టోక్యోకు టాటా..! | Japanese families set to receive 1 million yen per child for moving out of Tokyo | Sakshi
Sakshi News home page

టోక్యోకు టాటా..!

Published Fri, Jan 6 2023 4:48 AM | Last Updated on Fri, Jan 6 2023 4:48 AM

Japanese families set to receive 1 million yen per child for moving out of Tokyo - Sakshi

జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తేనే అభివృద్ధి అంటున్న కిషిదా సర్కార్‌   రాజధాని పొమ్మంటోంది. తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపొమ్మంటోంది. జన ప్రభంజనం ఒక్కచోటే ఉంటే ఆ ఊరు తట్టుకోవడం కష్టం.   అందుకే జపాన్‌ ప్రభుత్వం టోక్యోకు టాటా చెప్పేవారికి భారీగా తాయిలాలు ఆశ చూపిస్తోంది జపాన్‌ రాజధాని టోక్యోకు ఎందుకీ పరిస్థితి వచ్చింది...?   డబ్బులిచ్చి మరీ జనాన్ని వెళ్లిపొమ్మని చెప్పడానికి కారణాలేంటి ?

జపాన్‌ రాజధాని విడిచి పెట్టి వెళ్లిపోవడానికి అక్కడ ప్రభుత్వం భారీ తాయిలాలు ప్రకటించింది. కుటుంబంలోని పిల్లలకి ఒక్కొక్కరికి 10 లక్షల యెన్‌ అంటే భారత్‌ కరెన్సీలో రూ. 6 లక్షలు ఇస్తామని ఆశ చూపిస్తోంది. జపాన్‌లో జనాభా దేశవ్యాప్తంగా సమానంగా విస్తరించలేదు. అక్కడ నగరాలు, పట్టణాలు జనంతో కిక్కిరిసిపోతూ ఉంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న  పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి.

టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో జనాభా అంతకంతకూ పెరిగిపోతోంది.అందుకే కుటుంబంలో ఒక్కో పిల్లకి 10 లక్షల యెన్‌లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జపాన్‌కు ఇదేమీ కొత్త కాదు. మూడేళ్ల క్రితం కూడా టోక్యోకి టాటా చెప్పండంటూ 3 లక్షల యెన్‌లు ప్రకటించించింది. జనాలెవరూ రాజధాని వీడి వెళ్లడానికి ఇష్టపడ లేదు. దీంతో ఈ సారి ఇన్సెంటివ్‌ను భారీగా పెంచి 10 లక్షల యెన్‌లు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లేవారికి ఈ ఇన్సెంటివ్‌ లభిస్తుంది.  

టోక్యో ఉక్కిరిబిక్కిరి  
జపాన్‌లో నానాటికి జనాభా తగ్గిపోతోంది. 1973 నుంచి ఆ దేశంలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. 2020–21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6,44,000 మంది తగ్గిపోయారు. 2022 సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌ మధ్య జపాన్‌లో కొత్తగా 5,99,636 మంది జన్మించారు. ప్రస్తుతం జపాన్‌ జనాభా 12.50 కోట్లు కాగా టోక్యో జనాభా 1.5 కోట్లు. దేశంలో మొత్తం జనాభాలో ఇంచుమించు 10శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ నగరంలో జన సాంద్రత (చదరపు కి.మీ. నివసించేవారి సంఖ్య) 6,158గా ఉంది. జపాన్‌లో జనాభా తగ్గుతూ వస్తూ ఉంటే టోక్యోలో జనాభా గత దశాబ్దంలో 16% పెరిగింది.

యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం రాజధాని బాట పడుతున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనాభాతో టోక్యో ఊపిరి పీల్చుకోలేకపోతోంది. 2020 నాటికి జపాన్‌లో జనాభాలో 52% మంది మూడు అతి పెద్ద మెట్రోపాలిటన్‌ ప్రాంతాలైన టోక్యో, ఒసాకో, నగోయాలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 48% మంది ఉన్నారు.2050 నాటికి ఈ మూడు నగరాల్లోనే 57% మంది నివసిస్తారని, మిగిలిన ప్రాంతాల్లో 43% మంది ఉంటారని అంచనాలున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలన్నింటికీ టోక్యో కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చే ముప్పు పెరిగిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే జనాభా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.

 ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయా ?  
దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే జనాభా వికేంద్రీకరణ కూడా జరగాలని జపాన్‌ అధ్యక్షుడు ఫ్యూమియో కిషిదా భావిస్తున్నారు. అందుకే పల్లెలకు, ఇతర పట్టణాలకు కూడా ప్రజలు వెళ్లి స్థిరపడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో కాలుష్యం లేని జీవనంపై ప్రత్యేకంగా వీడియోలు విడుదల చేస్తూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రతీ ఒక్కరూ రాజధానిలో మకాం ఉంటే జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యంతో పాటు నగరాల్లో ఉంటే సదుపాయాలన్నీ పల్లెల్లో కల్పిస్తోంది. ఏ ప్రాంతంలోనైనా  జనం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగాలన్నీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఎక్కువ కావడంతో టోక్యోలో ఉండాల్సిన పని లేదని, ఇతర చోట్లకు వెళ్లాలంది. 2019లో 71 కుటుంబాలు టోక్యోని వీడి వెళితే, 2021లో 1184 కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 2027 నాటికి ఏడాది 10 వేల కుటుంబాలు మకాం మారుస్తాయని అంచనాలు వేస్తోంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement