుల్ల కూడా ఉత్తరకొరియా దేశీయంగా అభివృద్ధి చేసిందేనని వెల్లడించింది. దీంతో ఎన్ని కావాలంటే అన్ని అణు ఆయుధాలను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయిందని తెలిపింది. మార్క్సిజమ్, తీవ్రవాద భావజాలల నుంచి పుట్టినదే జూచే బేసిస్. దీనికి ఆద్యుడు కిమ్ జాంగ్ ఉన్ తాతయ్య కిమ్ 2 సంగ్. జూచే బేసిస్‌ను దృష్టిలో ఉంచుకునే దేశీయ టెక్నాలజీతో మాత్రమే హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని ఉత్తరకొరియా పేర్కొంది. ఐసీబీఎంలో ఇన్‌స్టాలేషన్‌కు సిద్ధంగా ఉన్న హైడ్రోజన్ బాంబును కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఫొటోలను కూడా విడుదల చేసింది. చిత్రంలో హస్వాంగ్-14 క్షిపణి కోసం సిద్ధం చేసిన సిల్వర్ కలర్ హైడ్రోజన్ బాంబును కిమ్ తదేకంగా చూస్తున్నారు. ఉత్తరకొరియా చర్యలతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, ఉత్తరకొరియా కొత్తగా అణు పరీక్షను జరిపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరకొరియా ఇప్పటివరకూ ఐదు సార్లు అణుపరీక్ష జరిపింది. అయితే, ఉత్తరకొరియా మీడియా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
హైడ్రోజన్ బాంబేస్తే మన్‌హట్టన్ బూడిదే!
ప్యాంగ్యాంగ్: తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు మాజీ సోవియట్ యూనియన్ తయారు చేసిన బాంబుకన్నా శక్తివంతమైనదని, దీన్ని ఖండాంతర క్షిపణి ద్వారా ప్రయోగించినట్లయితే అమెరికా న్యూయార్క్ సిటీలోని మన్హట్టన్ను బూడిద చేయగలదని, మనుషులెవరూ మిగలరని ఉత్తర కొరియా పరోక్షంగా అమెరికాను హెచ్చరించింది. అమెరికాను తాకే శక్తివంతమైన ఖండాంతర క్షిపణులు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. నాలుగవ అణు పరీక్ష నిర్వహించిన రెండు నెలలకే ఉత్తర కొరియా ఇలాంటి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. మానవత్వాన్ని మంటగలుపుతున్న ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్, ఆయన సీనియర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్ మార్జుకి దర్సుమేన్ సమతి మానవ హక్కుల సమావేశంలో పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఇలాంటి హెచ్చరిక వెలువడింది. ఈ సమావేశాన్ని ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ బహిష్కరించింది. అమెరికా, ఐరోపా యూనియన్ మద్దతిచ్చింది. ఉత్తర కొరియాకు సన్నిహితంగా ఉండే చైనా మాత్రం మానవ హక్కులను రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించింది. -
'ఉత్తర కొరియాకు బుద్ధి చెబుదాం'
వాషింగ్టన్: అణుబాంబుకంటే ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియాకు అంతర్జాతీయ స్థాయిలో గట్టి బుద్ధి చెప్పాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కొరియా అధ్యక్షుడు పార్క్ గెయిన్ హై, జపాన్ ప్రధాని షింజో అబేతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఫోన్లో మాట్లాడి ఉత్తర కొరియా సరిహద్దు దేశాల్లోని భద్రతపై చర్చించారు. ఉత్తర కొరియాపై సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం కూడా ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని గట్టిగా వ్యతిరేకించేలా చేయాలని ఆ ముగ్గురు నిర్ణయించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. -
ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా?
నిజమో, అలవాటుగా చెప్పే బడాయి కబుర్లో...‘ధూర్త దేశం’గా ముద్రపడి అనేకానేక ఆంక్షల నడుమ రోజులు వెళ్లదీస్తున్న ఉత్తర కొరియా బుధవారం పేల్చిన బాంబు లాంటి వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాము శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఆ వార్త సారాంశం. ఆ వెనకే అమెరికా మొదలుకొని రష్యా, చైనాల వరకూ అనేక దేశాలు ఉత్తర కొరియా తీరును తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ కట్టుబాట్లను ఉత్తర కొరియా ఉల్లంఘించడంపై మన దేశం కూడా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ సంగతిని చర్చించడం కోసం భద్రతామండలి సమావేశం కాబోతున్నది. ఉత్తర కొరియా మాటల్లో నిజమెంత అని తర్కిస్తూనే...అది నిజమైతే గనుక ప్రమాదకర పరిణామమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అందరికన్నా ఎక్కువగా ఖేదపడుతున్నది అమెరికానే! ప్రపంచంలో కొత్తగా ఎవరూ అణ్వాయుధాల జోలికి పోకుండా చూసే బాధ్యతను తనకు తాను భుజాన వేసుకోవడంవల్ల కావొచ్చు... తానే 1952లో కనిపెట్టిన ఈ మహమ్మారి బాంబు పరిజ్ఞానం బద్ధ శత్రువు ఉత్తర కొరియాకు చిక్కడమేమిటన్న విచికిత్స కావొచ్చు-అమెరికా మాత్రం గట్టిగానే హెచ్చరించింది. ఉత్తర కొరియా పరీక్షించింది ఏ మాదిరి బాంబు అన్నది నిర్ధారణ కావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చుగానీ...ఆ దేశం ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్టు అంతర్జాతీయ భూకంప పర్యవేక్షణ వ్యవస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా 2006లో తొలి అణు పరీక్ష జరిపింది. ఇప్పుడు జరిపిన పరీక్ష నాలుగోది. ఈ మాదిరి పరీక్షలు ప్రపంచంలో ఇప్పటివరకూ అసంఖ్యాకంగా జరిగాయి. వీటిలో అగ్ర స్థానం అమెరికాదే. ఆ దేశం ఇంతవరకూ 1,032 అణు పరీక్షలు నిర్వహించింది. 727 అణు పరీక్షలతో రెండో స్థానంలో రష్యా, 217 పరీక్షలతో మూడో స్థానంలో ఫ్రాన్స్, 88 పరీక్షలతో నాలుగో స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. చైనా 47 అణు పరీక్షలు నిర్వహిస్తే మన దేశం 3, పాకిస్థాన్ 2 జరిపాయి. మన దేశం 1998లో జరిపిన పరీక్ష హైడ్రోజన్ బాంబుకు సంబంధించిందే. అణ్వాయుధాలన్నిటిలో ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెబుతారు. ఏకకా లంలో విస్తృతమైన ప్రాంతాన్ని బూడిదగా మార్చగల ఈ బాంబును క్షిపణుల ద్వారా ప్రయోగించడానికి అనువుగా చిన్న సైజులో కూడా తయారు చేయొచ్చు. హైడ్రోజన్ రేడియోధార్మిక రూపమైన ట్రిటియంను స్వల్ప మొత్తంలో ఆటం బాంబులో చేర్చినా అది హైడ్రోజన్ బాంబుగా మారి పెను విధ్వంసాన్ని కలిగిస్తుం దని నిపుణులు చెబుతారు. ఇరుగు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ల మాట అలా ఉంచి అమెరికా ఆందోళన పడటానికి ప్రధాన కారణం ఇదే. దేశదేశా ల్లోనూ సైనిక స్థావరాలున్న అమెరికాకు ఇప్పుడు ఉత్తర కొరియా రూపంలో పెను సవాల్ ఎదురైంది. జపాన్ వలస పాలనతో సర్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియాలో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో ఆనాటి సోవియెట్ యూనియన్ దళాలు అడుగుపెట్టాయి. అందుకు పోటీగా అమెరికా సైతం దండెత్తి వచ్చి దేశ దక్షిణ భాగంలో తిష్ట వేసింది. ఫలితంగా ఆ దేశం రెండుగా విడిపోయింది. అప్పట్లో దక్షిణ కొరియా పెట్టుబడిదారీ దేశాలతో చేరి, అమెరికా అండదండలతో సర్వతో ముఖాభివృద్ధి సాధించింది. ఇటు ఉత్తర కొరియా తనను తాను సోషలిస్టు దేశంగా చెప్పుకుంటుంది. కానీ అక్కడ నడిచేది అనువంశిక పాలన. ఉభయ కొరియాల మధ్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి వైషమ్యాలు ఇప్పటికీ కొనసాగడమే ప్రస్తుత స్థితికి కారణం. 30,000మంది బలగాలతో మోహరించిన అమెరికా దన్నుతో దక్షిణ కొరియా రేపో మాపో తనను సర్వనాశనం చేస్తుందని ఆ దేశం విశ్వసిస్తుంది. అందుకు నిరంతరం సంసిద్ధమై ఉంటుంది. ఖండాంతర క్షిపణులు రూపొందించు కోవడం, అణ్వాయుధాలు పోగేసుకోవడం ఆ సంసిద్ధతలో భాగమే. అలాగని అది సంపన్న దేశమేమీ కాదు. ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలకు తోడు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని కుంగదీస్తున్నాయి. ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతున్నదన్న సంగతి బయటి ప్రపంచానికి తెలియదు. ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడల్లా జోక్యం చేసుకుని చక్కదిద్దే చైనా, రష్యాలకైనా ఎంతవరకూ తెలుసునో చెప్పలేం. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా బయటి సమాచారం లోపలికీ... లోపలి సమాచారం బయటికీ పొక్కకుండా తనచుట్టూ ఉత్తర కొరియా ఉక్కు కుడ్యాన్ని నిర్మించుకుంది. దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్ వింత పోకడలు, విపరీత ప్రవర్తనపై అప్పుడప్పుడు పాశ్చాత్య మీడియా బయటి ప్రపంచానికి వెల్లడించే తమాషా వార్తలే ఉత్తర కొరియాను ఊహించుకోవడానికి ఆధారం. ఆ వార్తలకైనా దక్షిణ కొరియానుంచి అందే గుసగుసలే మూలం. ఒక్కటైతే నిజం... కిమ్ జోంగ్-ఉన్ మొండి ఘటం. దశాబ్దాలుగా అమెరికాపై కత్తులు నూరిన ఇరాన్ సైతం ఆర్నెల్లక్రితం దిగొచ్చి ఆ దేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుందిగానీ ఉత్తర కొరియా కాస్తయినా తగ్గలేదు. నిజానికి 1994లో తనకున్న ఒక్కగానొక్క అణు రియాక్టర్‌ను మూసేయడానికి...అందుకు బదులుగా విద్యుదుత్పాదన కోసం అమెరికా నిర్మిస్తానన్న రెండు అణు రియాక్టర్లకు తీసుకోవడానికీ ఒప్పుకుంది. డెమొక్రాట్ల పాలనలో కుదిరిన ఆ ఒప్పందాన్ని ఉత్తర కొరియా వ్యవహారశైలిని కారణంగా చూపి జార్జి బుష్ 2002లో రద్దుచేశారు. అప్పటినుంచీ ఉత్తర కొరియా మరింత బిగుసుకుపోయింది. ఉత్తర కొరియాను దారికి తీసుకొచ్చేముందు అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలూ సిద్ధపడాలి. అంతేతప్ప ఆ రంగంలో తమ గుత్తాధిపత్యమే ఉండాలనడం సరైన వాదన కాదు. ప్రపంచంలో ఐఎస్ వంటి ఉగ్రవాద మూకలు విస్తరిస్తున్న వేళ ఎవరి వద్ద అణ్వాయుధాలున్నా అలాంటివారి చేతుల్లో పడటం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రపంచశాంతికి అందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలి. -
విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం!
-
విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం!
అణుబాంబుకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావం ప్రపంచమంతా అణ్వాయుధ తయారీ, వినియోగంపై నియంత్రణ సాధించేందుకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర కొరియా బుధవారం హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. ఈ బాంబు అత్యంత శక్తివంతమైనది. రెండో ప్రపంచయుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకి లపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కన్నా ఈ బాంబు వెయ్యిరెట్లు శక్తివంతమైనది. అయితే అమెరికా ప్రయోగించింది అణుబాంబు. కేంద్రక విచ్ఛిత్తి సూత్రం(న్యూక్లియర్ ఫిషన్) ద్వారా పనిచేస్తుంది. హైడ్రోజన్ అణువు విడిపోవటం ద్వారా శక్తి ఉద్గారం అవుతుంది. కానీ.. హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం(న్యూక్లియర్ ఫ్యుషన్) ద్వారా రూపొందిస్తారు. హైడ్రోజన్ అణువులు వేగంగా వచ్చి ఒకదానితో మరొకటి ఢీకొనటం ద్వారా పెద్దమొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుంది. సూర్యుడిలో శక్తి పుట్టుకకు కారణం కూడా ఈ కేంద్రక సంలీనం చర్యే. హైడ్రోజన్, హీలియం అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనటం ద్వారా విపరీతమైన శక్తితోపాటు.. పెద్దమొత్తంలో కాంతి వెలువడుతుంది. హైడ్రోజన్ బాంబు పేలుడు తీవ్రతకు మైళ్ల దూరంలో ఉండే భవనాలు సైతం నేలమట్టమవుతాయి. ద్వీపమే తుడిచిపెట్టుకుపోయింది.. 1952లో అమెరికా జరిపిన తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష ధాటికి పసిఫిక్ మహా సముద్రంలోని ఓ ద్వీపం మొత్తం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయిందంటే దీని ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం 15 కిలోటన్నులు. ఈ పేలుడు కారణంగా దాదాపు 211 అడుగుల వెడల్పయిన అగ్నిగోళం ఏర్పడింది. దీని ప్రభావంతో.. 82వేల మంది మరణించగా.. దాదాపు 2.18 మైళ్ల విస్తీర్ణంలో తీవ్రమైన రేడియోధార్మికత ఏళ్లతరబడి కొనసాగింది. ప్రపంచం చవిచూసిన తొలి అణువిధ్వంసం ఇదే. నాగసాకిపై 20 కిలోటన్నుల సామర్థ్యమున్న అణుబాంబును ప్రయోగించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యాలు పోటాపోటీగా అణ్వాయుధ నిల్వలను పెంచుకున్నాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం అమల్లోకి రావడంతో అగ్రరాజ్యాలు తమవద్ద ఉన్నఅణ్వాయుధాలను తగ్గించుకున్నాయి. ఇప్పటికీ అమెరికా, రష్యాల వద్ద పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలున్నాయి. ఫ్రాన్స్ (300), యునెటైడ్ కింగ్డమ్ (225), చైనా (260), ఉత్తర కొరియా (8), భారత్ (100), పాకిస్థాన్ (110), ఇజ్రాయెల్ (80) అణుబాంబులు కలిగి ఉన్నట్లు ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ తెలిపింది. - సాక్షి, హైదరాబాద్ -
హైడ్రోజన్ బాంబు పరీక్షించాం
ఉత్తర కొరియా సంచలన ప్రకటన పరీక్ష విజయవంతమైందని అధికార టీవీలో స్పష్టీకరణ అంతర్జాతీయ సమాజం ఆగ్రహం; కఠిన ఆంక్షలకు పిలుపు ♦ కొరియా ప్రకటనను ఇప్పుడే నమ్మలేమన్న అమెరికా ♦ రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించిన దక్షిణ కొరియా ♦ అణ్వాయుధ నిర్మూలనకు కట్టుబడి ఉండాలన్న మిత్రదేశం చైనా ♦ ఉత్తర కొరియా చర్యపై భారత్ ఆందోళన ♦ భద్రతామండలి అత్యవసర భేటీకి ఐరాస పిలుపు ♦ అమెరికాపై అణు క్షిపణి దాడి లక్ష్యంగా ఉత్తర కొరియా పరిశోధనలు సియోల్: అణుబాంబు కన్నా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా బుధవారం సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరకొరియా ప్రకటనే నిజమైతే.. అణ్వాయుధ సంపత్తిలో ఆ దేశం గణనీయ పురోగతి సాధించినట్లవుతుంది. ‘సూక్ష్మీకరించిన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కొనే తాజా అస్త్రం సిద్ధమైంది’ అని అక్కడి అధికార టెలివిజన్‌లో వచ్చిన ప్రకటన.. ఆ దేశవాసుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తించగా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సహా పలు ఉత్తర కొరియా శత్రుదేశాల్లో ఆందోళనావేశాలను పురిగొల్పింది. ‘తొలి హైడ్రోజన్ బాంబును ఈ ఉదయం పది గంటలకు విజయవంతంగా పరీక్షించాం. ఈ చరిత్రాత్మక విజయంతో మనం ఆధునిక అణ్వాయుధ దేశాల స్థాయికి చేరాం’ అన్న ఆ ప్రకటనతో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ వీధుల్లో పౌరులు సంబరాలు చేసుకున్నారు. హైడ్రోజన్ బాంబును తయారు చేశామని గత నెలే ఆ దేశ అత్యున్నత నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన విషయం గమనార్హం. మరో రెండు రోజుల్లో ఆయన జన్మదినం. హైడ్రోజన్ బాంబు పరీక్షలకు సంబంధించిన తొలి ఆదేశాలపై డిసెంబర్ 15న, తుది ఆదేశాలపై జనవరి 3న కిమ్ సంతకం చేశారు. సంతకం పక్కన ‘2016 సంవత్సరం మన అద్భుతమైన హైడ్రోజన్ బాంబు పేలుడుతో ప్రారంభం కావాలి. దాంతో ప్రపంచం దృష్టంతా మన సామ్యవాద, అణ్వాయుధ, గణతంత్ర దేశంవైపునకు మరలాలి’ అని స్వదస్తూరితో రాశారు. అణ్వాయుధం కన్నా వందల రెట్లు ఎక్కువ అమెరికాపై దాడిచేయగల సామర్థ్యమున్న క్షిపణిపై అమర్చగల చిన్న బాంబు తయారీ లక్ష్యంగా ఉత్తర కొరియా శాస్త్రజ్ఞులు సాధించే ప్రతీ విజయం.. అమెరికాకు ఆందోళనకరంగా పరిణమిస్తుంది. అణ్వాయుధాల కన్నా శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును తయారు చేయడం అంత సులభం కాదంటున్న అమెరికా.. హైడ్రోజన్ బాంబును తయారు చేశామంటూ గతంలో ఉత్తర కొరియా చేసిన ప్రకటనలను విశ్వసించలేదు. అణు విచ్ఛిత్తి ఆధారంగా రూపొందే అణు బాంబుల కన్నా.. సంలీన సూత్రంతో తయారయ్యే హైడ్రోజన్ బాంబ్ వందల రెట్లు శక్తిమంతమైనది. దీంతో ఉత్తర కొరియా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. హైడ్రోజన్ తయారీ ఉ.కొరియాకు అంత సులభ సాధ్యం కాదంటూ అణ్వాయుధ నిపుణుడు జెఫ్రీ లూవిస్ అన్నారు. అయితే, ఈ లక్ష్యం దిశగా ఉత్తర కొరియాకు పాకిస్తాన్, ఇరాన్, తదితర మిత్రదేశాల నుంచి సహకారం లభించే అవకాశం ఉందన్నారు. గతంలో మూడుసార్లు(2006, 2009, 2013) అణ్వాయుధ పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా, గత 20 ఏళ్ల అణ్వాయుధ కార్యక్రమంలో అదే అణు విచ్ఛిత్తి సూత్రాన్నే పట్టుకుని వేలాడుతుందనుకోవడం పేర్కొన్నారు. అయితే, ఉత్తర కొరియా ప్రకటనను పలువురు అణ్వాయుధ నిపుణులు విశ్వసించడం లేదు. అది హిరోషిమాపై వేసిన స్థాయి అణు బాంబు అయి ఉండొచ్చని, అంతేకాని అది హైడ్రోజన్ బాంబు కాకపోవచ్చని అమెరికా రక్షణ రంగ విశ్లేషకుడు బ్రూస్ బెనెట్ అన్నారు. అది నిజమైన 2 స్టేజ్ థర్మో న్యూక్లియర్ బాంబు కాదని మరో నిపుణుడు జేమ్స్ ఆస్టన్ తేల్చిచెప్పారు. ఉ.కొరియా అణు పరీక్షా కేంద్రం ‘పంగ్యే రి’ దగ్గరలో 5.1 డిగ్రీల తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని అంతర్జాతీయ భూకంప పరిశీలకులు గుర్తించారు. అయితే, భూ ప్రకంపన తీవ్రత ఆధారంగా అది హైడ్రోజన్ బాంబ్ పేలుడు కాదని తెలుస్తోందని, విఫలమైన హైడ్రోజన్ బాంబు ప్రయోగానికీ అంత తక్కువ శక్తి విడుదల కాదని దక్షిణ కొరియా పేర్కొంది. అది ఉత్తర కొరియా నాలుగో అణు బాంబు పరీక్ష కావచ్చొని పేర్కొంది. తగిన స్పందన ఉంటుంది అమెరికా హెచ్చరిక హైడ్రోజన్ బాంబ్‌ను విజయవంతంగా పరీక్షించామన్న ఉత్తర కొరియా ప్రకటనను ఇప్పుడే నమ్మలేమని అమెరికా ప్రకటించింది. అయితే, అన్ని రకాల రెచ్చగొట్టే చర్యలకు సరైన సమయంలో సరైన స్పందన ఉంటుందని హెచ్చరించింది. ‘ఆ ప్రాంతంలో మా మిత్రదేశాల రక్షణకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని పొరుగుదేశం దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది. అది తమను రెచ్చగొట్టే చర్య అని, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు పెను విఘాతమని ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్హే పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికాతో కూడిన తమ సంయుక్త సాయుధ దళాలకు ఆమె సందేశం పంపించారు. శాంతి సుస్థిరతలపై ప్రభావం: భారత్ ఆందోళన ఉత్తర కొరియా చర్యపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆసియా శాంతి, సుస్థిరతలపై ప్రభావం చూపే అటువంటి ప్రయోగాలకు పాల్పడవద్దని ఉత్తర కొరియాకు విజ్ఞప్తి చేసింది. ఈశాన్య ఆసియాకు, మా పొరుగు దేశాలకు మధ్య ఆయుధ వ్యాప్తి సంబంధాలపై మాకు ఆందోళన ఉంది’ అని పాక్ పేరు ప్రస్తావించకుండా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. నిఘా నివేదికల ప్రకారం, అణు బాంబు తయారీలో వినియోగించే యురేనియం శుద్ధికి ఉపయోగపడే గ్యాస్ సెంట్రిఫ్యూజ్ డిజైన్లను ఉత్తర కొరియాకు పాకిస్తాన్ సరఫరా చేస్తోంది. అందుకు బదులుగా, ఉత్తర కొరియా నుంచి బాలిస్టిక్ క్షిపణులను పొందుతోంది. ఉత్తర కొరియా చర్య మానవాళికి పెను ప్రమాదమని, ఐరాస భద్రతామండలి తీర్మానాల ఉల్లంఘన అని, దీన్ని సహించబోమని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. ఉత్తర కొరియా చర్య అంతర్జాతీయ నిబంధనలు, ఐరాస భద్రతామండలి తీర్మానాల స్పష్టమైన ఉల్లంఘన అని రష్యా పేర్కొంది. ఉత్తర కొరియా చర్యను ఆ దేశ కీలక మిత్రదేశం చైనా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం వ్యతిరేకతను పట్టించుకోకుండా పరీక్షలు జరపడాన్ని ఆక్షేపించింది. అణ్వాయుధ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఆంక్షలకు సంబంధించి, అంతర్జాతీయ సమాజంతో కలిసి నడుస్తామని ప్రకటించింది. ఉత్తర కొరియా రాయబారిని పిలిచి, వివరణ తీసుకుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు. ఉత్తర కొరియా చర్యను బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ.. తదితరాలు ఖండించాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫిలిప్ హామండ్.. కొరియాపై ఆంక్షల విషయంలో చైనాతో కలిసి ఐరాస వేదికగా పనిచేస్తామన్నారు. ఉత్తర కొరియా దుష్టదేశమన్న విషయం ఈ పరీక్షతో స్పష్టమైందని ఆస్ట్రేలియా పేర్కొంది. ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు.. ఉత్తర కొరియా ప్రకటన నేపథ్యంలో ఆ దేశంపై విధించడానికి కొత్త ఆంక్షలు రూపొందించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం సంకల్పించింది. పరీక్షను మండలి తీవ్రంగా ఖండించింది. అది అంతర్జాతీయ శాంతి, భద్రతలకు విఘాతమని అభివర్ణించింది. ఉత్తర కొరియా బాంబు పరీక్ష నిర్వహించి ఐరాస తీర్మానాలకు తీవ్రంగా ఉల్లంఘించిందని, ఆ దేశంపై మండలి సభ్య దేశాలు చర్యలకు ఉపక్రమిస్తాయని వెల్లడించింది. -
ఉత్తర కొరియా ‘బాంబు’ ప్రయోగం విఫలమా?
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పది గంటలకు ‘హైడ్రోజన్ బాంబు’ పరీక్షను నిర్వహించిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హైడ్రోజన్ బాంబు ప్రయోగంలో తాము అద్భుత విజయం సాధించామని ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్ గర్వంగా చాటుకున్నారు కూడా. అయితే ఈ ప్రయోగంలో ఉత్తర కొరియా పూర్తిగా విఫలమైందని అంతర్జాతీయ నిపుణులు వాదిస్తున్నారు. వారిలో కొందరు అతి తక్కువ విస్ఫోటన శక్తి కలిగిన అటామిక్ బాంబును పరీక్షించి ఉంటారని అనుమానిస్తున్నారు. బాంబు పరీక్ష కారణంగా ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 శాతం తీవ్రతతో మాత్రమే భూ ప్రకంపనలు వచ్చాయని, గాలిలోకి వ్యాపించిన వాయువులు పరిమాణం కూడా బాగా తక్కువగా ఉందని అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు తెలిపారు. నిజంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టయితే దీనికన్నా వంద రెట్ల ఎక్కువ శక్తి విడుదలవుతోందని ఆయన అన్నారు. అమెరికా 1952లో దక్షిణ పసిఫిక్‌లోని ఎన్వెట్‌లాక్ అటోల్లో నిర్వహించిన హైడ్రోజన్ బాంబు పేలుడులో వందరెట్లకు పైగా శక్తి వెలువడిందని, ఉత్తర కొరియా నిర్వహించిన పరీక్షలో తక్కువ శక్తి వెలువడడానికి కారణం ‘ఫ్యూజన్’ సరిగ్గా జరిగి ఉండక పోవచ్చని అంతర్జాతీయ నిపుణులు వాదిస్తున్నారు. హైడ్రోజన్ బాంబ్ పేలుడు శక్తిని కిలోటన్స్‌లో కొలుస్తారన్న విషయం తెల్సిందే. అగ్రరాజ్యాలకు సవాల్‌గా కొత్త సంవత్సరాన్ని థ్రిల్లింగ్ ధ్వనితో జరుపుకుంటున్నామని కిమ్‌జాంగ్ ఉన్ వ్యాఖ్యానించగా, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇలాంటి ప్రయోగానికి ఉత్తరకొరియా తెరతీసిందని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ తాజా పరిణామం గురించి చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి మరోపక్క సమావేశమైంది. ప్రపంచంలోనే అమెరికా మొట్టమొదటి సారిగా హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించగా, ఏడాది తర్వాత అప్పటి సోవియట్ యూనియన్, ఆ తర్వాత చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రయోగ పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా ప్రయోగం కూడా నిజమైతే హైడ్రోజన్ బాంబును తయారు చేసిన ఆరవ దేశం ఉత్తర కొరియా అవుతుంది. -
అమెరికా విషవిధానం మారనంత వరకూ..!
సియోల్: అణుబాంబు కంటే కూడా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించడం ద్వారా ఉత్తర కొరియా ప్రపంచదేశాలను విస్మయంలో ముంచెత్తింది. అణ్వాయుధ అభివృద్ధిలో సంపన్న దేశాలకు దీటుగా ముందడుగు వేసినట్టు ప్రపంచానికి చాటింది. '2016 జనవరి 6న ఉదయం పది గంటలకు మనం దేశం విజయవంతంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. వర్కర్స్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయానికి అనుగుణంగా ఈ పరీక్షలు జరిగాయి' అని ఉత్తర కొరియా ప్రభుత్వ టెలివిజన్ న్యూస్ రీడర్ ప్రకటించారు. ఈ చారిత్రక పరీక్షను పరిపూర్ణంగా నిర్వహించడం ద్వారా అత్యాధునిక అణ్వాయుధ పరిజ్ఞానం కలిగిన దేశాల సరసన ఉత్తర కొరియా నిలిచినట్టు తెలిపారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలో భాగంగా అతి చిన్న పరికరాన్ని మాత్రమే ప్రస్తుతం పరీక్షించినట్టు న్యూస్ రీడర్ చెప్పారు. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు.. ఆయన సూచనల మేరకే హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. గత డిసెంబర్లోనే తాము హైడ్రోజన్ బాంబు తయారుచేసినట్టు కిమ్ ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనను అంతర్జాతీయ నిపుణులు కొట్టిపారేశారు. అయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, స్వేదేశీ మానవ వనరులతో ఈ పరీక్షను నిర్వహించినట్టు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న ప్రతిజ్ఞకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే అత్యాధునిక అణ్వాయుధ సంపత్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోబోమని ఉత్తర కొరియా తెలిపింది. 'ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా విషపూరిత విధానాన్ని కొనసాగించినంతకాలం.. మా అణు అభివృద్ధి కార్యక్రమాన్ని మానుకోబోం' అని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా భయాందోళనలు అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించడంపై అంతర్జాతీయంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యపై పొరుగుదేశం జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత భద్రతకు ప్రమాదకరమని జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. అమెరికా కూడా ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి.. ఈ అంశంపై చర్చించనుంది. -
హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!
-
హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!
ఉత్తరకొరియా 'బాంబు' లాంటి వార్తను పేల్చింది. అణుబాంబు కంటే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ప్రభావంతో.. ఈశాన్య ఉత్తరకొరియాలో 5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం' సంభవించింది. అంతకుముందు.. అందరూ ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా.. కృత్రిమ భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్దస్థాయిలో చర్చ మొదలవ్వడంతో.. చివరకు ఉత్తరకొరియానే అధికారికంగా అసలు విషయాన్ని ప్రకటించింది. ఇటీవలి కాలంలోఅమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ బుధవారం ఉదయం వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. సత్తా చాటేందుకే.. మరో రెండు రోజుల్లో.. అంటే ఈనెల 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు ఉండటంతో తమ సత్తాను నిరూపించుకోడానికి, తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు. -
'మా వద్ద హైడ్రోజన్ బాంబు ఉంది'
ఉత్తర కొరియా: తన వద్ద హైడ్రోజన్ బాంబు (థర్మో న్యూక్లియర్ బాంబు) ఉందని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అది అధికారికంగా రుజువైతే హైడ్రోజన్ బాంబు కలిగి ఉన్న దేశంగా ఇప్పటినుంచి ఉత్తర కొరియాను కూడా పరిగణించాల్సి ఉంటుంది. వాస్తవానికి హైడ్రోజన్ బాంబును తయారు చేసే దిశగా ఉత్తర కొరియా ముందడుగు వేస్తున్నట్లు ప్రపంచానికి ఇటీవలే తెలిసింది. అయితే, స్వయంగా ఆ బాంబును తయారుచేసుకునే పరిజ్ఞానం ఉత్తర కొరియాకు ఉందా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియదు. ఒక్క హైడ్రోజన్ బాంబు అటామిక్ బాంబులకంటే వందరెట్లు శక్తిమంతమైనది. ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ అన్ తమ దేశంలోని విపణి తయారీ పరిశ్రమలను సందర్శించిన అనంతరం తమ వద్ద ఉన్న ఆయుధాల గురించి వివరించారు. 'మా వద్ద పరీక్షించేందుకు అటామిక్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు సిద్ధంగా ఉన్నాయి. అవి మా దేశ సార్వభౌమత్వాన్ని, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయని భావిస్తున్నాం' అని ఆయన చెప్పారు.