Object thrown near Japan PM Fumio Kishida during speech, suspect held - Sakshi
Sakshi News home page

Fumio Kishida: జపాన్‌ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..

Published Sat, Apr 15 2023 9:42 AM | Last Updated on Sun, Apr 16 2023 8:04 AM

Object Thrown Near Japan Pm Fumio Kishida During Speech Suspect Held - Sakshi

టోక్యో: జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్‌ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్‌ కేబినెట్‌ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం హాట్‌ స్ప్రింగ్‌ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్‌ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. 


చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement