సియోల్: అణుబాంబు కంటే కూడా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించడం ద్వారా ఉత్తర కొరియా ప్రపంచదేశాలను విస్మయంలో ముంచెత్తింది. అణ్వాయుధ అభివృద్ధిలో సంపన్న దేశాలకు దీటుగా ముందడుగు వేసినట్టు ప్రపంచానికి చాటింది.
'2016 జనవరి 6న ఉదయం పది గంటలకు మనం దేశం విజయవంతంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. వర్కర్స్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయానికి అనుగుణంగా ఈ పరీక్షలు జరిగాయి' అని ఉత్తర కొరియా ప్రభుత్వ టెలివిజన్ న్యూస్ రీడర్ ప్రకటించారు. ఈ చారిత్రక పరీక్షను పరిపూర్ణంగా నిర్వహించడం ద్వారా అత్యాధునిక అణ్వాయుధ పరిజ్ఞానం కలిగిన దేశాల సరసన ఉత్తర కొరియా నిలిచినట్టు తెలిపారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలో భాగంగా అతి చిన్న పరికరాన్ని మాత్రమే ప్రస్తుతం పరీక్షించినట్టు న్యూస్ రీడర్ చెప్పారు. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు.. ఆయన సూచనల మేరకే హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. గత డిసెంబర్‌లోనే తాము హైడ్రోజన్ బాంబు తయారుచేసినట్టు కిమ్ ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనను అంతర్జాతీయ నిపుణులు కొట్టిపారేశారు. అయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, స్వేదేశీ మానవ వనరులతో ఈ పరీక్షను నిర్వహించినట్టు ఉత్తర కొరియా స్పష్టం చేసింది.
అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న ప్రతిజ్ఞకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే అత్యాధునిక అణ్వాయుధ సంపత్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోబోమని ఉత్తర కొరియా తెలిపింది. 'ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా విషపూరిత విధానాన్ని కొనసాగించినంతకాలం.. మా అణు అభివృద్ధి కార్యక్రమాన్ని మానుకోబోం' అని తేల్చి చెప్పింది.
అంతర్జాతీయంగా భయాందోళనలు
అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించడంపై అంతర్జాతీయంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యపై పొరుగుదేశం జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత భద్రతకు ప్రమాదకరమని జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. అమెరికా కూడా ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి.. ఈ అంశంపై చర్చించనుంది.
అమెరికా విషవిధానం మారనంత వరకూ..!
Published Wed, Jan 6 2016 11:56 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
Advertisement