న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. కిషిడా నేతృత్వంలోని జపాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ, కిషిడా సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు.
సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, జపాన్‌ల సంబంధాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషిడా ప్రకటించారు.
ఉక్రెయిన్‌పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తుంగలోకి తొక్కిందన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష బలప్రయోగాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలు గుర్తించాయని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. కిషిడా ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కాంబోడియాకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment