పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్ | eVinci Nuclear Microreactor Details | Sakshi
Sakshi News home page

పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్

Published Thu, Sep 26 2024 6:54 PM | Last Updated on Thu, Sep 26 2024 7:45 PM

eVinci Nuclear Microreactor Details

న్యూక్లియర్ రియాక్టర్‌.. ఈ పేరు చదువుకునే రోజుల్లోనే చాలాసార్లు విని ఉంటారు. ఇది పవర్ ప్లాంట్స్ వంటి వాటిలో ఉపయోగిస్తారని చిన్నప్పుడే చదువుకుని ఉంటారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ఇప్పుడు మన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తే?.. న్యూక్లియర్ రియాక్టర్ ఏమిటి.. రోజువారీ వినియోగానికి ఉపయోగించడమేమిటని చాలామందిలో సందేహం రావచ్చు. ఈ అనుమానం పోవాలంటే ఈ కథనం తప్పకుండా చదివేయాల్సిందే..

వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. ఒక మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ అభివృద్ధి చేస్తోంది. స్పేస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఆధారంగా కంపెనీ 'ఈవిన్సి' (eVinci) అనే న్యూక్లియర్ రియాక్టర్ రూపొందిస్తోంది. ఇది పరిమాణంలో 10 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది 15 మెగావాట్ల థర్మల్ (MWth) కోర్ డిజైన్‌తో 5 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని నుంచి వచ్చే శక్తిని అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు.

వెస్టింగ్‌హౌస్ మైక్రో న్యూక్లియర్ రియాక్టర్‌లో ఒకసారి ఇంధనాన్ని నింపితే ఎనిమిది సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇంధనం పూర్తయిన తరువాత కంపెనీ దీనిని మళ్ళీ తీసుకెళ్లి ఇంధనం నింపి ఇస్తుంది లేదా కొత్త రియాక్టర్‌తో రీప్లేస్ చేస్తుంది. దీనిని ఒకసారి ఒక ప్రదేశంలో ఫిక్స్ చేస్తే మళ్ళీ కదిలించాల్సిన అవసరం కూడా ఉండదు. అంతే కాకుండా దీనిని ప్రత్యేకంగా కూలింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ రియాక్టర్‌లో TRISO (ట్రై స్ట్రక్చరల్ ఐఎస్ఓ ట్రాఫిక్ పార్టికల్ ఫ్యూయల్) ఇంధనం వినియోగిస్తారు.

ఇదీ చదవండి: రాత్రిపూట వెలుగు ఆర్డర్‌ చేసుకోవచ్చు.. మీరు ఎక్కడంటే అక్కడ!

ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లడానికి లేదా తీసుకురావడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇందులో నుంచి వచ్చే శక్తిని మైనింగ్, డ్రిల్లింగ్ కార్యకలాపాలకు, పారిశ్రామిక సౌకర్యాలకు, డిస్ట్రిక్ట్ హీటింగ్, హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన, సైనిక స్థావరాలలో, డేటా సెంటర్‌లలో ఉపయోగించుకోవచ్చు.

కంపెనీ ఈవిన్సి మైక్రో రియాక్టర్ ప్రిలిమినరీ సేఫ్టీ డిజైన్ రిపోర్టును డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ (DOE) నేషనల్ రియాక్టర్ ఇన్నోవేషన్ సెంటర్ (NRIC)కి అందించింది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే ఈ న్యూక్లియర్ రియాక్టర్ త్వరలోనే అందుబాటులోకి రానుందని, వీటిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తామని.. ఈవిన్సి టెక్నాలజీస్ ప్రెసిడెంట్ 'జోన్ బాల్' అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement