
టోక్యో: కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణీ పరీక్షలు చేపడుతూ తన పొరుగుదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు సైతం హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా మరోమారు క్షిపణి పరీక్షలు చేపట్టి జపాన్‌లో అలజడి సృష్టించారు. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లోకి ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం చేపట్టినట్లు దక్షణ కొరియాతో పోటు జపాన్ అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు జపాన్ పీఎం.
కొరియన్ ద్వీపకల్పం, జపాన్ మధ్యలోని సముద్ర జలాల్లో ఈ మిసైల్ పడినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, జపాన్ తీరానికి ఎంత దూరంలో పడిందనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. జపాన్ ఎక్స్‌క్లూసివ్ ఎకనామిక్ జోన్‌కు వెలుపల పడినట్లు ఆ దేశ జాతీయ టెలివిజన్ పేర్కొంది. అమెరికాను చేరుకునేంత అత్యాధునిక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ పరీక్షలను నిర్వహించబోతున్నమని ఉత్తర కొరియా ప్రకటించిన మూడో రోజే ఈ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ!
Comments
Please login to add a commentAdd a comment