టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి.
కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు!
హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది.
చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment