nuclear reactor
-
పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్
న్యూక్లియర్ రియాక్టర్.. ఈ పేరు చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు విని ఉంటారు. ఇది పవర్ ప్లాంట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారని చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు మన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తే?.. న్యూక్లియర్ రియాక్టర్ ఏమిటి.. రోజువారీ వినియోగానికి ఉపయోగించడమేమిటని చాలామందిలో సందేహం రావచ్చు. ఈ అనుమానం పోవాలంటే ఈ కథనం తప్పకుండా చదివేయాల్సిందే..వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ అభివృద్ధి చేస్తోంది. స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ 'ఈవిన్సి' (eVinci) అనే న్యూక్లియర్ రియాక్టర్ రూపొందిస్తోంది. ఇది పరిమాణంలో 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది 15 మెగావాట్ల థర్మల్ (MWth) కోర్ డిజైన్‌తో 5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి వచ్చే శక్తిని అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు.వెస్టింగ్‌హౌస్ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్లో ఒకసారి ఇంధనాన్ని నింపితే ఎనిమిది సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇంధనం పూర్తయిన తరువాత కంపెనీ దీనిని మళ్ళీ తీసుకెళ్లి ఇంధనం నింపి ఇస్తుంది లేదా కొత్త రియాక్టర్‌తో రీప్లేస్ చేస్తుంది. దీనిని ఒకసారి ఒక ప్రదేశంలో ఫిక్స్ చేస్తే మళ్ళీ కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా దీనిని ప్రత్యేకంగా కూలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రియాక్టర్లో TRISO (ట్రై స్ట్రక్చరల్ ఐఎస్ఓ ట్రాఫిక్ పార్టికల్ ఫ్యూయల్) ఇంధనం వినియోగిస్తారు.ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే శక్తిని మైనింగ్, డ్రిల్లింగ్ కార్యకలాపాలకు, పారిశ్రామిక సౌకర్యాలకు, డిస్ట్రిక్ట్ హీటింగ్, హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన, సైనిక స్థావరాలలో, డేటా సెంటర్లలో ఉపయోగించుకోవచ్చు.కంపెనీ ఈవిన్సి మైక్రో రియాక్టర్ ప్రిలిమినరీ సేఫ్టీ డిజైన్ రిపోర్టును డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE) నేషనల్ రియాక్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (NRIC)కి అందించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామని.. ఈవిన్సి టెక్నాలజీస్ ప్రెసిడెంట్ 'జోన్ బాల్' అన్నారు. -
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
భారీ ప్రయోగానికి సిద్ధమైన అమెరికా..ఏకంగా నక్షత్ర శక్తినే..!
కోతల్లేని, కాలుష్యం ఊసే లేని, కారుచౌక విద్యుత్ అందరికీ అందుబాటులోకి వస్తే...? ఈ ఊహే అద్భుతం. కానీ వీలవుతుందా? అన్న ప్రశ్న కూడా మనల్ని వెంటాడుతుంది. సూర్యుడిలో జరిగే ‘తంతు’ను భూమ్మీద కృత్రిమంగా సృష్టిస్తే చాలు... ఇది సాధ్యమే. ఈ దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్నప్రయత్నాల్లో ఇటీవలే ఓ మేలి మలుపు చోటుచేసుకుంది. నక్షత్ర శక్తిని మనకు మరింత దగ్గర చేసింది! మనకు అణుశక్తి గురించి తెలుసు కదా.. అణువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా పుట్టే శక్తిని విద్యుత్‌గా ఇందులో మార్చుకుంటాం. నక్షత్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియే జరుగుతుంటుంది కానీ... పూర్తిగా వ్యతిరేకమైన పద్ధతిలో. అంటే ఇక్కడ అణువులు విడిపోవు. విపరీతమైన వేడి, ఒత్తిళ్ల కారణంగా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంటాయి. దీన్నే కేంద్రక సంలీన ప్రక్రియ అని పిలుస్తుంటారు. ఈ ప్రక్రియను భూమ్మీద కృత్రిమంగా సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అమెరికాలోని లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీ (ఎల్ఎన్ఆర్ఎల్)లో గత నెల 8న ఈ ప్రయోగాల్లో తొలిసారి ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలిగారు. 192 లేజర్ కిరణాలను ఉపయోగించి కొన్ని మిల్లీమీటర్ల సైజున్న ఇంధనాన్ని బాగా వేడెక్కించగా లేజర్ కిరణాల కోసం ఖర్చు పెట్టిన శక్తి కంటే 1.3 మెగాజౌళ్ల శక్తి అదనంగా పుట్టింది. కిలో ముడిచమురు ద్వారా పుట్టే శక్తిలో ఇది మూడు శాతం! రెండు పద్ధతులు.. కేంద్రక సంలీన ప్రక్రియను సాధించేందుకు ప్రస్తుతం రెండు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో అనుసరించిన ఇనర్షియల్ కన్ఫైన్మెంట్ కాగా.. అయస్కాంతాల సాయంతో ప్లాస్మాను నియంత్రించేది ఇంకోటి. ఇనర్షియల్ కన్ఫైన్మెంట్లో శక్తిమంతమైన లేజర్లను అతితక్కువ కాలం (సెకనులో వందకోట్ల వంతు) ప్రయోగిస్తారు. ఇది సంలీన ప్రక్రియను మొదలుపెడుతుంది. శక్తిమంతమైన లేజర్లు, ఇతర టెక్నాలజీలు అందుబాటులో లేని కారణంగా ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు రెండో పద్ధతిపైనే ఎక్కువ ఆధారపడేవారు. ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీలో 192 లేజర్ కిరణాలను గది మధ్యలో ఉంచిన మిలీమీటర్ల సైజున్న లోహంపై పడేలా చేసినప్పుడు ఎక్స్‌రే కిరణాలు వెలువడి లోహం వేడెక్కుతుంది. అదే సమయంలో ఇంధనాన్ని పీడనానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో ఉపయోగించిన దానికంటే ఎక్కువ శక్తి పుట్టినప్పటికీ వాణిజ్యస్థాయిలో విద్యుదుత్పత్తికి ఇది సరిపోదు. ఉపయోగించిన ఇంధనం కంటే కనీసం వంద రెట్లు ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. నిధుల వరద... ఫ్యూజన్ ప్రయోగాల కోసం ఇటీవలి కాలంలో నిధుల వరద పారుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఇంకో 20 ఏళ్లలో వాణిజ్యస్థాయి విద్యుదుత్పత్తి సాధ్యమని నమ్ముతున్న కొందరు ఇప్పటివరకూ సుమారు 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు పెడుతున్న ఖర్చుకు ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా ఫ్యూజన్ రియాక్టర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వీరు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం ఈ ఫ్యూజన్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పట్టడం గ్యారంటీ. అన్నీ సవ్యంగా సాగితే 2060 నాటికి ప్రపంచ విద్యుత్ అవసరాల్లో ఒకశాతం ఫ్యూజన్ రియాక్టర్ల ద్వారా అందవచ్చునని ఒక అంచనా. సాధించాల్సింది ఇంకా ఉంది... లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీలో జరిగిన ప్రయోగంతో కేంద్రక సంలీన ప్రక్రియ మనకు అందినట్టేనా? ఊహూ. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. కేంద్రక సంలీన ప్రక్రియల ద్వారా పుట్టే శక్తి అనంతమని... కాలుష్యం అస్సలు ఉండదని కూడా దశాబ్దాలుగా తెలుసు కానీ.. ఇప్పటివరకూ సాధించింది కొంతే. దీనికి కారణాలు లేకపోలేదు. అణువులను లయం చేయగల స్థాయిలో ఇంధనాన్ని వేడి చేయడం... సంలీనం ద్వారా పుట్టిన వేడిని నియంత్రించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారాలు. 1997లో జాయింట్ యూరోపియన్ టోరస్లో అయస్కాంతాలను ఉపయోగించి 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసినా అందుకోసం 23 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించారు. 1960లలో సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన ఫ్యూజన్ రియాక్టర్లతో పలు దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో మన దేశంతోపాటు సుమారు 35 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐటీఈఆర్ కూడా ఇలాంటిదే. ఇందులో విపరీతమైన వేడెక్కిన ఇంధనాన్ని (ప్లాస్మా రూపంలో ఉంటుంది)ని అయస్కాంతాల సాయంతో నియంత్రిస్తుంటారు. ఇందులో 50 మెగావాట్ల విద్యుత్‌తో 500 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. 2025 చివరి నాటికి ఈ ఐటీఈఆర్లో ప్లాస్మా సిద్ధమవుతుందని, ఐదేళ్ల తరువాత అంటే 2030 నాటికి తొలి ప్రయోగం జరగవచ్చునని అంచనా. యూకే కూడా ఇటీవలే అయస్కాంత శక్తితో పనిచేసే ఓ ఫ్యూజన్ రియాక్టర్‌ను అభివృద్ధి చేసి 2040 నాటికల్లా అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించే లక్ష్యంతో పనిచేస్తోంది. మరోవైపు చైనా 2040 నాటికి, యూరప్ 2050 నాటికి మరిన్ని ఫ్యూజన్ రియాక్టర్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
ఉ.కొరియాలో మళ్లీ అణు కార్యకలాపాలు
సియోల్: ఉత్తరకొరియా తన ప్రధాన అణు రియాక్టర్‌ను అణ్వస్త్ర ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. తమ దేశంపై విధించిన ఆంక్షల తొలగింపు, ద.కొరియాతో సైనిక విన్యాసాలను అమెరికా నిలిపివేయకుంటే అణ్వస్త్ర తయారీని తిరిగి ప్రారంభిస్తామంటూ ఉ.కొరియా బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఈఏ ఈ మేరకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. యాంగ్బియోన్లోని ప్రధాన అణు సముదా యంలో ఉన్న 5 మెగావాట్ల రియాక్టర్‌ను ఈ ఏడాది జూలై నుంచి పనిచేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం విశ్లేషించి ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది. ఇదే సముదాయంలో ఉన్న రేడియో కెమికల్ లేబొరేటరీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు పని చేసినట్లు సూచనలు కనిపించాయని పేర్కొంది. అణ్వా యుధాల తయారీలో వినియోగించే ప్లుటోనియం ఈ సముదాయంలో ఉత్పత్తవుతుంది. రియాక్టర్ల నుంచి తొలగించిన ఇంధన కడ్డీలను తిరిగి ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇక్కడ ప్లుటోనియంను వేరు చేస్తారు. ‘ఉ.కొరియా అణు కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. 5 మెగావాట్ల రియాక్టర్తోపాటు రేడియో కెమికల్ లేబొరేటరీ తిరిగి పనిచేయించడం ఇబ్బందికరమైన విషయం’అని ఐఏఈఏ పేర్కొంది. తమ దేశంలోని అణు సముదాయాలను ఐఏఈఏ బృందాలు తనిఖీ చేయడాన్ని 2009 నుంచి ఉ.కొరియా నిలిపివేసింది. -
పంతం నెగ్గించుకున్న రష్యా
మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే అణు రియాక్టర్‌ను రష్యా ప్రారంభించింది. పర్యావరణవేత్తలు, సంస్థలు ఎంత హెచ్చరించినప్పటికీ వినని రష్యా.. తన పంతం నెగ్గించుకుంది. అకడమిక్ లొమొనొసొవ్గా పిలిచే ఈ రియాక్టర్ తన తొలి ప్రయాణంలో భాగంగా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య సైబీరియాలోని పెవెక్ అనే ప్రాంతానికి బయలుదేరింది. అక్కడి అణు కేంద్రాన్ని, మూతబడిన బొగ్గు కర్మాగారాన్ని ఇది భర్తీ చేయనుంది. ఎప్పుడు మంచుతో కప్పి ఉండే సంప్రదాయక అణు కేంద్రాలకు ఇలాంటి తేలియాడే రియాక్టర్లు మంచి ప్రత్యామ్నాయమని అణు పరిశోధన సంస్థ రొసాటోం పేర్కొంది. వీటిని ఇతర దేశాలకు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. కాగా ఈ తేలియాడే అణు రియాక్టర్లు మంచుపై ఉండే చెర్నోబిల్ లాంటివని, అణు బాంబుపూరిత టైటానిక్ లాంటివని, వీటితో ప్రమాదముంటుందని ఎన్నో పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రియాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని రష్యా ఆలోచిస్తోంది. ముఖ్యంగా చమురు లభించే ప్రాంతాల్లో వీటిని వినియోగించనుంది. (చదవండి: మళ్లీ అణ్వాయుధ పోటీ!) -
జపాన్ దూకుడు.. మరో రియాక్టర్ రీస్టార్ట్
టోక్యో: జపాన్ ఎట్టకేలకు మరో అణువిద్యుత్ ఫ్లాంటును పునఃప్రారంభించింది. 2011 ఫుకుషిమా ప్రమాదం తర్వాత మూతబడిన అణుప్లాంటుల్లోని 3వ రియాక్టర్‌కు మంగళవారం స్విచ్చాన్ చేసింది. తఖాహామాలోని న్యూక్లియర్ ప్లాంటులో ఈ రియాక్టర్ ఉంది. తాజా రియాక్టర్‌ను ప్రారంభించడంతో ప్రస్తుతం జపాన్‌లో పనిచేస్తున్న అణు రియాక్టర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయినప్పటికీ ఇంకా తెరుచుకోవాల్సిన అణు రియాక్టర్లు చాలానే ఉన్నాయి. మార్చి 2011లో భారీ భూకంపం వచ్చిన తర్వాత ఏర్పడిన సునామీ కారణంగా ఫుకుషిమా అణు ప్లాంటులోకి భారీ మొత్తంలో వరద రావడంతో పేలుడు చోటు చేసుకొని పెద్ద మొత్తం రేడియో ధార్మికత విడుదలైన విషయం తెలిసిందే. దీంతో అక్కడి వారంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లగా పలువురు ప్లాంటును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అణు ప్లాంటులన్నింటినీ మూసి వేయాలని కోర్టు ఆదేశించడంతో అన్నీ మూతపడ్డాయి. ఇటీవలె పూర్తిస్థాయిలో రక్షణ పరమైన చర్యలు తీసుకున్నట్లు కోర్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల తఖాహామాలోని 4వ రియాక్టర్‌కు అనుమతివ్వగా తాజాగా 3వ రియాక్టర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దానిని కూడా ప్రారంభించింది. ఈ అణుప్లాంటును కాన్సాయి ఎలిక్ట్రిక్ పవర్(కేఈపీసీవో) అనే సంస్థ నడుపుతోంది. -
'ఉత్తర కొరియాకు బుద్ధి చెబుదాం'
వాషింగ్టన్: అణుబాంబుకంటే ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియాకు అంతర్జాతీయ స్థాయిలో గట్టి బుద్ధి చెప్పాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కొరియా అధ్యక్షుడు పార్క్ గెయిన్ హై, జపాన్ ప్రధాని షింజో అబేతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఫోన్లో మాట్లాడి ఉత్తర కొరియా సరిహద్దు దేశాల్లోని భద్రతపై చర్చించారు. ఉత్తర కొరియాపై సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం కూడా ఉత్తర కొరియా నిర్లక్ష్య ధోరణిని గట్టిగా వ్యతిరేకించేలా చేయాలని ఆ ముగ్గురు నిర్ణయించారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. -
ఉత్తర కొరియా ‘బాంబు’ పేల్చిందా?
నిజమో, అలవాటుగా చెప్పే బడాయి కబుర్లో...‘ధూర్త దేశం’గా ముద్రపడి అనేకానేక ఆంక్షల నడుమ రోజులు వెళ్లదీస్తున్న ఉత్తర కొరియా బుధవారం పేల్చిన బాంబు లాంటి వార్త ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాము శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని ఆ వార్త సారాంశం. ఆ వెనకే అమెరికా మొదలుకొని రష్యా, చైనాల వరకూ అనేక దేశాలు ఉత్తర కొరియా తీరును తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ కట్టుబాట్లను ఉత్తర కొరియా ఉల్లంఘించడంపై మన దేశం కూడా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఈ సంగతిని చర్చించడం కోసం భద్రతామండలి సమావేశం కాబోతున్నది. ఉత్తర కొరియా మాటల్లో నిజమెంత అని తర్కిస్తూనే...అది నిజమైతే గనుక ప్రమాదకర పరిణామమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మిగిలిన దేశాల మాటెలా ఉన్నా అందరికన్నా ఎక్కువగా ఖేదపడుతున్నది అమెరికానే! ప్రపంచంలో కొత్తగా ఎవరూ అణ్వాయుధాల జోలికి పోకుండా చూసే బాధ్యతను తనకు తాను భుజాన వేసుకోవడంవల్ల కావొచ్చు... తానే 1952లో కనిపెట్టిన ఈ మహమ్మారి బాంబు పరిజ్ఞానం బద్ధ శత్రువు ఉత్తర కొరియాకు చిక్కడమేమిటన్న విచికిత్స కావొచ్చు-అమెరికా మాత్రం గట్టిగానే హెచ్చరించింది. ఉత్తర కొరియా పరీక్షించింది ఏ మాదిరి బాంబు అన్నది నిర్ధారణ కావడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చుగానీ...ఆ దేశం ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్టు అంతర్జాతీయ భూకంప పర్యవేక్షణ వ్యవస్థ ప్రకటించింది. ఉత్తర కొరియా 2006లో తొలి అణు పరీక్ష జరిపింది. ఇప్పుడు జరిపిన పరీక్ష నాలుగోది. ఈ మాదిరి పరీక్షలు ప్రపంచంలో ఇప్పటివరకూ అసంఖ్యాకంగా జరిగాయి. వీటిలో అగ్ర స్థానం అమెరికాదే. ఆ దేశం ఇంతవరకూ 1,032 అణు పరీక్షలు నిర్వహించింది. 727 అణు పరీక్షలతో రెండో స్థానంలో రష్యా, 217 పరీక్షలతో మూడో స్థానంలో ఫ్రాన్స్, 88 పరీక్షలతో నాలుగో స్థానంలో బ్రిటన్ ఉన్నాయి. చైనా 47 అణు పరీక్షలు నిర్వహిస్తే మన దేశం 3, పాకిస్థాన్ 2 జరిపాయి. మన దేశం 1998లో జరిపిన పరీక్ష హైడ్రోజన్ బాంబుకు సంబంధించిందే. అణ్వాయుధాలన్నిటిలో ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెబుతారు. ఏకకా లంలో విస్తృతమైన ప్రాంతాన్ని బూడిదగా మార్చగల ఈ బాంబును క్షిపణుల ద్వారా ప్రయోగించడానికి అనువుగా చిన్న సైజులో కూడా తయారు చేయొచ్చు. హైడ్రోజన్ రేడియోధార్మిక రూపమైన ట్రిటియంను స్వల్ప మొత్తంలో ఆటం బాంబులో చేర్చినా అది హైడ్రోజన్ బాంబుగా మారి పెను విధ్వంసాన్ని కలిగిస్తుం దని నిపుణులు చెబుతారు. ఇరుగు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ల మాట అలా ఉంచి అమెరికా ఆందోళన పడటానికి ప్రధాన కారణం ఇదే. దేశదేశా ల్లోనూ సైనిక స్థావరాలున్న అమెరికాకు ఇప్పుడు ఉత్తర కొరియా రూపంలో పెను సవాల్ ఎదురైంది. జపాన్ వలస పాలనతో సర్వం కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్న కొరియాలో రెండో ప్రపంచ యుద్ధం చివరిలో ఆనాటి సోవియెట్ యూనియన్ దళాలు అడుగుపెట్టాయి. అందుకు పోటీగా అమెరికా సైతం దండెత్తి వచ్చి దేశ దక్షిణ భాగంలో తిష్ట వేసింది. ఫలితంగా ఆ దేశం రెండుగా విడిపోయింది. అప్పట్లో దక్షిణ కొరియా పెట్టుబడిదారీ దేశాలతో చేరి, అమెరికా అండదండలతో సర్వతో ముఖాభివృద్ధి సాధించింది. ఇటు ఉత్తర కొరియా తనను తాను సోషలిస్టు దేశంగా చెప్పుకుంటుంది. కానీ అక్కడ నడిచేది అనువంశిక పాలన. ఉభయ కొరియాల మధ్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి వైషమ్యాలు ఇప్పటికీ కొనసాగడమే ప్రస్తుత స్థితికి కారణం. 30,000మంది బలగాలతో మోహరించిన అమెరికా దన్నుతో దక్షిణ కొరియా రేపో మాపో తనను సర్వనాశనం చేస్తుందని ఆ దేశం విశ్వసిస్తుంది. అందుకు నిరంతరం సంసిద్ధమై ఉంటుంది. ఖండాంతర క్షిపణులు రూపొందించు కోవడం, అణ్వాయుధాలు పోగేసుకోవడం ఆ సంసిద్ధతలో భాగమే. అలాగని అది సంపన్న దేశమేమీ కాదు. ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలకు తోడు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని కుంగదీస్తున్నాయి. ఉత్తర కొరియాలో అసలు ఏం జరుగుతున్నదన్న సంగతి బయటి ప్రపంచానికి తెలియదు. ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడల్లా జోక్యం చేసుకుని చక్కదిద్దే చైనా, రష్యాలకైనా ఎంతవరకూ తెలుసునో చెప్పలేం. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా బయటి సమాచారం లోపలికీ... లోపలి సమాచారం బయటికీ పొక్కకుండా తనచుట్టూ ఉత్తర కొరియా ఉక్కు కుడ్యాన్ని నిర్మించుకుంది. దేశాధినేత కిమ్ జోంగ్-ఉన్ వింత పోకడలు, విపరీత ప్రవర్తనపై అప్పుడప్పుడు పాశ్చాత్య మీడియా బయటి ప్రపంచానికి వెల్లడించే తమాషా వార్తలే ఉత్తర కొరియాను ఊహించుకోవడానికి ఆధారం. ఆ వార్తలకైనా దక్షిణ కొరియానుంచి అందే గుసగుసలే మూలం. ఒక్కటైతే నిజం... కిమ్ జోంగ్-ఉన్ మొండి ఘటం. దశాబ్దాలుగా అమెరికాపై కత్తులు నూరిన ఇరాన్ సైతం ఆర్నెల్లక్రితం దిగొచ్చి ఆ దేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకుందిగానీ ఉత్తర కొరియా కాస్తయినా తగ్గలేదు. నిజానికి 1994లో తనకున్న ఒక్కగానొక్క అణు రియాక్టర్‌ను మూసేయడానికి...అందుకు బదులుగా విద్యుదుత్పాదన కోసం అమెరికా నిర్మిస్తానన్న రెండు అణు రియాక్టర్లకు తీసుకోవడానికీ ఒప్పుకుంది. డెమొక్రాట్ల పాలనలో కుదిరిన ఆ ఒప్పందాన్ని ఉత్తర కొరియా వ్యవహారశైలిని కారణంగా చూపి జార్జి బుష్ 2002లో రద్దుచేశారు. అప్పటినుంచీ ఉత్తర కొరియా మరింత బిగుసుకుపోయింది. ఉత్తర కొరియాను దారికి తీసుకొచ్చేముందు అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలూ సిద్ధపడాలి. అంతేతప్ప ఆ రంగంలో తమ గుత్తాధిపత్యమే ఉండాలనడం సరైన వాదన కాదు. ప్రపంచంలో ఐఎస్ వంటి ఉగ్రవాద మూకలు విస్తరిస్తున్న వేళ ఎవరి వద్ద అణ్వాయుధాలున్నా అలాంటివారి చేతుల్లో పడటం పెద్ద కష్టమేం కాదు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రపంచశాంతికి అందరూ స్వచ్ఛందంగా ముందుకురావాలి. -
రియాక్టర్‌ను మళ్లీ ప్రారంభించింది
టోక్యో: అణురియాక్టర్లు పేలి భారీ నష్టాన్ని చవి చూసిన జపాన్ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసే చర్యలు ప్రారంభించింది. గతంలో పేలిపోయిన రియాక్టర్ స్థానంలో కొత్తదానిని నిర్మించి తిరిగి అణువిద్యుత్ ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించింది. 2011లో ఫుకుషిమాలోని అణురియాక్టర్లు పేలిపోయి భారీ స్థాయిలో రేడియోథార్మికత వాతావరణంలోకి విడుదల కావడంతోపాటు వేల కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2013 సెప్టెంబర్ నాటికి దాదాపు అన్ని కమర్షియల్ రియాక్టర్ల వాడకాలను దాదాపుగా జపాన్ తగ్గించింది. అయితే, గతంలో రియాక్టర్ల ప్రమాదం జరిగిన యుషు ఖగోషిమాలోని సెందాయ్ ప్లాంట్‌లో మాత్రం తిరిగి రియాక్టర్‌ను పునరుద్ధరించే పనిని ప్రారంభించింది. అది ఇప్పటికీ సిద్ధం కావడంతోపాటు ఇటీవలె ప్రారంభానికి తిరిగి అనుమతులు లభించడంతో మంగళవారం ప్రారంభించారు. మరోపక్క, గతంలో జరిగిన ప్రమాదం తెలిసి కూడా మరోసారి రియాక్టర్ ను ప్రారంభించడాన్ని నిరసిస్తూ దాదాపు 400మంది ఆందోళన కారులు సెందాయ్ ప్లాంట్ వద్ద నిరసన తెలిపారు. మంగళవారం ఏకంగా ప్రధాని కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేస్తున్నారు. -
అణురియాక్టర్లలో భారజలం చేసే పని?
కేంద్రక రసాయన శాస్త్రం కేంద్రక విచ్ఛిత్తి: ఒక భారకేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం (Collision) చెందించినప్పుడు దాదాపు సమాన భారాలున్న రెండు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియనే కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) అంటారు. ఈ ప్రక్రియ లో కొన్ని మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి విడుదలవుతుంది. ఉదా: యురేనియం-235 కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే బేరియం-141, క్రిప్టాన్-92 కేంద్రకాలుగా విడిపోయి 200 క్ఛగ శక్తి విడుదలవుతుంది. పరమాణు బాంబు లేదా కేంద్రక బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ఇదే. ఈ చర్యలో గామా కిరణాలతో పాటు సగటున 2 నుంచి 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి మరికొన్ని కేంద్రకాలను తాడ నం చెందిస్తాయి. ఇది ఒక అనియంత్రిత శృంఖ ల చర్య (Uncontrolled Chain reaction). అందువల్ల విస్ఫోటనం (explosion) జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లను ఉపయోగించి పరమాణు బాంబులో ఈవిధంగా జరిగే అనియంత్రిత కేంద్రక చర్యను నియంత్రించడంద్వారా వచ్చే ఉష్ణశక్తి ఆధారంగా అణు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తారు. అంటే న్యూక్లియర్ రియాక్టర్లలో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను మితకారులు (Moderators) అంటారు. భారజలం, గ్రాఫైట్, బెరీలియం ఆక్సైడ్ లాంటివాటిని మితకారులుగా ఉపయోగిస్తారు. భార హైడ్రోజన్ అయిన డ్యుటీరియం ఆక్సైడ్ (D2O)ను భారజలం అంటారు. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ‘యూరే’. న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించేవాటిని ‘నియంత్రణ కడ్డీలు’ (Control rods) అంటారు. బోరాన్, కాడ్మియం లాంటివాటిని నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు. సాధారణ న్యూట్రాన్లను ఫాస్ట్ న్యూట్రాన్లనీ, వేగం తగ్గించిన న్యూట్రాన్లను ఉష్ణీయ న్యూట్రాన్లు (Thermal Neutrons) అని అంటారు. * సాధారణ అణు ఇంధనాలుగా వాడే కేంద్రకా లు: యురేనియం-235, ప్లుటోనియం-239. ఇవేకాకుండా యురేనియం-233, నెప్ట్యూనియం-237, ప్లుటోనియం-238లను కూడా అణు ఇంధనాలుగా ఉపయోగిస్తారు. * రియాక్టర్లలో శీతలీకారిణి (Coolan్ట)గా ద్రవ సోడియం లేదా నీటిని ఉపయోగిస్తారు. * ఇంధన కడ్డీలను కప్పి ఉంచే పొరను క్లాడింగ్ అంటారు. దీన్ని న్యూట్రాన్ల అధిశోషణ సామర్థ్యం దాదాపుగా లేని క్షయాన్ని నిరోధించే (Corrosion resistant) ధర్మం ఉన్న జిర్కోనియం మిశ్రలోహంతో రూపొం దిస్తారు. * 1954 ఆగస్టు 3న రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారా అణుఇంధన శాఖ (ఈఅఉ) నేరుగా ప్రధానమంత్రి పరిధిలోకి వచ్చింది. * 1974లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధనాల సరఫరాను నియంత్రించడానికి 7 దేశాలతో 1975లో న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (ూఎ) ఏర్పడింది. * ఎన్ఎస్జీ దేశాలు: కెనడా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స, జపాన్, సోవియట్ యూనియన్, యునెటైడ్ కింగ్డమ్, అమెరికా. ప్రస్తుతం ఈ గ్రూపులో 48 దేశాలు ఉన్నాయి. * తీసుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రియాక్టర్లను బ్రీడర్ రియాక్టర్లు అంటారు. ఇవి యురేనియం- 233 లేదా థోరియం-232 నుంచి ప్లుటోనియం-239ను ఉత్పత్తి చేస్తాయి. * యురేనియం-235 శ్రేష్టమైన అణు ఇంధ నం. కానీ సహజ యురేనియంలో ఇది కేవలం 0.7 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలింది యురేనియం-238. దీనికి విఘటన స్వభావం ఉండదు. * యురేనియం-238 నుంచి విఘటన స్వభావం ఉన్న ప్లుటోనియం-239 ఉత్పత్తి అవుతుంది. * పరమాణు రూపకల్పనకు చెందిన అమెరికన్ ప్రాజెక్ట్ మాన్‌హట్టన్. దీనిలో ముఖ్యపాత్ర పోషించింది రాబర్ట ఓపెన్ హీమర్. * పరమాణు బాంబులను మొదటిసారిగా రెండో ప్రపంచయుద్ధం చివరిదశలో జపాన్ పై అమెరికా ప్రయోగించింది. 1945 ఆగస్టు 6న జపాన్‌లోని హిరోిషిమాపై ‘లిటిల్‌బాయ్’ పేరుతో, 1945 ఆగస్టు 9న నాగసాకిపై ‘ఫ్యాట్‌మ్యాన్’ పేరుతో అణు బాంబులను అమెరికా ప్రయోగించింది. * రేడియోధార్మికతలో ‘కేంద్రకవిచ్ఛిత్తి’పై చేసి న పరిశోధనకుగాను రసాయన శాస్త్రంలో ‘ఒట్టోహాన్’కు నోబెల్ బహుమతి లభించింది. ఇతడిని కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. * కేంద్రక విచ్ఛిత్తి పరిశోధనలో ఒట్టోహాన్తో పనిచేసినవారు ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్ (జర్మనీ). * భారజల తయారీ కేంద్రాలు బరోడా (మొదటిది), మణుగూరు, థాల్చేర్, థాల్, ట్యుటికొరిన్, కోట, హజారియాలో ఉన్నాయి. * కేంద్రక సంలీనం (Nuclear Fusion): రెండు తేలిక కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడే ప్రక్రియను కేంద్రక సంలీనం అంటారు. కేంద్రక సంలీన చర్యల కారణంగానే సూర్యుడితోపాటు ఇతర నక్షత్రాల్లో హైడ్రోజన్ (ప్రోటియం, డ్యుటీరియం, ట్రిటియం) హీలియంగా మారుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ ఉండే వాతావరణ పొరలో హీలియం ఎక్కువగా ఉంటుంది. సూర్యునిలో జరిగే కేంద్రక సంలీన చర్యలో పాజిట్రాన్లు, న్యూట్రినోలు అనే కణాలు కూడా విడుదలవుతాయి. సూర్య కిరణాల్లో న్యూట్రినోలు కూడా ఉంటాయి. ఇవి అపాయకరమైనవి కావు. * కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే పరమాణువుల మొత్తం భారం కంటే సంలీన కేంద్రకం ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ద్రవ్యరాశి లోపమే అపారశక్తి రూపంలో విడుదలవుతుంది (ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి-ద్రవ్యరాశి తుల్యతా నియమం E = mc2) * తేలిక కేంద్రకాలు సంలీనం చెందుతూ బంధ శక్తి అధికంగా ఉన్న స్థిరమైన ఐరన్-60ని చేరతాయి. * ఏదో ఒక సమయంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా వెలిగి సూర్యుని కంటే ఎక్కువ పరిమాణంలోకి వ్యాకోచిస్తాయి. ఈ స్థితినే ‘సూపర్నోవా’ అంటారు. * హైడ్రోజన్ బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ‘కేంద్రక సంలీన చర్య’. ఈ చర్య ప్రారంభమవడానికి కొన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇది సాధారణ రసాయన చర్యల్లో లభించదు. అందువల్ల కేంద్రక రసాయన చర్యను ప్రారంభించడానికి మొదట ‘కేంద్రక విచ్ఛిత్తి’ చర్య జరిగే పరమాణు బాంబును ‘ట్రిగ్గర్’గా ఉపయోగిస్తారు. కాబట్టి హైడ్రోజన్ బాంబును ‘ఉష్ణీయ కేంద్రక ఆయుధం’ అంటారు. మాదిరి ప్రశ్నలు 1. అస్థిరమైన భార కేంద్రకాన్ని ఏ కణాలతో తాడనం చేసినప్పుడు కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది? 1) ఆల్ఫా 2) బీటా 3) గామా 4) న్యూట్రాన్లు 2. కిందివాటిలో కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా రూపొందించినవి? ఎ) పరమాణు బాంబు బి) హైడ్రోజన్ బాంబు సి) అణు విద్యుచ్ఛక్తి రియాక్టర్లు 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ మాత్రమే 3. సాధారణంగా కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొనే కేంద్రకాలు ఏవి? ఎ) యురేనియం-235 బి) ప్లుటోనియం-239 సి) యురేనియం-238 డి) థోరియం-232 1) ఎ, బి 2) సి, డి 3) ఎ, సి 4) బి, డి 4. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎ) సహజ యురేనియంలో గరిష్టంగా (99.3 శాతం) ఉండే యురేనియం - 238 స్వయంగా విచ్ఛిత్తి చెందదు. కానీ విచ్ఛిత్తి చెందే ధర్మం ఉన్న యురేనియం-239గా పరివర్తనం చెందుతుంది. బి) బ్రీడర్ రియాక్టర్ యురేనియం-235 ను వినియోగించుకున్నదాని కంటే అధిక ఇంధనాన్ని ప్లుటోనియం-239 లేదా యురేనియం-233 రూపంలో ఉత్పత్తి చేస్తుంది. సి) థోరియం-233 నుంచి కృత్రిమంగా ఉత్పత్తి చేసిన యురేనియం-233ని అణు ఇంధనంగా వాడిన ఆసియా ఖండంలోని మొదటి దేశం భారత్. 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. ఎ) న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (NSG)లో ప్రస్తుతం 48 దేశాలకు సభ్యత్వం ఉంది. బి) 2014-15 సంవత్సరానికి ూఎ అధ్యక్ష స్థానంలో అర్జెంటీనా ఉంటుంది సి) NSGలో భారతదేశానికి సభ్యత్వం ఉంది 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు 6. అణు రియాక్టర్లలో భారజలం చేసే పని? (సివిల్స్ 2011) 1) న్యూట్రాన్ల వేగం తగ్గించడం 2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం 3) రియాక్టర్‌ను చల్లబర్చడం 4) అణుచర్యను నిలిపివేయడం 7. అటామిక్ ఎనర్జీ డిపార్టమెంట్ ఏ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తుంది? (సివిల్స్ 2009) 1) ప్రధాన మంత్రి కార్యాలయం 2) కేబినెట్ సచివాలయం 3) ఇంధన శాఖ 4) శాస్త్ర, సాంకేతిక శాఖ 8. కిందివాటిలో సరికానిది ఏది? 1) ఇందిరాగాంధీ అణు పరిశోధన కేం ద్రం (IGCAR) ఫాస్ట్‌బ్రీడర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది 2) ఐఎఇఅఖ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్‌కు సంబంధించిన యురేనియం-ప్లుటోనియం మిశ్రీత కార్బైడ్ ఇంధనాన్ని రీ ప్రాసెస్ చేస్తుంది 3) యురేనియాన్ని ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కెనడా 4) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి మితకారిగా భారజలాన్ని ఉపయోగిస్తారు. 9. న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించడానికి తప్పనిసరిగా వాడాల్సిన మూలకం ఏది? 1) కోబాల్ట్ (Co) 2) నికెల్ (Ni) 3) జిర్కోనియం (Zr) 4) టంగ్స్టన్ (W) 10. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి కాపాడటానికి వాడేవి ఏవి? 1) గ్రాఫైట్ కడ్డీలు 2) కాడ్మియం కడ్డీలు 3) భారజలం 4) జిర్కోనియం కడ్డీలు 11. సూర్యుని శక్తికి కారణం ఏమిటి? 1) కృత్రిమ రేడియోధార్మిక శక్తి 2) కేంద్రక విచ్ఛిత్తి 3) కేంద్రక సంలీనం 4) సహజ రేడియోధార్మికత 12. కిందివాటిలో సరికాని వాక్యం ఏది? 1) ప్రస్తుతం తారాపూర్, రావత్భట్ట, కాక్రాపూర్, కుదంకులం, కైగాలో అణు విద్యుచ్ఛక్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 2) ప్రస్తుత అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 5780Mw 3) తొలి భారజల తయారీ ప్లాంటును బరోడాలో నెలకొల్పారు 4) కేంద్రక సంలీనం ద్వారా శక్తి విడుదలకు కారణమైంది అణు బాంబు 13. కిందివాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం? (Gr-I, 2007) 1) యురేనియం - 238 2) ప్లుటోనియం - 236 3) నెప్ట్యూనియం 4) థోరియం 14. అణుబాంబు రూపకర్త ఎవరు? (ఎటఐ, 2007) 1) ఇ.ఫెర్మి 2) ఓపెన్ హైమర్ 3) ఓ.హాన్ 4) ఇ. టేలర్ సమాధానాలు 1) 4; 2) 3; 3) 1; 4) 4; 5) 1; 6) 1; 7) 1; 8) 4; 9) 3; 10) 2; 11) 3; 12) 4; 13) 2; 14) 2. -
గూగుల్ మై బుల్బుల్
గూగుల్... గురువులకే గురువులాంటిది.. నూడుల్స్ నుంచి న్యూక్లియర్ రియాక్టర్ వరకు... షేర్‌మార్కెట్ నుంచి శేర్లింగంపల్లి అడ్రస్ వరకు ... దేని గురించి తెలుసుకోవాలన్నా... మన మునివేళ్లు గూగుల్‌నే టైప్ చేస్తాయి.. గూగుల్ లేని కంప్యూటర్.. దేవుడి లేని గుడిలాంటిదంటే అతిశయోక్తి కాదేమో.. అందుకే ఆ గూగులమ్మకు పాటతో పట్టాభిషేకం చేశారు నెటిజన్లు... ఇంగ్లిష్ పదాలను శాస్త్రీయ సంగీతంలో కూర్చి... టెడ్డీబేర్‌తో గాత్రదానం చేయించారు.. గూగుల్‌పై తమకున్న గురుభక్తిని ఆన్లైన్ సాక్షిగా చాటిచెప్పారు. ఆ పాట వింటే మీ పొట్టచెక్కలవ్వాల్సిందే.. మనసు పులకించాల్సిందే.. చివరికి అవును నిజమే కదూ అంటూ తలూపాల్సిందే... ఆన్లైన్లో ఫన్నీ వీడియోతో అదరగొట్టే ఫన్జోవా.కామ్ దీన్ని క్రియేట్ చేసింది. మీరూ ఈ గూగుల్ సాంగ్ చూడాలంటే ఫన్జోవా.కామ్‌లో లేదా యూట్యూబ్‌లో ‘గూగుల్ మై బుల్బుల్’ అని టైప్ చేసి చూడొచ్చు. కడుపుబ్బా నవ్వించే ఆ పాట లిరిక్స్ ఇలా ఉంటాయి.. గూగుల్ గూగుల్... మై బుల్బుల్..బుల్ బుల్ ఇటీస్ సో యూస్ఫుల్... వేరీ కూల్.. వెన్ ఐ హావ్ క్వశ్చన్... ఐ సెర్చ్ ఇన్ ద హోమ్ పేజ్ ఇట్ విల్ ఆన్సర్, వేరీ రియల్ -ప్రవీణ్‌కుమార్ కాసం -
ఐఎన్ఎస్ అరిహంత్ రెడీ!
న్యూఢిల్లీ: సొంత అణు జలాంతర్గామి త్రయాన్ని సమకూర్చుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన భారత తొలి అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిహంత్’ ఎట్టకేలకు సముద్ర పరీక్షలకు సిద్ధమైంది. విశాఖపట్నం తీరంలో నావికాదళానికి చెందిన స్థావరంలో శుక్రవారం రాత్రి జలాంతర్గామిపై ఉన్న పరమాణు రియాక్టర్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా క్రియాశీలం చేశారు. దీంతో ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే ఐఎన్ఎస్ అరిహంత్‌పై గల అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసినందున ఈ జలాంతర్గామికి త్వరలోనే వివిధ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, అరిహంత్‌పై క్రియాశీలం చేసిన రియాక్టర్ పనితీరును తెలుసుకునేందుకు దానిని కాసేపు ఆపేయనున్నామని ‘అణు శక్తి సంఘం(ఏఈసీ)’ చైర్మన్ ఆర్కే సిన్హా తెలిపారు. ప్రస్తుతం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ల వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి. అరిహంత్‌ను సమకూర్చుకోవడంతో భారత్ కూడా వాటి సరసన చేరనుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకుంటున్న అణు జలాంతర్గాముల త్రయంలో ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది. రూ.15 వేల కోట్లతో నిర్మించిన దీనిని ప్రధాని మన్మోహన్ 2009లో ప్రారంభించారు. ఆరు వేల టన్నుల బరువు ఉండే ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు కొన్ని నెలలపాటు పరీక్షలు ఎదుర్కోనుంది. 82.5 మెగావాట్ల అణు రియాక్టర్‌తో నడిచే ఈ జలాంతర్గాములు భూ, గగన, సముద్రతలాల్లోని లక్ష్యాలపైకి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగలవు. రష్యా నుంచి లీజుకు తీసుకున్న అకులా-2 తరగతికి చెందిన ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామిని భారత్ ప్రస్తుతం ఉపయోగిస్తోంది. అరిహంత్‌పై అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలు అభినందించారు.