సంఘర్షించుకుంటున్న రెండు దేశాల మధ్య చర్చ జరగాలంటే, శాంతి నెలకొనాలంటే ఆ వైరి పక్షాలు రెండూ పరస్పరం గౌరవించుకోవాలి. సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఒకపక్క చర్చలకు సిద్ధపడుతున్నట్టు కనబడుతూనే అవతలి పక్షాన్ని కించపరచడానికి లేదా దానిపై తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఏ ఒక్కరు ఉబలాట పడినా మొదటికే మోసం వస్తుంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సదవగాహన లోపించబట్టే...అమెరికా ఆధిపత్య ధోరణì ప్రదర్శించడం వల్లే వచ్చే నెల 12న ఆ రెండు దేశాల మధ్యా జరగాల్సిన చర్చలు కాస్తా రద్దయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరగడం సరికాదని భావిస్తున్నానని, భవిష్యత్తులో అవి జరిగే అవకాశం తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.
ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య ఏప్రిల్ నెలాఖరున శిఖరాగ్ర చర్చలు జరిగినప్పుడు ప్రపంచమంతా స్వాగతించింది. ఆ తర్వాత తాను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జూన్ 12న సింగపూర్‌లో సమావేశం కాబోతున్నట్టు ఉన్నట్టుండి ట్రంప్ ట్వీటర్ ద్వారా ప్రక టించినప్పుడు సైతం ఇది నిజమా, కలా అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చర్చలకు అమెరికా వెళ్లేందుకు కిమ్ అంగీకరించరు. ఉత్తర కొరియా వచ్చేందుకు ట్రంప్ సిద్ధపడరు. రెండు దేశాల ప్రజా నీకంలోనూ అవతలివారిపై ఆ స్థాయిలో విద్వేషభావాలున్నాయి. పరస్పరం ఉండే అపనమ్మకాలు, భయాల సంగతలా ఉంచి... ఆ విద్వేషభావాలను కాదని నిర్ణయం తీసుకోవడం ఇద్దరికీ కష్టమే. ఇక కిమ్ పశ్చిమ దేశాల్లో చర్చలకు ఇష్టపడరు. వేరే దేశాల్లో ట్రంప్‌కు తగిన భద్రత కల్పించడం కష్టమని అమెరికా అభిప్రాయం. అందుకే చివరకు సింగపూర్‌లో చర్చలకు అంగీకారం కుదిరింది.
అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత శత్రువులుండరు, శాశ్వత మిత్రులూ ఉండరు. పరిస్థితులు, ప్రయోజనాలు ఎలాంటి అసాధ్యన్నయినా సుసాధ్యం చేస్తాయి. అందువల్లే ట్రంప్‌ను చర్చలకు ఆహ్వానిస్తూ కిమ్ ప్రకటించడం, దానికి ఆమోదం తెలుపుతూ రెండు నెలల్లో సమావేశమవుదామని ట్రంప్ జవాబివ్వడం చూసి అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ట్రంప్ సమావేశ స్థలిని, సమయాన్ని కూడా నిర్ణయించడంతో మరింత సంతోషపడ్డారు. ఈలోగా ‘ఆలూ లేదు, చూలూ లేదు...’ అన్నట్టు కొందరు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే, మరికొందరు ట్రంప్ దానికి అన్నివిధాలా అర్హుడంటూ వాదించారు. కానీ గాఢమైన శత్రుత్వం ఉన్న దేశాలు సమావేశమవుతామని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. ఆ సమావేశానికి అవసరమైన ప్రాతిపదికలను సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఇరు దేశాల అధికారులూ సంప్రదింపులు ప్రారంభించాలి. చర్చనీయాంశాలను ఖరారు చేసుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు.
కిమ్ ఎంతో నిజాయితీతో ఈ శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నారని మొదట్లో ప్రశంసించిన ట్రంప్ ఆ తర్వాత తన సహచరుల ద్వారా వేరే సంకేతాలు పంపారు. అణ్వాయుధాలన్నిటినీ ఏకపక్షంగా స్వాధీనం చేయడానికి కిమ్ సర్కారు అంగీకరించిందంటూ వారం క్రితం అమెరికా చెప్పడం ఉత్తర కొరియాకు ఆగ్రహం తెప్పించింది. ఇది నిజం కాదని ఆ దేశం ఖండించింది. కనీసం ఆ దశలోనైనా ఇరు దేశాలూ మాట్లాడుకుని అపోహలు తలెత్తకుండా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఈలోగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చేసిన ప్రకటన పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు ‘లిబియా నమూనా’ అత్యుత్తమమైనదని బోల్టన్ ప్రకటన సారాంశం. ‘లిబియాకు, ఆ దేశాధినేత గడాఫీకి పట్టిన గతిని చూసిన తర్వాతే మేం అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని నిర్ణయిం చుకున్నాం. అటువంటప్పుడు ఆ నమూనా మాకెలా పనికొస్తుంద’ని ఉత్తర కొరియా ప్రశ్నించింది. అప్పటికైనా అమెరికా తెలివి తెచ్చుకుని ఉంటే వేరుగా ఉండేది. కానీ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సైతం అలాగే మాట్లాడారు. దాంతో ‘మైక్ పెన్స్ అజ్ఞాని, మూర్ఖుడు’ అంటూ ఉత్తర కొరియా ప్రత్యుత్తరమిచ్చింది. ఇప్పుడు చర్చలు రద్దు కావడానికి ట్రంప్ ఆ ప్రకటననే కారణంగా చూపు తున్నారు.
చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధపడిన దేశానికి లిబియాను గుర్తు చేయడం అజ్ఞానం కాక పోవచ్చుగానీ మూర్ఖత్వం. లిబియాలో అమెరికా, పశ్చిమ దేశాలు ఏమాత్రం నిజాయితీగా వ్యవ హరించలేదు. అణ్వస్త్ర కార్యక్రమాన్ని నిలిపేస్తే అన్నివిధాలా అండదండలు అందిస్తామని గడాఫీకి ఆ దేశాలు హామీ ఇచ్చాయి. వారిని నమ్మి 2003లో గడాఫీ ఆ కార్యక్రమాన్ని నిలిపేశారు. 2011లో పశ్చిమ దేశాల అండతో అక్కడ తిరుగుబాటు రాజుకుంది. అంతర్యుద్ధంలో నాటో దళాల అండతో తిరుగుబాటుదార్లు గడాఫీని హతమార్చారు. ఏడేళ్లవుతున్నా ఇప్పటికీ అది సాధారణ స్థితికి చేరలేదు. అక్కడ అరాచకం తాండవిస్తోంది. నిత్యం కారు బాంబు పేలుళ్లతో, పరస్పర దాడులతో అది అట్టుడుకుతోంది. నిత్యం పదులకొద్దీమంది మరణిస్తున్నారు.
లిబియాలో ఏం నిర్వాకం వెలగబెట్టారని అమెరికా ఈ సమయంలో ఉత్తర కొరియాకు దాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది? వర్తమాన లిబియా ఎలా ఉందో ప్రపంచమంతా గమనిస్తున్నా దాన్నొక ‘నమూనా’గా చెప్పడం అమెరికా అహంకార ధోరణికి నిదర్శనం. ఇది బెదిరించడం తప్ప మరేమీ కాదు. నిజానికి గడాఫీకి ఏం గతి పట్టిందో చూశాకే ఉత్తర కొరియా అణ్వస్త్రాల బాట పట్టింది. ఆ పరిస్థితులు రానివ్వబోమని ఉత్తర కొరియాకు గట్టి హామీ ఇచ్చి ప్రశాంతత చేకూర్చడానికి బదులు ఇష్టానుసారం మాట్లాడటం సబబేనా? ఒక అణ్వస్త్ర దేశంతో ఎలా వ్యవహరించాలో ట్రంప్‌కు ముందున్న ఒబామాకు కూడా అర్ధం కాలేదు. కనీసం ఆయన కయ్యానికి కాలుదువ్వలేదు. ట్రంప్ ఆమాత్రం తెలివైనా ప్రద ర్శించలేకపోతున్నారు.తన దగ్గర అణ్వస్త్రాలు పెట్టుకుని అణునిరాయుధీకరణ విషయంలో అందరికీ ఉపన్యాసాలివ్వడమే తప్పనుకుంటే, బెదిరించి దారికి తెచ్చుకుందామని భావించడం మరింత ఘోరం. బెదిరింపులు, హెచ్చరికలు సత్ఫలితాలనీయవు. ఇప్పటికైనా పరిణతితో ఆలో చించి తిరిగి సాధారణ పరిస్థితి ఏర్పడేలా చూడటం, శాంతి చర్చలకు అవసరమైన వాతావరణం ఏర్పర్చడం అమెరికా బాధ్యత. ఏదో ఒక సాకుతో చర్చల నుంచి వెనక్కు తగ్గితే ప్రపంచ ప్రజానీకం క్షమించదు.
Comments
Please login to add a commentAdd a comment