దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులు
ఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్‌లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్‌లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment