న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిదా వన విహారం చేశారు. రాష్ట్రపతిభవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్‌లో ఇరు నేతలు కొద్దిసేపు కలియతిరిగారు. గౌతమ బుద్ధుని 2,500వ జయంతిని పురస్కరించుకుని చాన్నాళ్ల క్రితం ఈ పార్క్‌ను అభివృద్ధిచేశారు. పార్క్‌లోని బుద్దుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు. బోధి వృక్షం మొక్కను కిషిదాకు మోదీ బహూకరించారు.
పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్‌గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది. ఇదే కాకుండా వేయించిన మామిడికాయల గుజ్జు రసాన్ని, లస్సీ తాగారు. ఫ్రైడ్ ఇడ్లీ కూడా తిన్నారు. తర్వాత బెంచ్‌పై కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగారు. ఈ పార్క్‌ను 1964 అక్టోబర్‌లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించారు.
కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి ప్యుమియో కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు ప్రతినబూనారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతోపాటు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిర, స్వేచ్ఛాయుత వాతావరణం పరిడవిల్లేలా చూసేందుకే ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఇండో– పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధిపత్య నీడలోకి తెచ్చేందుకు సాహసిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు, ఉక్రెయిన్ యుద్ధంతో ఉద్రిక్తతలు నెలకొన్న అంతర్జాతీయ సమాజంలో శాంతి స్థాపనకు తమ వంతు కృషిచేసేందుకు జపాన్, భారత్‌లు ముందుకొచ్చినట్లు నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment