ఉత్తరకొరియాను సమూల నాశనం చేస్తాం: అమెరికా
సాక్షి, వాషింగ్టన్: దేశ చరిత్రలో నేటి వరకూ అత్యంత శక్తిమంతమైన అణు పరీక్షను నిర్వహించామని ఉత్తరకొరియా ప్రకటించడంతో అమెరికా కిమ్ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరకొరియాపై సాయుధ దళాలను ప్రయోగించక తప్పదని పేర్కొంది. ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేయడానికి కూడా వెనుకాడబోమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మ్యాటిస్ పేర్కన్నారు.
అమెరికా, దాని భూభాగాలు, గ్వామ్, అమెరికాతో సత్సంబంధాలు కలిగిన దేశాలకు హాని తలపెట్టాలని చూస్తే ఉత్తరకొరియాను అణచి వేస్తామని చెప్పారు. కిమ్.. ఐక్యరాజ్యసమితి గొంతును తలకెక్కించుకుంటే మంచిదని పేర్కొన్నారు. మ్యాటిస్ మీడియా సమావేశానికి కంటే ముందు పత్రికా ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్.. ప్యాంగ్‌యాంగ్‌పై అమెరికా దాడి చేస్తుందా? అనే ప్రశ్నకు ఆ దిశగా కూడా ఆలోచిస్తామన్నారు.
ఉత్తరకొరియాకు మాటల్తో చెప్తే సరిపోదని, చేతలు అవసరమని మీడియా భేటీ అనంతరం ట్రంప్ ట్వీట్ చేశారు. హిరోషిమా, నాగసాకిలపై వినియోగించిన అణు బాంబు కంటే ఏడు రెట్లు అత్యధిక సామర్ధ్యం కలిగినది కూడా నార్త్ కొరియా చెప్పింది. దీన్ని ఖండాంతర క్షిపణి హస్వాంగ్-14కు అమర్చనున్నట్లు వెల్లడించింది. అమెరికాతో పాటు జపాన్, చైనా, భారత్, మరిన్ని ప్రపంచ దేశాలు కూడా ఉత్తరకొరియా ప్రకటనను ఖండించాయి.