Fumio Kishida
-
కిషిదా వారసుడిగా ఇషిబా
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. జపాన్ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ ఇషిబా? షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. -
కిషిదా వారసుడెవరో!
జపాన్ అధికార పార్టీ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని నడిపేందుకు తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. ప్రధాని ఫుమియో కిషిదా 2021లో ఎల్డీపీ నేతగా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూడు పర్యాయాలు పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాదరణ తక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని కిషిదా తాను మరోమారు ప్రధాని పదవికి పోటీపడటం లేదని చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అక్టోబర్ ఒకటిన కిషిదా, ఆయన కేబినెట్ రాజీనామా చేయనుంది. అదేరోజు పార్లమెంటు ఆమోదముద్ర పడ్డాక కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కిషిదా ని్రష్కమణ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వానికి తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగే ఎన్నికలో ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉన్నారు. వీరిలో కొందరు ప్రస్తుత కేబినెట్ మంత్రులు కాగా.. మరికొందరు మాజీ మంత్రులు. దిగువసభ కాలావధి 2025 అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్త ప్రధానిగా ఎన్నికైన వారు తమ కొత్త ఇమేజ్ను ఉపయోగించుకొని.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ప్రధాని పదవి చేపట్టాక కొద్ది వారాల్లోనే ఎన్నికలకు వెళతామని చాలా మంది పోటీదారులు బాçహాటంగానే చెప్పారు. ఓటింగ్ జరిగేదిలా.. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నిక శుక్రవారం జరగనుంది. ఎల్డీపీకి 368 మంది ఎంపీల బలముంది. ఎంపీకి ఒక ఓటు ఉంటుంది. 11 లక్షల ఎల్డీపీ సభ్యుల ప్రాధామ్యాలకు అనుగుణంగా మరో 368 ఓట్లను పోటీపడుతున్న అభ్యర్థులకు కేటాయిస్తారు. అంటే తొలిరౌండ్లో మొత్తం 736 ఓట్లు ఉంటాయి. మొదటిరౌండ్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఏకంగా తొమ్మిది మంది బరిలో ఉండటంతో తొలిరౌండ్లో ఏ ఒక్కరూ 50 శాతం ఓట్లను సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారమే రెండో రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. మొదటిరౌండ్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తదుపరి రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. ఈ రౌండ్లో 368 మంది ఎంపీలకు తోడు 47 మంది స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ఓటింగ్‌కు అర్హులు. మొత్తం 415 ఓట్లు ఉంటాయి. తమ పరిధిలోని మెజారిటీ పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గుచూపారో దానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు తమ ఓటు వేస్తారు. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కిషిదా కుర్చీ కోసం తొమ్మిది మంది రేసులో నిలిచినా.. ప్రధానంగా పోటీ ముగ్గురి మధ్యే ఉందని పలు పోల్ సర్వేలు చెబుతున్నాయి. మాజీ రక్షణమంత్రి షిగెరూ ఇషిబా, మాజీ పర్యావరణ మంత్రి షిన్‌జిరో కొయిజుమీ, ఆర్థిక భద్రత మంత్రి తకైచీ సనయీలు ముందంజలో ఉన్నారు. యోషిమాసా హయాíÙ, తకయుకి కొబయాషి, తొషిమిత్సు మొతెగి, యోకో కమికావా, టారో కోనో, కత్సునోబు కటో.. మిగతా పోటీదారులు. టాప్–3 పోటీదారుల వివరాలిలా ఉన్నాయి...షిగెరూ ఇషిబా (67): ఆపత్కాలంలో అనుభవజు్ఞడు ఇషిబా మాజీ బ్యాంకర్. ఎల్డీపీ నాయకత్వానికి ఆయన పోటీపడటం ఇది ఐదోసారి. ఇదే తన చివరి ప్రయత్నమని ప్రకటించారు. 1986లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికైన ఇషిబా రక్షణ, వ్యవసాయ శాఖలతో పాటు పలు మంత్రిత్వ శాఖలు చూశారు. పార్టీ పదవుల్లోనూ పనిచేశారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ.. తోటి ఎంపీల నుంచి ఆశించినంత మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష కాన్సిట్యూషనల్ డెమొక్రాటిక్ పార్టీ మాజీ ప్రధాని యోషిహికో నోడాను తమ నాయకుడిగా ఎన్నుకుంది. వాగ్ధా్దటితో ప్రజలను ఆకట్టుకునే నోడాను ఎదుర్కొనడానికి ఇషిబా అనుభవం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యం అక్కరకొస్తాయని ఎల్డీపీ భావిస్తోంది. రక్షణ విధానాల రూపకల్పనలో నిపుణుడిగా ఇషిబాకు పేరుంది. నాటో రక్షణ కూటమి లాంటిది ఆసియాకూ ఉండాలని ఇషిబా ప్రతిపాదించారు. షిన్‌జిరో కొయిజుమీ (43): నాలుగోతరం వారసుడు ప్రజాదరణ పొందిన మాజీ ప్రధాని జునిచితో కొయిజుమీ కుమారుడే షిన్‌జిరో. కొయిజుమీ రాజకీయ వారసత్వంలో నాలుగోతరం నాయకుడు. శుక్రవారం ఎన్నికల్లో నెగ్గితే జపాన్‌కు అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రికార్డులకెక్కుతారు. 2009లో తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. షింజో అబే కేబినెట్లో 2019– 2021 మధ్య పర్యావరణ మంత్రిగా పనిచేశారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో మాస్టర్స్ చేసిన షిన్‌జిరో ప్రముఖ టీవీ యాంకర్ తకిగవా క్రిస్టెల్ను వివాహమాడారు. ఇతర పోటీదారులతో పోలి్చనపుడు అనుభవం పెద్దగా లేకున్నా.. ఎల్డీపీ శ్రేణుల్లో ఆదరణ ఉంది. మాజీ ప్రధాని యోషిహిడే సుగా మద్దతు ఉంది. సంస్కరణ వాది. పితృత్వపు సెలవును ప్రమోట్ చేయడానికి 2020లో స్వయంగా రెండు వారాలు సెలవు తీసుకున్నారు. జపాన్– అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేస్తానని, పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో కలిసి పనిచేస్తానని షిన్‌జిరో చెబుతారు. రెండోరౌండ్ వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అనుభవలేమి ఒక్కటే ప్రతికూలత.తకైచీ సనయీ (63): సంప్రదాయవాది తకైచీ గెలిస్తే జపాన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రి అవుతారు. మాజీ ప్రధాని షింజో అబే అనుయాయురాలు. సంప్రదాయవాది. రైట్ వింగ్ మద్దతు ఉంది. 2021లో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకత్వం కోసం కిషిదాతో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సా«ధనసంపత్తిని బలోపేతం చేయడం, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం పెంపుదల, పంపిణీ వ్యవస్థల బలోపేతం.. ఇవి తకైచీ ప్రధాన హామీలు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తారు. పురుషులనే వారసులుగా పరిగణించే రాజకుటుంబ సంప్రదాయాన్ని బలపరుస్తారు. టీవీ యాంకర్‌గా పనిచేసిన తకైచీ తొలిసారిగా 1993లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రిగా పనిచేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు రోల్ మోడల్ అని చెబుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెప్టెంబర్‌లో మళ్లీ పోటీచేయను
టోక్యో: జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నారు. ఎల్డీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతారు. అయితే సెప్టెంబర్‌లో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయట్లేదని కిషిద బుధవారం ప్రకటించారు. 2021లో ఎల్డీపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిద పార్టీ అధ్యక్ష పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ఆయన మళ్లీ పార్టీ పగ్గాలు, దేశ అధికార పగ్గాలు చేపడతారన్న చర్చ నడుమ కిషిద పక్కకు తప్పుకోవడం గమనార్హం. పార్టీలో అవినీతి కుంభకోణాలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతోపాటు ఆయనకు ప్రజల్లో మద్దతు సైతం 20 శాతానికి పడిపోయిన నేపథ్యంలో స్వచ్ఛందంగా పక్కకు జరగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘పదవికి రాజీనామా చేస్తున్నా’..జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
టోక్యో: జపాన్ ప్రధాని పదవికి ఫుమియో కిషిడా రాజీనామా చేయనున్నారు. వచ్చే నెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది సేపటి క్రితం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్తో పార్టీ సంబంధాలు,ఎల్డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిడాపై దేశ ప్రజల మద్దతు తగ్గింది. ప్రధానిగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కిషిడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషిడా మాట్లాడుతూ..‘సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగిసే వరకు నేను ప్రధానమంత్రిగా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండడం, అతని స్థానంలో మరో అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారి జపాన్ అధికార పార్టీ ఎల్డీపీకి. జీవన వ్యయాల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు కొత్త అభ్యర్ధి ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. -
Fukushima nuclear disaster: పసిఫిక్‌లో ‘అణు’ అలజడి
టోక్యో: జపాన్‌లో భూకంపంతో దెబ్బతిన్న ఫ్యుకుషిమా అణు రియాక్టర్ నుంచి వ్యర్థ జలాలను గురువారం నుంచి సముద్రంలోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే వ్యర్థ జలాలను ఫసిఫిక్ మహా సముద్రంలోకి వదిలేయాక తప్పదని జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదా మంగళవారం చెప్పారు. కేబినెట్ మంత్రులతో సమావేశమైన ఆయన ఈ వ్యర్థ జలాలను ప్రణాళికా బద్ధంగా సముద్రంలోకి పంపాలని ఇందు కోసం ప్లాంట్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 24 నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2011 మార్చి 11న సంభవించిన తీవ్రమైన భూకంపం అనంతరం ముంచెత్తిన సునామీకి ఈ ప్లాంట్ దెబ్బ తింది. అప్పట్నుంచి ఈ వ్యర్థ జలాలను జపాన్ నిల్వ చేసి ఉంచింది. కానీ ఇప్పుడు వాటిని నిల్వ చేయడానికి చోటు సరిపోక సముద్రంలోకి వదలాలని నిర్ణయించింది. ఈ నీటిని సముద్రంలోకి విడుదల చేయడంపై చుట్టుపక్కల దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జపాన్ దగ్గర దాదాపుగా 13.4 లక్షల టన్నుల వ్యర్థ జలాలు ఉన్నాయి. వీటిని దశలవారీగా శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతారు. ఇలా చెయ్యడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ నీళ్లను సముద్రంలోకి విడిచి పెట్టడం వల్ల మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నీటి విడుదలకి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇప్పటికే అంగీకరించింది. జపాన్ పసిఫిక్ సముద్రాన్ని తన సొంత మురికి కాల్వగా భావిస్తోందని చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు విమర్శిస్తున్నాయి. కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు! హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిలి్చంది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
మళ్లీ ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
సియోల్: తమ ప్రత్యర్థి దేశమైన దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సాయం అందిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత రెండు షార్ట్–రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మంగళవారం బహిర్గతం చేశారు. ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం క్షిపణి ప్రయోగం నిర్వహించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. రాజధాని పాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు 400 కిలోమీటర్లు(248 మైళ్లు) ప్రయాణించి తూర్పు కోస్తా తీరంలో సముద్రంలో పడిపోయాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు. తమ నిరసనను ఉత్తర కొరియాకు తెలియజేశామని చెప్పారు. -
జపాన్ ప్రధానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
Japan PM: జపాన్ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh — BNO News Live (@BNODesk) April 15, 2023 పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం హాట్ స్ప్రింగ్ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
భౌగోళిక రాజకీయ బంధం
పర్యటన పట్టుమని రెండే రోజులు. అలాగని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. మార్చి 20, 21ల్లో జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా జరిపిన భారత పర్యటన గురించి ప్రత్యేకించి చెప్పుకొనేది అందుకే. ఇండియా జీ20కీ, జపాన్ జీ7 దేశాల కూటమికీ సారథ్యం వహిస్తున్న వేళ ఇరు దేశాల నేతలూ సమావేశం కావడం కచ్చితంగా విశేషమే. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తీవ్రంగా తప్పుబడుతున్న జీ7 అజెండా జపాన్‌ది కాగా, అదే ఉక్రెయిన్ అంశం కారణంగా జీ20లో ఏకాభిప్రాయం రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి భారత్‌ది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాధినేతల సమావేశం, స్నేహపూర్వక సంభాషణలు – పానీపురీ చిరుతిళ్ళతో ఛాయాచిత్రాలు, భారత్‌లో లక్షల కోట్లలో పెట్టుబడులు పెడతామని కిషిదా ప్రకటన, చైనా కట్టడికి ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ అవసరం అంటూ కొత్త పల్లవిని ఎత్తుకోవడం – ఇలా 27 గంటల సుడిగాలి పర్యటనలో గుర్తుండే ఘటనలు అనేకం. సరిగ్గా చైనా అధ్యక్షుడు రష్యాలో పర్యటిస్తున్న వేళ జపాన్ ప్రధాని భారత్‌కు రావడం ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయాలకు మచ్చుతునక. పదిహేనేళ్ళ క్రితం 2008లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌లోనే తన సిద్ధాంతమైన పసిఫిక్, హిందూ మహాసముద్రాల సంగమాన్ని వ్యూహాత్మక దర్శనం చేశారు. ఇప్పుడు కిషిదా ‘క్వాడ్’ కూటమిలో ఇతర భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాల్లో కాక భారత్‌లో ‘స్వేచ్ఛా వాణిజ్యంతో కూడిన ఓపెన్ ఇండో–పసిఫిక్’ అంటూ సైద్ధాంతిక ప్రకటన చేయడం విశేషం. భారత, జపాన్ ప్రధానుల ద్వైపాక్షిక సమావేశాలు 2006 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం ఈసారి మోదీ జపాన్‌కు వెళ్ళాలి. అయితే, కిషిదా తానే హడావిడిగా భారత్‌కు రావడానికి కారణం ఉంది. మార్చి మొదట్లో భారత్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్ విదేశాంగ మంత్రి హాజరు కాలేదు. ప్రతినిధిని పంపారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్న అరుదైన కలయికకు హాజరవడం ఎంత ముఖ్యమో ఒకప్పటి విదేశాంగ మంత్రి కిషిదాకు తెలుసు. భౌగోళిక – రాజకీయ పటంలో తన స్థానాన్నీ, ప్రాధాన్యాన్నీ పెంచుకోవాలనుకొంటున్న తమ దేశం పక్షాన ఆయన ఠక్కున తప్పు దిద్దుకొన్నారు. నిజానికి, భారత – జపాన్‌లు ఏడు దశాబ్దాల సుదీర్ఘ స్నేహాన్ని గడచిన 2022లోనే ఘనంగా జరుపుకొన్నాయి. ఒకప్పుడు మామూలు ప్రపంచ భాగస్వామ్యంగా మొదలై నేడు వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా అది పెంపొందింది. అయితే, ఇప్పటికీ ఆర్థిక భాగస్వామ్యంలో, జనం మధ్య సంబంధాల్లో అంతరాలున్నాయి. వాటి భర్తీకి కిషిదా తాజా పర్యటన దోహదకారి. అలాగే, ఈ పర్యటనను కేవలం దౌత్య తప్పిదాన్ని సరిదిద్దే యత్నంగానే చూడనక్కర లేదు. జీ20లో అన్ని దేశాలూ కలసి చేయాల్సిన ప్రకటనకు చిక్కులు విడిపోలేదు గనక ప్రస్తుత జీ20, జీ7 సారథులిద్దరూ వివరంగా మాట్లాడుకొనడానికి ఇది సదవకాశమైంది. హిరోషిమాలో జరిగే జీ7 సదస్సులో పరిశీలకుడిగా పాల్గొనాలంటూ కిషిదా ఆహ్వానం, మోదీ అంగీకారం చెప్పుకోదగ్గవే. అయిదేళ్ళలో తమ సంస్థలు భారత్‌లో 5 లక్షల కోట్ల యెన్లు (4200 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతాయని గత మార్చిలో మాటిచ్చిన జపాన్ నెమ్మదిగా అయినా ఆ దిశగా అడుగులు వేస్తోంది. కిషిదా వెల్లడించిన భౌగోళిక రాజకీయాల్లో, వ్యూహాల్లో కీలకమైన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో – పసిఫిక్’ ప్రతిపాదన భారత్‌కూ లాభదాయకమే. ఇండో– పసిఫిక్‌లో చైనాకు ముకుతాడు వేయడా నికి పొరుగు దేశంతో కలసి నడవ్వచ్చు. కాకపోతే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా – తన గడ్డపై అమెరి కన్ సైనిక స్థావరాలను కొనసాగనిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సైద్ధాంతిక స్నేహాన్ని కొనసాగిస్తున్న జపాన్ రక్షణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞాన సహకారంపై ఆరు విడతల చర్చల అనంతరం కూడా భారత్‌తో సంయుక్త భాగస్వామ్యానికి అడుగేయలేదు. రక్షణ ఉత్పత్తుల తయారీలో ‘సహ– ఆవిష్కరణ, సహ–రూపకల్పన, సహ–సృష్టి’ అవసరమంటూ తాజా పర్యటనలో కిషిదాకు మోదీ చెప్పాల్సి వచ్చింది. మూడో దేశంతో కలసి రక్షణ విన్యాసాలు అనేకం చేస్తున్నప్పటికీ, రక్షణ రంగంలో భారత్, జపాన్‌లు చేతులు కలపనిదే సంపూర్ణ ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో–పసిఫిక్’ సాధ్యం కాదని కిషిదాకూ తెలుసు. అలాగే, భారీ భారత విపణిలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, భారత్‌లో వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులకు జపాన్‌లో తటపటాయింపు పోవాల్సి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టాల్సి ఉంది. మొత్తానికి ఉమ్మడి బెడదైన చైనా వల్ల భారత్, జపాన్‌లు మరింత సన్నిహితం కావచ్చు. నిరుడు 3 సార్లు, ఈ ఏడాది ఇకపై మరో 3 సార్లు ఇరువురు ప్రధానులూ కలవనుండడంతో ఇండో– పసిఫిక్ భౌగోళిక రాజకీయాల్లో మరిన్ని అడుగులు ముందుకు పడవచ్చు. భారత్‌కు కూడా రానున్న నెలలు కీలకం. భారత ప్రధాని మేలో జీ7 సదస్సులో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ‘క్వాడ్’ సమావేశంలో పాల్గొంటారు. అటుపైన అమెరికాను సందర్శించనున్నారు. రాగల కొద్ది నెలల్లోనే ఎస్సీఓ, జీ20 సదస్సుల నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్పింగ్లకు రెండు సార్లు ఆతిథ్య మిచ్చే అవకాశం భారత్‌కు రానుంది. వీటన్నిటి నేపథ్యంలో కిషిదా పర్యటన రానున్న సినిమాకు ముందస్తు ట్రైలర్. ప్రపంచం మారుతున్న వేళ మన భౌగోళిక రాజకీయ స్థానాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఇది మంచి తరుణం కావచ్చు. విశ్వవేదిక సిద్ధమైంది. మరి, మనమూ సంసిద్ధమేనా? -
Viral Video: మోదీతో కలిసి పానీపూరీ రుచి చూసిన జపాన్ ప్రధాని
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా వన విహారం చేశారు. రాష్ట్రపతిభవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్‌లో ఇరు నేతలు కొద్దిసేపు కలియతిరిగారు. గౌతమ బుద్ధుని 2,500వ జయంతిని పురస్కరించుకుని చాన్నాళ్ల క్రితం ఈ పార్క్‌ను అభివృద్ధిచేశారు. పార్క్‌లోని బుద్దుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు. బోధి వృక్షం మొక్కను కిషిదాకు మోదీ బహూకరించారు. పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది. ఇదే కాకుండా వేయించిన మామిడికాయల గుజ్జు రసాన్ని, లస్సీ తాగారు. ఫ్రైడ్ ఇడ్లీ కూడా తిన్నారు. తర్వాత బెంచ్‌పై కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగారు. ఈ పార్క్‌ను 1964 అక్టోబర్‌లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు. కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి ప్యుమియో కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
Bilateral Talks: జపాన్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. ఈ మేరకు రెండు దేశాల అగ్రనేతలు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదాలు సోమవారం ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 27 గంటల భారత పర్యటనలో భాగంగా కిషిదా ఢిల్లీకొచ్చిన విషయం తెల్సిందే. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు. ‘ జీ20 సదస్సుకు భారత్, జీ7 కూటమికి జపాన్ అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణం ప్రపంచ శ్రేయస్సు కోసం చేసే కృషికి చక్కని అవకాశం. జీ20 అధ్యక్షతన భారత ప్రాధాన్యాలను కిషిదాకు వివరించా. భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రపంచ చట్టాలను గౌరవిస్తూ ఏర్పడిందే. ఇండో–పసిఫిక్ ప్రాంతానికి ఇదెంతో ముఖ్యం. రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సెమీ కండక్టర్ల సరఫరా గొలుసు, సంక్షిష్ట సాంకేతికత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలపేతంపై మేం సమీక్ష చేశాం’ అని తర్వాత పత్రికా ప్రకటనలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ భారత్‌తో ఆర్థిక తోడ్పాటు గణనీయంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్ వృద్ధికేకాదు జపాన్ ఆర్థిక అవకాశాలకు ఎంతగానో ఊతమిస్తుంది. స్వేచ్ఛాయుత ఇండో –పసిఫిక్ విధానాన్ని నేడు భారత గడ్డపై మోదీ సమక్షంలో ఆవిష్కరించా. మేలో జరిగే జీ7 సదస్సుకు మోదీని సాదరంగా ఆహ్వానించా’ అని ప్యుమియో కిషిదా చెప్పారు. పలు ఒప్పందాలపై సంతకాలు ఇరు దేశాలపై ఉక్రెయిన్ యుద్ధ విపరిణామాల ప్రభావం, ఇండో–పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్‌వేర్‌ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలకాంశాలూ చర్చకొచ్చాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి నాలుగో విడత 300 బిలియన్ యెన్ల(రూ.18,800 కోట్ల) రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. -
టోక్యోకు టాటా..!
జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తేనే అభివృద్ధి అంటున్న కిషిదా సర్కార్ రాజధాని పొమ్మంటోంది. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటోంది. జన ప్రభంజనం ఒక్కచోటే ఉంటే ఆ ఊరు తట్టుకోవడం కష్టం. అందుకే జపాన్ ప్రభుత్వం టోక్యోకు టాటా చెప్పేవారికి భారీగా తాయిలాలు ఆశ చూపిస్తోంది జపాన్ రాజధాని టోక్యోకు ఎందుకీ పరిస్థితి వచ్చింది...? డబ్బులిచ్చి మరీ జనాన్ని వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణాలేంటి ? జపాన్ రాజధాని విడిచి పెట్టి వెళ్లిపోవడానికి అక్కడ ప్రభుత్వం భారీ తాయిలాలు ప్రకటించింది. కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్ అంటే భారత్ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తోంది. జపాన్‌లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించలేదు. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి. టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల క్రితం కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్ను భారీగా పెంచి 10 లక్షల యెన్లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్ లభిస్తుంది. టోక్యో ఉక్కిరిబిక్కిరి జపాన్‌లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2020–21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6,44,000 మంది తగ్గిపోయారు. 2022 సంవత్సరం జనవరి–సెప్టెంబర్ మధ్య జపాన్‌లో కొత్తగా 5,99,636 మంది జన్మించారు. ప్రస్తుతం జపాన్ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత (చదరపు కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. జపాన్‌లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16% పెరిగింది. యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌లో జనాభాలో 52% మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48% మంది ఉన్నారు.2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57% మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43% మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా ? దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జనాభా వికేంద్రీకరణ కూడా జరగాలని జపాన్ అధ్యక్షుడు ఫ్యూమియో కిషిదా భావిస్తున్నారు. అందుకే పల్లెలకు, ఇతర పట్టణాలకు కూడా ప్రజలు వెళ్లి స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలంది. 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కిమ్’ చేసిన పనికి జపాన్‌లో హై అలర్ట్!
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్‌లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం. కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! -
జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు ఘన నివాళులు అర్పించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. టోక్యోలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా ప్రపంచదేశాలకు చెందిన 217 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అబే అంత్యక్రియలను నిర్వహించింది. మూణ్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. #WATCH | Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/8psvtnEUiA — ANI (@ANI) September 27, 2022 అంతకుముందు జపాన్ ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు మోదీ. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. షింజో అబే సేవలను భారత్ ఎంతగానో మిస్ అవుతోందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. Prime Minister Narendra Modi pays respect to former Japanese PM Shinzo Abe at the latter's State funeral in Tokyo "India is missing former Japanese PM Shinzo Abe," said PM Modi earlier today (Source: DD) pic.twitter.com/cO5SnswgGQ — ANI (@ANI) September 27, 2022 చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
జపాన్ ప్రధానికి కరోనా
టోక్యో: జపాన్ ప్రధానికి ఫుమియో కిషిడాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రధాని ఫుమియో గత వారం రోజులుగా సెలవుల్లోనే ఉన్నారు. తదనంతరం సోమవారం నుంచి ఆయన తిరిగి విధులకు హాజరు కావాల్సి ఉంది. ఐతే ప్రధాని ఫుమియోకి శనివారం నుంచి కాస్త దగ్గు, జ్వరంతో భాదపడుతుండటంతో పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లినట్లు జపాన్ క్యాబినేట్ ప్రతినిధి తెలిపారు. అదీగాక జపాన్‌లో గత కొన్ని రోజులుగా కరోనాకి సంబంధించిన కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ మరణాలు సంఖ్య మాత్రం తక్కువగానే ఉండటం జపాన్‌కి కాస్త ఊరటనిచ్చే అంశం. (చదవండి: ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..) -
జపాన్ ఎన్నికల్లో షింజో అబే పార్టీ జయకేతనం
టోక్యో: జపాన్ ఎన్నికల్లో మాజీ ప్రధాని షింజో అబే పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మరణించిన రెండు రోజులకే జరిగిన ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)-కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ఎగువసభలో 76 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నర నగరంలో షింజో అబే శుక్రవారం హత్యకు గరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే ఎన్నికలు జరిగాయి. అదే రోజు రాత్రి ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా, పార్టీ నేతలు నల్ల టైలు ధరించి మీడియా ముందు సంతాపం తెలిపారు. షింజో మృతితో బాధలో ఉన్న ఫుమియో కిషిదా.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను వెల్లడిస్తూ వారి పేర్ల పక్కన గులాబీ పూలు పెట్టారు. కానీ ఆయన మొహంలో మాత్రం బాధ తప్ప గెలిచిన ఆనందం కూడా లేదు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రక్రియను ఈసారి హింస భయపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాలనే అనుకున్నట్లు చెప్పారు. జపాన్ ఎగువసభ ఎన్నికల్లో ఈసారి 52.05శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోల్చితే ఇది అధికం. ఈసారి 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకున్నారు. ఈ విజయంతో మరో మూడేళ్ల పాటు ఫుమియో కిషిదా ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలన కొనసాగించవచ్చు. చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య -
12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్
టోక్యో: కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరిట సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ పీఎం ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్ దోహదపడుతుందంటూ ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, ‘‘21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను శాసించేది ఇండో పసిఫిక్ ప్రాంతమే. సగానికి పైగా ప్రపంచ జనాభాకు, 60 శాతానికి పైగా ప్రపంచ జీడీపీకి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే తాజా ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యముంది’’ అని అన్నారు. ఐపీఈఎఫ్‌లో మున్ముందు మరిన్ని దేశాలు భాగస్వాములు అవుతాయన్నారు. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్ వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని స్వరూప స్వభావాలపై అక్టోబర్‌కల్లా స్పష్టత వస్తుందని తెలిపింది. చైనాను రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తైవాన్ను ఐపీఈఎఫ్‌లో భాగస్వామిగా చేసుకోకపోయినా ఆ దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక ఆర్థిక బంధం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. మూడు ‘టి’లే మూలస్తంభాలు: మోదీ ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో–పసిఫిక్‌ను ప్రధాన చోదక శక్తిగా మార్చేందుకు ఐపీఈఎఫ్ భాగస్వామిగా భారత్ కృషి చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు, ఆర్థిక సవాళ్లను అధిగమించాలన్న సమిష్టి సంకల్పానికి ఐపీఈఎఫ్ ప్రతిరూపమన్నారు. ఇలాంటి భాగస్వామ్యానికి రూపమిచ్చినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ వర్తక, పెట్టుబడులకు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో వర్తక కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రం. ఇందుకు చరిత్రే సాక్షి’’ అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్‌లోని లోథాల్లో ఉందని గుర్తు చేశారు. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు ట్రస్ట్ (నమ్మకం), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), టైమ్లీనెస్ (సమయపాలన) అనే మూడు ‘టి’లు మూల స్తంభాలుగా నిలవాలని పిలుపునిచ్చారు. విఫల యత్నమే: చైనా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై చైనా మరోసారి అక్కసు వెలిగక్కింది. 12 ఇండో పసిఫిక్ దేశాల భాగస్వామ్యంతో తాజాగా తెరపైకి వచ్చిన ఐపీఈఎఫ్ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. వీటి ముసుగులో ఇండో పసిఫిక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. వాటిని అడ్డుకోవాలని ఇండో పసిఫిక్ దేశాలకు పిలుపునిచ్చింది. భారత్ చలో.. భారత్ సే జుడో జపాన్ ఎన్నారైలకు మోదీ పిలుపు భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. భారత అభివృద్ధి యాత్రలో జపాన్ పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్, ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల వంటివి ఇరు దేశాల పరస్పర సహకారానికి నిదర్శనాలని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌లోని ఎన్నారైలతో టోక్యోలో ఆయన భేటీ అయ్యారు. ‘భారత్ చలో, భారత్ సే జుడో’ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుని బాటే ఆదర్శమన్నారు. ప్రతి భారతీయుడూ జీవితంలో ఒక్కసారైనా జపాన్ సందర్శించాలని అప్పట్లో స్వామి వివేకానంద అన్నారు. ప్రతి జపాన్ పౌరుడూ ఒక్కసారైనా భారత్ సందర్శించాలని నేనంటున్నా’’ అని చెప్పారు. మంగళవారం ఆయన క్వాడ్ శిఖరాగ్రంలో పాల్గొనడంతో క్వాడ్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
భారత్‌లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. కిషిడా నేతృత్వంలోని జపాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ, కిషిడా సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు. సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, జపాన్ల సంబంధాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషిడా ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తుంగలోకి తొక్కిందన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష బలప్రయోగాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలు గుర్తించాయని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. కిషిడా ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కాంబోడియాకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్ హౌస్‌లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు
న్యూఢిల్లీ: భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా.. శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన జపాన్ ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. జపాన్ అధికారుల ప్రధాని మోదీతో ఆయన భేటీ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విట్టర్లో.. ఇరు ప్రధానులు న్యూఢిల్లీలో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. అని పేర్కొంది. భారత్ పర్యటనకు రాకముందు జపాన్ ప్రధాని కిషిడా ఇలా అన్నారు... "నేను భారత్ పర్యటన తరువాత కంబోడియా పర్యటనకు వెళ్తున్నాను. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ఈ పర్యటనల ద్వారా నేను అంతర్జాతీయ ఐక్యత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. జపాన్ భారత్ వివిధ సమస్యలపై కలిసి పనిచేస్తాయని విశ్వసించండి. టోక్యోలో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నాయకుల మధ్య జరిగే క్వాడ్ సమ్మిట్ విజయవంతానికి కృషి చేయాలనే మా ఉద్దేశ్యాన్ని భారత ప్రధాని మోదీతో కలిసి ధృవీకరించాలనుకుంటున్నాను. అని చెప్పారు. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా పై జపాన్ ఆంక్షలు విధించడమే కాక ఉక్రెనియన్ శరణార్థులను స్వీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా 2018 అక్టోబర్‌లో మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగింది. కానీ ఆ తర్వాత ఏడాది 2019లో గౌహతిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల కారణంగా సమ్మిట్ నిర్వహించలేకపోయింది. గత రెండేళ్లు కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి 2021 వరకు శిఖరాగ్రసమావేశన్ని నిర్వహించలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ఏడాది నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం భారత్, జపాన్ల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. భారత్ జపాన్ రెండూ తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ జపాన్‌లు తమ 'ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కాక విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి బలోపేతం చేయడానికి పరస్పర సహకరంతో ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. (చదవండి: వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు) -
అధికారం మళ్లీ కిషిడా కైవసం !
టోక్కో: జపాన్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 465 సీట్లున్న పార్లమెంట్ దిగువసభలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, దాని కూటమి పార్టీ కొమియిటో కలిపి సంయుక్తంగా 293 పైగా సీట్లను సాధించాయని వార్తలొచ్చాయి. దిగువసభలో కనీస మెజారిటీ సాధించాలంటే 233 సీట్లు అవసరంకాగా ఈ కూటమి అంతకుమించిన సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. అయితే, అధికారికంగా ఇంకా తుది ఫలితాలు వెల్లడికాలేదు. ఎన్నికలకు ముందునాటి మంత్రివర్గాన్నే ఇకపైనా కొనసాగిస్తానని కిషిడా చెప్పారు. కోవిడ్ కట్టడి, కీలకమైన ఆర్థిక సంస్కరణలే ప్రధానాంశాలుగా ఈసారి ఎన్నికలు జరిగాయి. యొషిమిడి సుగా తర్వాత ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన కిషిడా 10 రోజుల్లోనే దిగువ సభను రద్దుచేశారు. అధికార పార్టీ నాయకత్వం కోసం నిర్వహించిన ‘అంతర్గత ఎన్నిక’ల్లో విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లారు. ఆదివారం ముగిసిన ఎన్నికల్లోనూ తమ కూటమిని విజయతీరాలకు చేర్చారు.