ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా? | we have hydrogen bomb, says north korea | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా?

Published Fri, Jan 8 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా?

ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా?

నిజమో, అలవాటుగా చెప్పే బడాయి కబుర్లో...‘ధూర్త దేశం’గా ముద్రపడి అనేకానేక ఆంక్షల నడుమ రోజులు వెళ్లదీస్తున్న ఉత్తర కొరియా బుధవారం పేల్చిన బాంబు లాంటి వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాము శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఆ వార్త సారాంశం. ఆ వెనకే అమెరికా మొదలుకొని రష్యా, చైనాల వరకూ అనేక దేశాలు ఉత్తర కొరియా తీరును తీవ్రంగా ఖండించాయి.

అంతర్జాతీయ కట్టుబాట్లను ఉత్తర కొరియా ఉల్లంఘించడంపై మన దేశం కూడా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ సంగతిని చర్చించడం కోసం భద్రతామండలి సమావేశం కాబోతున్నది. ఉత్తర కొరియా మాటల్లో నిజమెంత అని తర్కిస్తూనే...అది నిజమైతే గనుక ప్రమాదకర పరిణామమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అందరికన్నా ఎక్కువగా ఖేదపడుతున్నది అమెరికానే! ప్రపంచంలో కొత్తగా ఎవరూ అణ్వాయుధాల జోలికి పోకుండా చూసే బాధ్యతను తనకు తాను భుజాన వేసుకోవడంవల్ల కావొచ్చు... తానే 1952లో కనిపెట్టిన ఈ మహమ్మారి బాంబు పరిజ్ఞానం బద్ధ శత్రువు ఉత్తర కొరియాకు చిక్కడమేమిటన్న విచికిత్స కావొచ్చు-అమెరికా మాత్రం గట్టిగానే హెచ్చరించింది. ఉత్తర కొరియా పరీక్షించింది ఏ మాదిరి బాంబు అన్నది నిర్ధారణ కావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చుగానీ...ఆ దేశం ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్టు అంతర్జాతీయ భూకంప పర్యవేక్షణ వ్యవస్థ ప్రకటించింది.
 
ఉత్తర కొరియా 2006లో తొలి అణు పరీక్ష జరిపింది. ఇప్పుడు జరిపిన పరీక్ష నాలుగోది. ఈ మాదిరి పరీక్షలు ప్రపంచంలో ఇప్పటివరకూ అసంఖ్యాకంగా జరిగాయి. వీటిలో అగ్ర స్థానం అమెరికాదే. ఆ దేశం ఇంతవరకూ 1,032 అణు పరీక్షలు నిర్వహించింది. 727 అణు పరీక్షలతో రెండో స్థానంలో రష్యా, 217 పరీక్షలతో మూడో స్థానంలో ఫ్రాన్స్, 88 పరీక్షలతో నాలుగో స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. చైనా 47 అణు పరీక్షలు నిర్వహిస్తే మన దేశం 3, పాకిస్థాన్ 2 జరిపాయి. మన దేశం 1998లో జరిపిన పరీక్ష హైడ్రోజన్ బాంబుకు సంబంధించిందే.

అణ్వాయుధాలన్నిటిలో ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెబుతారు. ఏకకా లంలో విస్తృతమైన ప్రాంతాన్ని  బూడిదగా మార్చగల ఈ బాంబును క్షిపణుల ద్వారా ప్రయోగించడానికి అనువుగా చిన్న సైజులో కూడా తయారు చేయొచ్చు. హైడ్రోజన్ రేడియోధార్మిక రూపమైన ట్రిటియంను స్వల్ప మొత్తంలో ఆటం బాంబులో చేర్చినా అది హైడ్రోజన్ బాంబుగా మారి పెను విధ్వంసాన్ని కలిగిస్తుం దని నిపుణులు చెబుతారు. ఇరుగు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌ల మాట అలా ఉంచి అమెరికా ఆందోళన పడటానికి ప్రధాన కారణం ఇదే. దేశదేశా ల్లోనూ సైనిక స్థావరాలున్న అమెరికాకు ఇప్పుడు ఉత్తర కొరియా రూపంలో పెను సవాల్ ఎదురైంది.   

జపాన్ వలస పాలనతో సర్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియాలో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో ఆనాటి సోవియెట్ యూనియన్ దళాలు అడుగుపెట్టాయి. అందుకు పోటీగా అమెరికా సైతం దండెత్తి వచ్చి దేశ దక్షిణ భాగంలో తిష్ట వేసింది. ఫలితంగా ఆ దేశం రెండుగా విడిపోయింది. అప్పట్లో దక్షిణ కొరియా పెట్టుబడిదారీ దేశాలతో చేరి, అమెరికా అండదండలతో సర్వతో ముఖాభివృద్ధి సాధించింది. ఇటు ఉత్తర కొరియా తనను తాను సోషలిస్టు దేశంగా చెప్పుకుంటుంది. కానీ అక్కడ నడిచేది అనువంశిక పాలన. ఉభయ కొరియాల మధ్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి వైషమ్యాలు ఇప్పటికీ కొనసాగడమే ప్రస్తుత స్థితికి కారణం. 30,000మంది బలగాలతో మోహరించిన అమెరికా దన్నుతో దక్షిణ కొరియా రేపో మాపో తనను సర్వనాశనం చేస్తుందని ఆ దేశం విశ్వసిస్తుంది. అందుకు నిరంతరం సంసిద్ధమై ఉంటుంది.

ఖండాంతర క్షిపణులు రూపొందించు కోవడం, అణ్వాయుధాలు పోగేసుకోవడం ఆ సంసిద్ధతలో భాగమే. అలాగని అది సంపన్న దేశమేమీ కాదు. ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలకు తోడు  పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని కుంగదీస్తున్నాయి. ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతున్నదన్న సంగతి బయటి ప్రపంచానికి తెలియదు. ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడల్లా జోక్యం చేసుకుని చక్కదిద్దే చైనా, రష్యాలకైనా ఎంతవరకూ తెలుసునో చెప్పలేం. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా బయటి సమాచారం లోపలికీ... లోపలి సమాచారం బయటికీ పొక్కకుండా తనచుట్టూ ఉత్తర కొరియా ఉక్కు కుడ్యాన్ని నిర్మించుకుంది. దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్ వింత పోకడలు, విపరీత ప్రవర్తనపై అప్పుడప్పుడు పాశ్చాత్య మీడియా బయటి ప్రపంచానికి వెల్లడించే తమాషా వార్తలే ఉత్తర కొరియాను ఊహించుకోవడానికి ఆధారం. ఆ వార్తలకైనా దక్షిణ కొరియానుంచి అందే గుసగుసలే మూలం. ఒక్కటైతే నిజం... కిమ్ జోంగ్-ఉన్ మొండి ఘటం. దశాబ్దాలుగా అమెరికాపై కత్తులు నూరిన ఇరాన్ సైతం ఆర్నెల్లక్రితం దిగొచ్చి ఆ దేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుందిగానీ ఉత్తర కొరియా కాస్తయినా తగ్గలేదు.

నిజానికి 1994లో తనకున్న ఒక్కగానొక్క అణు రియాక్టర్‌ను మూసేయడానికి...అందుకు బదులుగా విద్యుదుత్పాదన కోసం అమెరికా నిర్మిస్తానన్న రెండు అణు రియాక్టర్లకు తీసుకోవడానికీ ఒప్పుకుంది. డెమొక్రాట్ల పాలనలో కుదిరిన ఆ ఒప్పందాన్ని ఉత్తర కొరియా వ్యవహారశైలిని కారణంగా చూపి జార్జి బుష్ 2002లో రద్దుచేశారు. అప్పటినుంచీ ఉత్తర కొరియా మరింత బిగుసుకుపోయింది. ఉత్తర కొరియాను దారికి తీసుకొచ్చేముందు అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలూ సిద్ధపడాలి. అంతేతప్ప ఆ రంగంలో తమ గుత్తాధిపత్యమే ఉండాలనడం సరైన వాదన కాదు. ప్రపంచంలో ఐఎస్ వంటి ఉగ్రవాద మూకలు విస్తరిస్తున్న వేళ ఎవరి వద్ద అణ్వాయుధాలున్నా అలాంటివారి చేతుల్లో పడటం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రపంచశాంతికి అందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement