జపాన్ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక
వచ్చే నెల 1న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఇషిబా పదవీ కాలం సంవత్సరమే
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది.
పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్‌డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది.
ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు.
జపాన్‌ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా
ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్‌డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్‌ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు.
అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ ఇషిబా?
షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్‌డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్‌డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్‌డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్‌డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment