అమెరికా నెత్తిన హైడ్రోజన్ బాంబు గురి
సాక్షి, సియోల్: అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తరకొరియా ఆదివారం ప్రకటించింది. ఈ బాంబును జులైలో ప్రయోగించి ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం) హస్వాంగ్-14కి అమర్చేందుకు అనువుగా తయారు చేసినట్లు చెప్పింది. ఈ బాంబుతో అణు క్షిపణి అమెరికాను చేరుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐసీబీఎంకి హైడ్రోజన్ బాంబును అమర్చడానికి తగు ప్రయోగాలను చేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారని ఆ దేశ అధికారిక మీడియా ఓ ప్రకటనలో చెప్పింది. అభివృద్ధి చేసిన హైడ్రోజన్ బాంబును ఎంత మోతాదులో కావాలంటే అంత మోతాదు(10 కిలో టన్నుల నుంచి 100 కిలో టన్నుల వరకూ)లో ప్రయోగించొచ్చని తెలిపింది. మిగిలిన బాంబులతో పోల్చితే అత్యధిక ఎత్తులో ఈ బాంబును పేల్చొచ్చని చెప్పింది. దీని ద్వారా జరిగే వినాశనం కనీవినీ ఎరుగుని రీతిలో ఉంటుందని పేర్కొంది.
జూచే బేసిస్
హైడ్రోజన్ బాంబు తయారీలో ఉపయోగించిన పూచికపుల్ల కూడా ఉత్తరకొరియా దేశీయంగా అభివృద్ధి చేసిందేనని వెల్లడించింది. దీంతో ఎన్ని కావాలంటే అన్ని అణు ఆయుధాలను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయిందని తెలిపింది. మార్క్సిజమ్, తీవ్రవాద భావజాలల నుంచి పుట్టినదే జూచే బేసిస్. దీనికి ఆద్యుడు కిమ్ జాంగ్ ఉన్ తాతయ్య కిమ్ 2 సంగ్. జూచే బేసిస్‌ను దృష్టిలో ఉంచుకునే దేశీయ టెక్నాలజీతో మాత్రమే హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని ఉత్తరకొరియా పేర్కొంది.
ఐసీబీఎంలో ఇన్‌స్టాలేషన్‌కు సిద్ధంగా ఉన్న హైడ్రోజన్ బాంబును కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఫొటోలను కూడా విడుదల చేసింది. చిత్రంలో హస్వాంగ్-14 క్షిపణి కోసం సిద్ధం చేసిన సిల్వర్ కలర్ హైడ్రోజన్ బాంబును కిమ్ తదేకంగా చూస్తున్నారు.
ఉత్తరకొరియా చర్యలతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో కొద్ది నెలలుగా ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, ఉత్తరకొరియా కొత్తగా అణు పరీక్షను జరిపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరకొరియా ఇప్పటివరకూ ఐదు సార్లు అణుపరీక్ష జరిపింది. అయితే, ఉత్తరకొరియా మీడియా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.