అమెరికా 1952లో దక్షిణ పసిఫిక్‌లోని ఎన్వెట్‌లాక్ అటోల్‌లో నిర్వహించిన హైడ్రోజన్ బాంబు
ప్యాంగ్‌యాంగ్: ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పది గంటలకు ‘హైడ్రోజన్ బాంబు’ పరీక్షను నిర్వహించిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హైడ్రోజన్ బాంబు ప్రయోగంలో తాము అద్భుత విజయం సాధించామని ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్ గర్వంగా చాటుకున్నారు కూడా. అయితే ఈ ప్రయోగంలో ఉత్తర కొరియా పూర్తిగా విఫలమైందని అంతర్జాతీయ నిపుణులు వాదిస్తున్నారు. వారిలో కొందరు అతి తక్కువ విస్ఫోటన శక్తి కలిగిన అటామిక్ బాంబును పరీక్షించి ఉంటారని అనుమానిస్తున్నారు.
బాంబు పరీక్ష కారణంగా ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.1 శాతం తీవ్రతతో మాత్రమే భూ ప్రకంపనలు వచ్చాయని, గాలిలోకి వ్యాపించిన వాయువులు పరిమాణం కూడా బాగా తక్కువగా ఉందని అమెరికాకు చెందిన ర్యాండ్ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు తెలిపారు. నిజంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్టయితే దీనికన్నా వంద రెట్ల ఎక్కువ శక్తి విడుదలవుతోందని ఆయన అన్నారు. అమెరికా 1952లో దక్షిణ పసిఫిక్‌లోని ఎన్వెట్‌లాక్ అటోల్‌లో నిర్వహించిన హైడ్రోజన్ బాంబు పేలుడులో వందరెట్లకు పైగా శక్తి వెలువడిందని, ఉత్తర కొరియా నిర్వహించిన పరీక్షలో తక్కువ శక్తి వెలువడడానికి కారణం ‘ఫ్యూజన్’ సరిగ్గా జరిగి ఉండక పోవచ్చని అంతర్జాతీయ నిపుణులు వాదిస్తున్నారు. హైడ్రోజన్ బాంబ్ పేలుడు శక్తిని కిలోటన్స్‌లో కొలుస్తారన్న విషయం తెల్సిందే.
అగ్రరాజ్యాలకు సవాల్‌గా కొత్త సంవత్సరాన్ని థ్రిల్లింగ్ ధ్వనితో జరుపుకుంటున్నామని కిమ్‌జాంగ్ ఉన్ వ్యాఖ్యానించగా, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఇలాంటి ప్రయోగానికి ఉత్తరకొరియా తెరతీసిందని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ తాజా పరిణామం గురించి చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి మరోపక్క సమావేశమైంది. ప్రపంచంలోనే అమెరికా మొట్టమొదటి సారిగా హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించగా, ఏడాది తర్వాత అప్పటి సోవియట్ యూనియన్, ఆ తర్వాత చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రయోగ పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా ప్రయోగం కూడా నిజమైతే హైడ్రోజన్ బాంబును తయారు చేసిన ఆరవ దేశం ఉత్తర కొరియా అవుతుంది.