హైడ్రోజన్ బాంబు పరీక్షించాం | The hydrogen bomb tested | Sakshi
Sakshi News home page

హైడ్రోజన్ బాంబు పరీక్షించాం

Published Thu, Jan 7 2016 1:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

హైడ్రోజన్ బాంబు పరీక్షించాం - Sakshi

హైడ్రోజన్ బాంబు పరీక్షించాం

ఉత్తర కొరియా సంచలన ప్రకటన  
పరీక్ష విజయవంతమైందని అధికార టీవీలో స్పష్టీకరణ

 
అంతర్జాతీయ సమాజం ఆగ్రహం; కఠిన ఆంక్షలకు పిలుపు
♦ కొరియా ప్రకటనను ఇప్పుడే నమ్మలేమన్న అమెరికా
♦ రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించిన దక్షిణ కొరియా
♦ అణ్వాయుధ నిర్మూలనకు కట్టుబడి ఉండాలన్న మిత్రదేశం చైనా
♦ ఉత్తర కొరియా చర్యపై భారత్ ఆందోళన
♦ భద్రతామండలి అత్యవసర భేటీకి ఐరాస పిలుపు
♦ అమెరికాపై అణు క్షిపణి దాడి లక్ష్యంగా ఉత్తర కొరియా పరిశోధనలు  
 
 సియోల్: అణుబాంబు కన్నా అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా బుధవారం సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరకొరియా ప్రకటనే నిజమైతే.. అణ్వాయుధ సంపత్తిలో ఆ దేశం గణనీయ పురోగతి సాధించినట్లవుతుంది. ‘సూక్ష్మీకరించిన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించింది. ఆ ప్రయోగం అద్భుతంగా విజయవంతమైంది. అమెరికా సహా శత్రుదేశాలను ఎదుర్కొనే తాజా అస్త్రం సిద్ధమైంది’ అని అక్కడి అధికార టెలివిజన్‌లో వచ్చిన ప్రకటన.. ఆ దేశవాసుల్లో ఆనందోత్సాహాలను రేకెత్తించగా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సహా పలు ఉత్తర కొరియా శత్రుదేశాల్లో ఆందోళనావేశాలను పురిగొల్పింది.

‘తొలి హైడ్రోజన్ బాంబును ఈ ఉదయం పది గంటలకు విజయవంతంగా పరీక్షించాం. ఈ చరిత్రాత్మక విజయంతో మనం ఆధునిక అణ్వాయుధ దేశాల స్థాయికి చేరాం’ అన్న ఆ ప్రకటనతో ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ వీధుల్లో పౌరులు సంబరాలు చేసుకున్నారు. హైడ్రోజన్ బాంబును తయారు చేశామని గత నెలే ఆ దేశ అత్యున్నత నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన విషయం గమనార్హం. మరో రెండు రోజుల్లో ఆయన జన్మదినం. హైడ్రోజన్ బాంబు పరీక్షలకు సంబంధించిన తొలి ఆదేశాలపై డిసెంబర్ 15న, తుది ఆదేశాలపై జనవరి 3న కిమ్ సంతకం చేశారు. సంతకం పక్కన ‘2016 సంవత్సరం మన అద్భుతమైన హైడ్రోజన్ బాంబు పేలుడుతో ప్రారంభం కావాలి. దాంతో ప్రపంచం దృష్టంతా మన సామ్యవాద, అణ్వాయుధ, గణతంత్ర దేశంవైపునకు మరలాలి’ అని స్వదస్తూరితో రాశారు.

 అణ్వాయుధం కన్నా వందల రెట్లు ఎక్కువ
 అమెరికాపై దాడిచేయగల సామర్థ్యమున్న క్షిపణిపై అమర్చగల చిన్న బాంబు తయారీ లక్ష్యంగా ఉత్తర కొరియా శాస్త్రజ్ఞులు సాధించే ప్రతీ విజయం.. అమెరికాకు ఆందోళనకరంగా పరిణమిస్తుంది. అణ్వాయుధాల కన్నా శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును తయారు చేయడం అంత సులభం కాదంటున్న అమెరికా.. హైడ్రోజన్ బాంబును తయారు చేశామంటూ గతంలో ఉత్తర కొరియా చేసిన ప్రకటనలను విశ్వసించలేదు. అణు విచ్ఛిత్తి ఆధారంగా రూపొందే అణు బాంబుల కన్నా.. సంలీన సూత్రంతో తయారయ్యే హైడ్రోజన్ బాంబ్ వందల రెట్లు శక్తిమంతమైనది. దీంతో ఉత్తర కొరియా ప్రకటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

హైడ్రోజన్ తయారీ ఉ.కొరియాకు అంత సులభ సాధ్యం కాదంటూ అణ్వాయుధ నిపుణుడు జెఫ్రీ లూవిస్ అన్నారు. అయితే, ఈ లక్ష్యం దిశగా ఉత్తర కొరియాకు పాకిస్తాన్, ఇరాన్, తదితర మిత్రదేశాల నుంచి సహకారం లభించే అవకాశం ఉందన్నారు. గతంలో మూడుసార్లు(2006, 2009, 2013) అణ్వాయుధ పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా, గత 20 ఏళ్ల అణ్వాయుధ కార్యక్రమంలో అదే అణు విచ్ఛిత్తి సూత్రాన్నే పట్టుకుని వేలాడుతుందనుకోవడం పేర్కొన్నారు. అయితే, ఉత్తర కొరియా ప్రకటనను పలువురు అణ్వాయుధ నిపుణులు విశ్వసించడం లేదు.

అది హిరోషిమాపై వేసిన స్థాయి అణు బాంబు అయి ఉండొచ్చని, అంతేకాని అది హైడ్రోజన్ బాంబు కాకపోవచ్చని అమెరికా రక్షణ రంగ విశ్లేషకుడు బ్రూస్ బెనెట్ అన్నారు. అది నిజమైన 2 స్టేజ్ థర్మో న్యూక్లియర్ బాంబు కాదని మరో నిపుణుడు జేమ్స్ ఆస్టన్ తేల్చిచెప్పారు. ఉ.కొరియా అణు పరీక్షా కేంద్రం ‘పంగ్యే రి’ దగ్గరలో 5.1 డిగ్రీల తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని అంతర్జాతీయ భూకంప పరిశీలకులు గుర్తించారు. అయితే,  భూ ప్రకంపన తీవ్రత ఆధారంగా అది హైడ్రోజన్ బాంబ్ పేలుడు కాదని తెలుస్తోందని, విఫలమైన హైడ్రోజన్ బాంబు ప్రయోగానికీ  అంత తక్కువ శక్తి విడుదల కాదని దక్షిణ కొరియా  పేర్కొంది. అది ఉత్తర కొరియా నాలుగో అణు బాంబు పరీక్ష కావచ్చొని పేర్కొంది.
 
 తగిన స్పందన ఉంటుంది
 అమెరికా హెచ్చరిక
 హైడ్రోజన్ బాంబ్‌ను విజయవంతంగా పరీక్షించామన్న ఉత్తర కొరియా ప్రకటనను ఇప్పుడే నమ్మలేమని అమెరికా ప్రకటించింది. అయితే, అన్ని రకాల రెచ్చగొట్టే చర్యలకు సరైన సమయంలో సరైన స్పందన ఉంటుందని హెచ్చరించింది. ‘ఆ ప్రాంతంలో మా మిత్రదేశాల రక్షణకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని పొరుగుదేశం దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది. అది  తమను రెచ్చగొట్టే చర్య అని,  అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు పెను విఘాతమని ఆ దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్‌హే పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికాతో కూడిన తమ సంయుక్త సాయుధ దళాలకు ఆమె సందేశం పంపించారు.

 శాంతి సుస్థిరతలపై ప్రభావం: భారత్ ఆందోళన
 ఉత్తర కొరియా చర్యపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆసియా శాంతి, సుస్థిరతలపై ప్రభావం చూపే అటువంటి ప్రయోగాలకు పాల్పడవద్దని ఉత్తర కొరియాకు విజ్ఞప్తి చేసింది. ఈశాన్య ఆసియాకు, మా పొరుగు దేశాలకు మధ్య ఆయుధ వ్యాప్తి సంబంధాలపై మాకు ఆందోళన ఉంది’ అని పాక్ పేరు ప్రస్తావించకుండా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. నిఘా నివేదికల ప్రకారం, అణు బాంబు తయారీలో వినియోగించే యురేనియం శుద్ధికి ఉపయోగపడే గ్యాస్ సెంట్రిఫ్యూజ్ డిజైన్‌లను ఉత్తర కొరియాకు పాకిస్తాన్ సరఫరా చేస్తోంది. అందుకు బదులుగా, ఉత్తర కొరియా నుంచి బాలిస్టిక్ క్షిపణులను పొందుతోంది.

ఉత్తర కొరియా చర్య మానవాళికి పెను ప్రమాదమని, ఐరాస భద్రతామండలి తీర్మానాల ఉల్లంఘన అని, దీన్ని సహించబోమని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. ఉత్తర కొరియా చర్య అంతర్జాతీయ నిబంధనలు, ఐరాస భద్రతామండలి తీర్మానాల స్పష్టమైన ఉల్లంఘన అని రష్యా పేర్కొంది.  ఉత్తర కొరియా చర్యను ఆ దేశ కీలక మిత్రదేశం చైనా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం వ్యతిరేకతను పట్టించుకోకుండా పరీక్షలు జరపడాన్ని ఆక్షేపించింది. అణ్వాయుధ నిర్మూలనకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఆంక్షలకు సంబంధించి, అంతర్జాతీయ సమాజంతో కలిసి నడుస్తామని ప్రకటించింది.

ఉత్తర కొరియా రాయబారిని పిలిచి, వివరణ తీసుకుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ వెల్లడించారు. ఉత్తర కొరియా చర్యను బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ.. తదితరాలు ఖండించాయి. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫిలిప్ హామండ్.. కొరియాపై ఆంక్షల విషయంలో చైనాతో కలిసి ఐరాస వేదికగా పనిచేస్తామన్నారు. ఉత్తర కొరియా దుష్టదేశమన్న విషయం ఈ పరీక్షతో స్పష్టమైందని ఆస్ట్రేలియా పేర్కొంది.

 ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలు..
 ఉత్తర కొరియా ప్రకటన నేపథ్యంలో ఆ దేశంపై విధించడానికి కొత్త ఆంక్షలు రూపొందించాలని   ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం సంకల్పించింది. పరీక్షను మండలి తీవ్రంగా ఖండించింది. అది అంతర్జాతీయ శాంతి, భద్రతలకు విఘాతమని అభివర్ణించింది. ఉత్తర కొరియా బాంబు పరీక్ష నిర్వహించి ఐరాస తీర్మానాలకు తీవ్రంగా ఉల్లంఘించిందని, ఆ దేశంపై మండలి సభ్య దేశాలు చర్యలకు ఉపక్రమిస్తాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement