వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసేసుకున్నాడు. అణు పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి.. అమెరికాతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించాడు. ఈ విషయాన్ని అటు అమెరికా.. ఇటు ఉత్తర కొరియా అధికారులు ధృవీకరించారు.
‘ఉత్తర కొరియా-అమెరికా అధికారులు ఈ విషయమై గత కొంత కాలంగా రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం ప్యోంగ్‌యాంగ్ అధికారులు నేరుగా సంకేతాలను పంపారు. త్వరలో తటస్థ ప్రదేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. అయితే అందుకు సానుకూల వాతావరణం ఏర్పడాల్సిన అవసరం ఉందని అమెరికా భావిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రపంచ దేశాలు శుభవార్తను వింటాయ్’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక దూతలు కూడా జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
ఇక మరోవైపు దక్షిణ కొరియా కూడా ఉత్తర కొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల వాషింగ్టన్ వెళ్లిన ఓ దౌత్య బృందం కిమ్-ట్రంప్ చర్చల సాధ్యాసాధ్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ, ఇప్పుడు గోప్యంగా రహస్య చర్చలు జరపటం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment