భౌగోళిక రాజకీయ బంధం | Sakshi Editorial On Japan PM Fumio Kishida India tour | Sakshi
Sakshi News home page

భౌగోళిక రాజకీయ బంధం

Published Wed, Mar 22 2023 2:38 AM | Last Updated on Wed, Mar 22 2023 2:38 AM

Sakshi Editorial On Japan PM Fumio Kishida India tour

పర్యటన పట్టుమని రెండే రోజులు. అలాగని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. మార్చి 20, 21ల్లో జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా జరిపిన భారత పర్యటన గురించి ప్రత్యేకించి చెప్పుకొనేది అందుకే. ఇండియా జీ20కీ, జపాన్‌ జీ7 దేశాల కూటమికీ సారథ్యం వహిస్తున్న వేళ ఇరు దేశాల నేతలూ సమావేశం కావడం కచ్చితంగా విశేషమే.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను తీవ్రంగా తప్పుబడుతున్న జీ7 అజెండా జపాన్‌ది కాగా, అదే ఉక్రెయిన్‌ అంశం కారణంగా జీ20లో ఏకాభిప్రాయం రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి భారత్‌ది.

ఈ పరిస్థితుల్లో ఇరు దేశాధినేతల సమావేశం, స్నేహపూర్వక సంభాషణలు – పానీపురీ చిరుతిళ్ళతో ఛాయాచిత్రాలు, భారత్‌లో లక్షల కోట్లలో పెట్టుబడులు పెడతామని కిషిదా ప్రకటన, చైనా కట్టడికి ‘ఫ్రీ అండ్‌ ఓపెన్‌  ఇండో – పసిఫిక్‌’ అవసరం అంటూ కొత్త పల్లవిని ఎత్తుకోవడం – ఇలా 27 గంటల సుడిగాలి పర్యటనలో గుర్తుండే ఘటనలు అనేకం.

సరిగ్గా చైనా అధ్యక్షుడు రష్యాలో పర్యటిస్తున్న వేళ జపాన్‌ ప్రధాని భారత్‌కు రావడం ప్రచ్ఛన్న యుద్ధానంతర ప్రపంచంలో మారుతున్న భౌగోళిక రాజకీయాలకు మచ్చుతునక. 

పదిహేనేళ్ళ క్రితం 2008లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే భారత్‌లోనే తన సిద్ధాంతమైన పసిఫిక్, హిందూ మహాసముద్రాల సంగమాన్ని వ్యూహాత్మక దర్శనం చేశారు.

ఇప్పుడు కిషిదా ‘క్వాడ్‌’ కూటమిలో ఇతర భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాల్లో కాక భారత్‌లో ‘స్వేచ్ఛా వాణిజ్యంతో కూడిన ఓపెన్‌ ఇండో–పసిఫిక్‌’ అంటూ సైద్ధాంతిక ప్రకటన చేయడం విశేషం. భారత, జపాన్‌ ప్రధానుల ద్వైపాక్షిక సమావేశాలు 2006 నుంచి జరుగుతూనే ఉన్నాయి.

ప్రోటోకాల్‌ ప్రకారం ఈసారి మోదీ జపాన్‌కు వెళ్ళాలి. అయితే, కిషిదా తానే హడావిడిగా భారత్‌కు రావడానికి కారణం ఉంది. మార్చి మొదట్లో భారత్‌లో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి జపాన్‌ విదేశాంగ మంత్రి హాజరు కాలేదు. ప్రతినిధిని పంపారు.

అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రిటన్‌ తదితర దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్న అరుదైన కలయికకు హాజరవడం ఎంత ముఖ్యమో ఒకప్పటి విదేశాంగ మంత్రి కిషిదాకు తెలుసు. భౌగోళిక – రాజకీయ పటంలో తన స్థానాన్నీ, ప్రాధాన్యాన్నీ పెంచుకోవాలనుకొంటున్న తమ దేశం పక్షాన ఆయన ఠక్కున తప్పు దిద్దుకొన్నారు. 

నిజానికి, భారత – జపాన్‌లు ఏడు దశాబ్దాల సుదీర్ఘ స్నేహాన్ని గడచిన 2022లోనే ఘనంగా జరుపుకొన్నాయి. ఒకప్పుడు మామూలు ప్రపంచ భాగస్వామ్యంగా మొదలై నేడు వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా అది పెంపొందింది. అయితే, ఇప్పటికీ ఆర్థిక భాగస్వామ్యంలో, జనం మధ్య సంబంధాల్లో అంతరాలున్నాయి.

వాటి భర్తీకి కిషిదా తాజా పర్యటన దోహదకారి. అలాగే, ఈ పర్యటనను కేవలం దౌత్య తప్పిదాన్ని సరిదిద్దే యత్నంగానే చూడనక్కర లేదు. జీ20లో అన్ని దేశాలూ కలసి చేయాల్సిన ప్రకటనకు చిక్కులు విడిపోలేదు గనక ప్రస్తుత జీ20, జీ7 సారథులిద్దరూ వివరంగా మాట్లాడుకొనడానికి ఇది సదవకాశమైంది.

హిరోషిమాలో జరిగే జీ7 సదస్సులో పరిశీలకుడిగా పాల్గొనాలంటూ కిషిదా ఆహ్వానం, మోదీ అంగీకారం చెప్పుకోదగ్గవే. అయిదేళ్ళలో తమ సంస్థలు భారత్‌లో 5 లక్షల కోట్ల యెన్లు (4200 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెడతాయని గత మార్చిలో మాటిచ్చిన జపాన్‌ నెమ్మదిగా అయినా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 

కిషిదా వెల్లడించిన భౌగోళిక రాజకీయాల్లో, వ్యూహాల్లో కీలకమైన ‘ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇండో – పసిఫిక్‌’ ప్రతిపాదన భారత్‌కూ లాభదాయకమే. ఇండో– పసిఫిక్‌లో చైనాకు ముకుతాడు వేయడా నికి పొరుగు దేశంతో కలసి నడవ్వచ్చు.

కాకపోతే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినా – తన గడ్డపై అమెరి కన్‌ సైనిక స్థావరాలను కొనసాగనిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సైద్ధాంతిక స్నేహాన్ని కొనసాగిస్తున్న జపాన్‌ రక్షణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞాన సహకారంపై ఆరు విడతల చర్చల అనంతరం కూడా భారత్‌తో సంయుక్త భాగస్వామ్యానికి అడుగేయలేదు.

రక్షణ ఉత్పత్తుల తయారీలో ‘సహ– ఆవిష్కరణ, సహ–రూపకల్పన, సహ–సృష్టి’ అవసరమంటూ తాజా పర్యటనలో కిషిదాకు మోదీ చెప్పాల్సి వచ్చింది. మూడో దేశంతో కలసి రక్షణ విన్యాసాలు అనేకం చేస్తున్నప్పటికీ, రక్షణ రంగంలో భారత్, జపాన్‌లు చేతులు కలపనిదే సంపూర్ణ ‘ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇండో–పసిఫిక్‌’ సాధ్యం కాదని కిషిదాకూ తెలుసు.

అలాగే, భారీ భారత విపణిలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, భారత్‌లో వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులకు జపాన్‌లో తటపటాయింపు పోవాల్సి ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో భేదాభిప్రాయాలను పక్కన పెట్టాల్సి ఉంది. 

మొత్తానికి ఉమ్మడి బెడదైన చైనా వల్ల భారత్, జపాన్‌లు మరింత సన్నిహితం కావచ్చు. నిరుడు 3 సార్లు, ఈ ఏడాది ఇకపై మరో 3 సార్లు ఇరువురు ప్రధానులూ కలవనుండడంతో ఇండో– పసిఫిక్‌ భౌగోళిక రాజకీయాల్లో మరిన్ని అడుగులు ముందుకు పడవచ్చు. భారత్‌కు కూడా రానున్న నెలలు కీలకం.

భారత ప్రధాని మేలో జీ7 సదస్సులో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ‘క్వాడ్‌’ సమావేశంలో పాల్గొంటారు. అటుపైన అమెరికాను సందర్శించనున్నారు. రాగల కొద్ది నెలల్లోనే ఎస్‌సీఓ, జీ20 సదస్సుల నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌లకు రెండు సార్లు ఆతిథ్య మిచ్చే అవకాశం భారత్‌కు రానుంది.

వీటన్నిటి నేపథ్యంలో కిషిదా పర్యటన రానున్న సినిమాకు ముందస్తు ట్రైలర్‌. ప్రపంచం మారుతున్న వేళ మన భౌగోళిక రాజకీయ స్థానాన్ని పునర్నిర్వచించుకోవడానికి ఇది మంచి తరుణం కావచ్చు. విశ్వవేదిక సిద్ధమైంది. మరి, మనమూ సంసిద్ధమేనా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement