ప్యోంగ్‌యాంగ్: అగ్రరాజ్యం అమెరికా, తూర్పుఆసియా దేశం ఉత్తరకొరియాల మధ్య పంచాయితీ తీర్చడానికి భారత్ పెద్దరికం వహించనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఈమేరకు బుధవారం ప్యోంగ్‌యాంగ్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చరిత్రాత్మక భేటీపై నీలినీడలు కమ్ముకున్నవేళ భారత మంత్రి పర్యటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సింగ్ ఎందుకు వెళ్ళారు?: అణ్వస్త్రాల నిరాయుధీకరణకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించిన కిమ్.. వైరిపక్షాలతో చర్చలకు సిద్ధమని కొద్దిరోజుల కిందటే ప్రకటించడం, జూన్ 12న సింగపూర్‌లో ట్రంప్-కిమ్ భేటీకి రంగం సిద్ధం కావడం తెలిసిందే. అంతలోనే అనూహ్యంగా ప్లేటు ఫిరాయించిన కిమ్.. సదరు చర్చలు ఏకపక్షంగా, కొరియాకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి కీలక దశలో చర్చల ప్రక్రియను నిలిపేయడం సరికాదని నచ్చజెప్పేందుకే భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉత్తరకొరియాపై ఆంక్షల విధింపు తీర్మానంపై భారత్ సైతం సంతకం చేసినప్పటికీ.. మిగతాదేశాల మాదిరి దౌత్యసంబంధాలను మాత్రం తెంచుకోలేదు. ప్యోంగ్‌యాంగ్‌లో ఇప్పటికీ భారత దౌత్యకార్యాలయం కొనసాగుతున్నది. 2015లో ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించారు కూడా. ఉత్తరకొరియాతో సుహృద్భావ సంబంధాల నేపథ్యంలోనే భారత్.. ‘ట్రంప్-కిమ్‌ల చర్చ’ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కిమ్‌తో మాట్లాడుతారా?: ప్యోంగ్‌యాంగ్‌కు వచ్చిన భారత మంత్రికి ఉత్తరకొరియా మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ట్రంప్-కిమ్‌ల భేటీకి మార్గం సుగమమం చేయాలన్న లక్ష్యంతోనే ఆయన కొరియా ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. అయితే, అధినేత కిమ్ జాంగ్‌తో వీకే సింగ్ మాట్లాడుతారా, లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment