nuclear programme
-
ఆ యుద్ధమే అతడిని భారత్‌కి రప్పించింది! అణు పితామహుడిగా మార్చింది!
భారత దేశాన్ని అణు విజ్ఞాన రంగంలో శక్తివంతమైన శాస్త్రీయ శక్తిగా ఉద్భవించేలా నడిపించన వ్యక్తి డాక్టర్ హోమీ జహంగీర్ భాభా. ఆయన్ను అణు కార్యక్రమ పితామహుడిగా కూడా పిలుస్తారు. ఈ రోజు ఆయన 114వ జయంతి(అక్టోబర్ 30 హోమీ జహంగీర్ భాభా జన్మదినం) సందర్భంగా ఆయన ప్రస్థానం, అణు కార్యక్రమంలో చేసిన విశేష కృషి తదితరాల గురించే ఈ కథనం!. ఆయన నేపథ్యం.. డాక్టర్ భాభా అక్లోబర్ 30, 1909న బొంబాయిలో ఒక ప్రసిద్ధ పార్సీ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జెహంగీర్ హోర్ముస్జీ భాభా న్యాయవాది. తల్లి మెహెరీన్. అతని ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తిచేయగా, మిగతా విద్యాభ్యాసం అంతా ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగింది. భాభా కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్‌లో ఉత్తీర్ణత సాధించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించాడు. అతనికి గణితం, భౌతకి శాస్త్రం అన్నా అత్యంత మక్కువ. తండ్రి పెట్టిన షరతు ప్రకారం కేంబ్రిడ్జిలో మెకానికల్ విద్యను పూర్తి చేసి, పాల్‌డ్రిక్ ఆధ్వర్యంలో గణితంలో ట్రిపోస్ పూర్తి చేశాడు. ఈ సమయంలో అణు భౌతిక శాస్త్రం అతడిని ఆకర్షించింది. కాలక్రమేణ అపారమైన రేడియేషన్‌ను విడుదల చేసే కణాలపై ప్రయోగాలు చేయడం అతని అభిరుచిగా మారింది. పరిశోధనల దిశగా అడుగులు ఆ అణు సైద్ధాంతిక బౌతిక శాస్త్రంలో డాక్టరేట్ కోసం పరిశోధనలు చేయడంలో భాగంగా కావెండిష్ ప్రయోగశాలలో పనిచేశాడు. ఆ సమయంలో భాభా ప్రచురించిన "ది అబ్సార్ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్" అనే పరిశోధన పత్రానికి ఐజాక్ న్యూటన్ స్టూడెంట్ షిప్‌ని గెలుచుకున్నాడు. అందులో ఆయన విశ్వ కిరణాలలో శోషణ లక్షణాలు, ఎలక్ట్రాన్ షవర్ ఉత్పత్తి గురించి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఈ స్టూడెంట్‌షిప్‌ని ఆయనే గెలుచుకున్నారు. ఇక రాల్ఫ్ హెచ్ ఫౌలర్ ఆధ్వర్యంలో భాభా తన సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశారు. అంతేగాదు ఆయన ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని నిర్ణయించే మొదటి గణనను చేశాడు. ఆ తరువాత కాలంలో అతని సేవలకు గుర్తింపుగా ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణను భాభా పరిక్షేపణ" (భాభా స్కాటరింగ్) పిలిచారు. అలాగే 1936లో కాస్మిక్ కిరణాలలో ఎలక్ట్రాన్, పాజిట్రాన్ షవర్ల ఉత్పత్తి సిద్ధాంతాన్ని రూపొందించాడు. దీనిని భాభా-హీట్లర్ సిద్ధాంతం అని పిలుస్తారు. ఇలా ఆయన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనే తన పరిశోధనలు కొనసాగించారు. భారత్‌కి రాక.. 1939 సెప్టెంబరు లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడంతో.. భాభా సెలవు తీసుకొని భారతదేశంలో కొద్ది కాలం ఉండటానికి వచ్చారు. అయితే ఆ యుద్ధం కారణంగానే ఆయన ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భాభా నోబెల్ బహుమతి గ్రహీత సి వి రామన్ నేతృత్వంలో బెంగళూరులో నడుస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా పనిచేశారు. అణు కార్యక్రమాల ఏర్పాటు.. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం అణు రంగంలో చాలా వెనుకబడి ఉంది. అందుకు సంబంధించిన ప్రయోగశాలు, కళాశాలలు లేకపోవడం బాధించింది. దీంతో ఆయన ప్రతిష్ఠాత్మక అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముఖ్యంగా భారతదేశపు మొదటి ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించి విజయం సాధించారు. అందుకోసం అని కాస్మిక్ కిరణాల పరిశోధనా విభాగాన్ని కూడా అతను స్థాపించాడు. అతను పాయింట్ కణాల కదలిక సిద్ధాంతంపై పనిచేయడం ప్రారంభించాడు. స్వతంత్రంగా 1944లో అణ్వాయుధాలపై పరిశోధనలు చేశాడు. 1945లో అతను ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ సంస్థలను స్థాపించాడు. ఆ తర్వాత నెహ్రు వాటికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా భాభాని నియమించారు. ఆయన ఆ సంస్థలో డైరెక్టర్‌గా, భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా విశేష సేవలందించారు. అలా ఆయన అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించాడు. అయితే అణు కార్యక్రమాలకు యురేనియం నిల్వలు కావాల్సి ఉంటుంది. కానీ భారత్‌లో ఆ నిల్వలు తక్కువ, అందుకని మనకు లభ్యమవుతున్న థోరియం నిల్వల నుంచే అణు శక్తిని వెలికి తీసే వ్యూహాంతో మూడు దశల్లో అణుకార్యక్రమానికి నాంది పలికారు. దీంతో అతను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు 1955 లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడమే గాక 1958లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు. వివాదంగా ఆయన మరణం.. 1966 జనవరి లో, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు. భారతదేశంలో అణు కార్యక్రమాన్ని స్తంభింపజేయాలనే దురుద్దేశంతో సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) భాభా విమాన ప్రమాదానికి కుట్ర చేసిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఐతే 2012లో విమానం కూలిన ప్రాంతం సమీపంలో క్యాలెండర్లు, వ్యక్తిగత లేఖకు సంబంధించిన భారతీయ దౌత్య సంచి తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గ్రెగోరి డగ్లోస్ అనే జర్నలిస్ట్ తాను ప్రచురించిన కాన్వర్సేషన్ విత్ ద క్రో" అనే పుస్తకంలో హోమిభాభాను హత్య చేయడానికి సిఐఎ కారణమని రాయడం గమనార్హం. ఆయనకు లభించిన అవార్డులు! ఆయన 1942లో ఆడమ్స్ ప్రైజ్. 1954 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1951, 1953, 1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన మరణానంతరం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. అంతేగాదు అయన పేరు మీదుగా ముంబెలో డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెన్సు ఎడ్యుకేషన్ సెంటర్ తదితరాలను ఏర్పాటు చేసి అత్యున్నత గౌరవం ఇచ్చింది భారత ప్రభుత్వం. (చదవండి: '70 గంటలు పని'..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!) -
సమరశంఖం పూరించారు.. తగలబెట్టేస్తాం..
మాస్కో : ఉత్తరకొరియాతో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమరశంఖం పూరించారని, అమెరికాను వదిలే ప్రసక్తే లేదని కొరియా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ మేరకు రష్యన్ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. అమెరికా మంటల్లో కాలి బూడిదయ్యేలా చేస్తామని రి యాంగ్ హో తీవ్రంగా మాట్లాడినట్లు పేర్కొంది. తమ దేశం చేస్తున్న అణు పరీక్షలతో ప్రపంచదేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నట్లు చెప్పింది. దీని గురించి పదే పదే చర్చించాల్సిన పని లేదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు వివరించింది. యూఎన్‌లో ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధం అనే అగ్గిని రాజేసింది అగ్రరాజ్యమేనని అన్నట్లు చెప్పింది. అణు ఆయుధాల గురించి తాము ఎవరితోనూ.. ఎలాంటి చర్చలకు సిద్ధంగా లేమని హో పేర్కొన్నట్లు తెలిపింది. -
అవసరమైతే ఏకపక్షంగా చూసుకుంటాం: ట్రంప్
ఉత్తర కొరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగే ఇచ్చారు. అవసరమైతే ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను నిరోధించడానికి ఏకపక్షంగానే చూసుకుంటామని తెలిపారు. ఉత్తరకొరియా పరిస్థితిని మార్చడంలో చైనా విఫలమైతే తాము రంగప్రవేశం చేస్తామన్నారు. ఉత్తర కొరియా విషయంలో తమకు చైనా సాయం చేయాలనుకుంటోందో లేదో ఆ దేశం నిర్ణయించుకుని చెప్పాలని ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. వాళ్లంతట వాళ్లు ముందుకొచ్చి కొరియాను నియంత్రిస్తే అది చైనాకే మంచిదని, అలా చేయకపోతే ఎవరికీ మంచిది కాదని అన్నారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమం గురించి ట్రంప్ ప్రభుత్వం ముందునుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తర కొరియా అణ్వస్త్ర వ్యాప్తికి ప్రధాన బాధ్యత చైనాదేనని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. చైనా నుంచి అందిన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉత్తర కొరియా చెలరేగిపోతోందని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్స గత నెలలో చైనాకు వెళ్లొచ్చారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. -
ట్రంప్ వేటు.. ఇరాన్ క్షిపణి పరీక్ష!
దుబాయ్: తాము ఓ కొత్త అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, అణు ఒప్పందాన్ని మాత్రం ఉల్లంఘించలేదని చెప్పింది. ఏడు ఇస్లామిక్ దేశాలకు చెందిన ముస్లింలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమయంలోనే ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు ఇరాన్ మంత్రి హోసెయిన్ దెహ్గాన్ చెబుతూ తాము పరీక్ష నిర్వహించింది వాస్తవమేనని, అయితే, అణు కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలుగానీ ఉల్లంఘించడంగానీ, ఐక్యరాజ్యసమితి జాతీయ భద్రాతా మండలి తీర్మాణానికి వ్యతిరేకంగాగానీ చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఆదివారం 1,010కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని పరీక్షించినట్లు అమెరికా అధికారులు అన్నారు. ఆ క్షిపణి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పేలిందని కూడా తెలిపారు. -
జగడాలమారి మారదట
ప్యాంగ్యాంగ్: జగడాలమారి ఉత్తర కొరియా తన తీరు మార్చుకోదట. తమ దేశ అణు కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉత్తర కొరియా సైనికాధికారులు మరోసారి స్పష్టం చేశారు. అయితే, తమ సైనిక సంపత్తిని ఉన్నతీకరించే చర్యల్లోభాగంగా అణుకార్యక్రమాలు ఉంటాయి తప్ప ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఉద్దేశం మాత్రం కాదని చెప్పాయి. ఏ దేశం తమ దేశంపై దాడి చేయనంత వరకు ఎలాంటి అణ్వాయుధాలు ఉపయోగించబోమని చెప్పింది. ప్రపంచ అణ్వాయుధాల కార్యక్రమాల నిబంధనలకు అనుగుణంగా తమవంతు బాధ్యతను పంచుకుంటూనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఉత్తర కొరియా అధికార పార్టీకి చెందిన అధికార ప్రతినిధి రోడాంగ్ సిమ్నం తెలిపారు. గత మే నెలలో పార్టీ 7వ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ ఆర్థిక పురోభివృద్ధితోపాటు అణ్వాయుధాల సంపత్తి విషయంలో కూడా దేశం దూసుకెళ్లాలని ప్రసంగించిన విషయం తెలిసిందే. -
అమెరికా విషవిధానం మారనంత వరకూ..!
సియోల్: అణుబాంబు కంటే కూడా అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించడం ద్వారా ఉత్తర కొరియా ప్రపంచదేశాలను విస్మయంలో ముంచెత్తింది. అణ్వాయుధ అభివృద్ధిలో సంపన్న దేశాలకు దీటుగా ముందడుగు వేసినట్టు ప్రపంచానికి చాటింది. '2016 జనవరి 6న ఉదయం పది గంటలకు మనం దేశం విజయవంతంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. వర్కర్స్ పార్టీ వ్యూహాత్మక నిర్ణయానికి అనుగుణంగా ఈ పరీక్షలు జరిగాయి' అని ఉత్తర కొరియా ప్రభుత్వ టెలివిజన్ న్యూస్ రీడర్ ప్రకటించారు. ఈ చారిత్రక పరీక్షను పరిపూర్ణంగా నిర్వహించడం ద్వారా అత్యాధునిక అణ్వాయుధ పరిజ్ఞానం కలిగిన దేశాల సరసన ఉత్తర కొరియా నిలిచినట్టు తెలిపారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలో భాగంగా అతి చిన్న పరికరాన్ని మాత్రమే ప్రస్తుతం పరీక్షించినట్టు న్యూస్ రీడర్ చెప్పారు. ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు.. ఆయన సూచనల మేరకే హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. గత డిసెంబర్లోనే తాము హైడ్రోజన్ బాంబు తయారుచేసినట్టు కిమ్ ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనను అంతర్జాతీయ నిపుణులు కొట్టిపారేశారు. అయితే పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, స్వేదేశీ మానవ వనరులతో ఈ పరీక్షను నిర్వహించినట్టు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న ప్రతిజ్ఞకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే అత్యాధునిక అణ్వాయుధ సంపత్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోబోమని ఉత్తర కొరియా తెలిపింది. 'ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా విషపూరిత విధానాన్ని కొనసాగించినంతకాలం.. మా అణు అభివృద్ధి కార్యక్రమాన్ని మానుకోబోం' అని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా భయాందోళనలు అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించడంపై అంతర్జాతీయంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యపై పొరుగుదేశం జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత భద్రతకు ప్రమాదకరమని జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. అమెరికా కూడా ఉత్తర కొరియా చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి.. ఈ అంశంపై చర్చించనుంది. -
'భారత్‌ది అతిపెద్ద అణు కార్యక్రమం!'
వాషింగ్టన్: అతిపెద్ద అణుశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్న అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి అని అమెరికాకు చెందిన మేధోసంస్థ పేర్కొంది. 2014నాటికి 75 నుంచి 125 అణ్వాయుధాలు తయారుచేసుకోగల ప్లూటోనియం నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొంది. 'భారత్ వద్ద ఉన్న ఆయుధ స్థాయి ప్లూటోనియం బట్టి.. దానివద్ద ఉన్న అణ్వాయుధ సంపత్తిని అంచనా వేయవచ్చు. దీనిని ఆధారంగా భారత్ వద్ద 110 నుంచి 175 అణ్వాయుధాలు ఉండే అవకాశముందని, దాదాపు 138 అణ్వాయుధాలు ఉండవచ్చునని అంచనా వేయవచ్చునని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కొంది. అయితే వేపన్ గ్రేడ్ ప్లూటోనియం నిల్వల నుంచి భారత్ తయారుచేస్తున్న అణ్వాయుధాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేయవచ్చునని, వేపన్ గ్రేడ్ యూరేనియం నిల్వల నుంచి 70శాతం మాత్రమే అణ్వాయుధాలు కోసం వాడి ఉంటుందని భావించవచ్చునని ఆ సంస్థ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ నివేదికను రూపొందించిన రచయితల్లో ఒకరైన డేవిడ్ అల్ బ్రైట్ గతంలో అణు కార్యక్రమం విషయంలో భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డాడు. భారత్-అమెరికా అణు ఒప్పందం కుదరకుండా ప్రయత్నాలు చేసిన అమెరికా సంస్థల్లో ఈ మేధో సంస్థ కూడా ఉంది. -
పశ్చిమాసియాలో శాంతి వీచిక!
సంపాదకీయం: రెండోసారి గద్దెనెక్కాక అపశ్రుతులు వినడమే అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తొలిసారి ఇది తీపి కబురు. తన అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలకు తలొగ్గే ఒప్పందంపై ఇరాన్ ఆదివారం సంతకం చేసింది. అమెరికా, మరో అయిదు దేశాలకూ... ఇరాన్‌కూ మధ్య జెనివాలో సంతకాలయ్యాయి. మూడున్నర దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందంలో భాగస్వాములు కావడం ఇదే తొలిసారి. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య మూడునెలలుగా సాగుతున్న చర్చలు ఈ ఒప్పందాన్ని సాకారం చేశాయి. దశాబ్దాలుగా అమెరికా విధిస్తూ వచ్చిన కఠినమైన ఆంక్షలనుంచి కాస్తయినా వెసులుబాటు లభించేందుకు ఈ ఒప్పందంతో ఇరాన్‌కు అవకాశం ఏర్పడింది. రెండేళ్లక్రితం ఇరాన్ యురేనియం శుద్ధిని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాక పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్, ఇతర పాశ్చాత్య దేశాలు కత్తులు నూరాయి. దారికి రాకపోతే దాడులు తప్పవని హెచ్చరించాయి. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందేనని ఇరాన్ చెప్పిన మాటలను ఆ దేశాలు విశ్వసించలేదు. ఒక దశలో యుద్ధం అనివార్యం కావొచ్చన్న స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆరుదేశాలకూ, ఇరాన్‌కూ కుదిరిన ఈ ఒప్పందం ఒక రకంగా ఉద్రిక్తతలను ఉపశమింపజేస్తుంది. వాస్తవానికి ఇరాన్ అణు కార్యక్రమం రహస్యమైనదేమీ కాదు. 1967లో టెహ్రాన్ లో అణు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సాయపడింది అమెరికాయే. అమెరికాకు ప్రీతిపాత్రుడైన ఇరాన్ షాను అక్కడి విద్యార్థి విప్లవం 1979లో పదవీచ్యుతుణ్ణి చేసే వరకూ రెండు దేశాలమధ్యా సన్నిహిత సంబంధాలుండేవి. అటు తర్వాత ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు మొదలయ్యాయి. ఏ అంతర్జాతీయ సంస్థనుంచీ ఇరాన్‌కు అప్పుపుట్టకుండా చేయడం, తమ దేశంలో ఇరాన్‌కు ఉన్న వేల కోట్ల డాలర్ల బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర ఆస్తుల్ని స్తంభింపజేయడం వంటి చర్యలకు అమెరికా పూనుకుంది. అది ఉత్పత్తి చేస్తున్న చమురును ఏ దేశమూ కొనకూడదన్న ఒత్తిళ్లూ ఎక్కువయ్యాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సైతం ఇరాన్ అణు కార్యక్రమానికి పూనుకున్నది. అయితే, ఈ అణు కార్యక్రమంపై చర్చలకు తాను సిద్ధమేనని ఇరాన్ ఆదినుంచీ చెబుతూనే వచ్చింది. ఈ చర్చలు పశ్చిమాసియాలో పూర్తి అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలన్నది ఇరాన్ వాదన. ఇరాన్‌కు పొరుగున ఉన్న ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అణ్వస్త్రాలున్నందువల్ల ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరించలేదు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేయాలన్న అమెరికా, పాశ్చాత్య దేశాలు ఒక మెట్టు దిగొచ్చాయి. యురేనియం శుద్ధిని 5 శాతానికి మించనీయొద్దని ఈ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇప్పటికే నిల్వ ఉన్న శుద్ధిచేసిన యురేనియంను పలచన చేయాలని లేదా ఆక్సైడ్‌గా మార్చాలని ఒప్పందం సూచించింది. ఇరాన్ వద్దనున్న సెంట్రిఫ్యూజుల సంఖ్యను పెంచకూడదని కూడా స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తన వంతుగా ఒక మెట్టు దిగింది. మొత్తంగా అణ్వస్త్ర నిషేధానికి దారితీసేవిధంగా చర్చలుండాలన్న తన షరతును సడలించుకుంది. ఒప్పందం పర్యవసానంగా ఇకపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది. దశాబ్దకాలం నుంచి కొనసాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమానికి ఈ ఒప్పందం ద్వారా తొలిసారి అడ్డుకట్ట వేయగలిగామని అమెరికా సంతృప్తిపడుతుండగా, స్తంభింపజేసిన ఖాతాల్లోని 400 కోట్ల డాలర్ల చమురు అమ్మకాల సొమ్ము తన చేతికొస్తుందని... బంగారం, పెట్రోకెమికల్స్, కార్లు, విమానాల విడిభాగాలపై ఉన్న ఆంక్షలు సడలుతాయని ఇరాన్ ఊపిరిపీల్చుకుంటున్నది. అయితే, ఈ ఒప్పందం సిమెంటు రోడ్డుమీది ప్రయాణంలా సాఫీగా సాగి పోతుందని చెప్పడానికి వీల్లేదు. పాశ్చాత్య ప్రపంచంతో ఎలాంటి రాజీకైనా ససేమిరా అంగీకరించని ఛాందసవాదుల ప్రాబల్యం ఇరాన్లో బలంగానే ఉంది. అలాగే, ఇరాన్ పై బలప్రయోగం చేసి పాదాక్రాంతం చేసుకోవాలి తప్ప, ఆ దేశంతో చర్చలేమిటని ప్రశ్నించే ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశంగా ఉంది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు వెలువడిన వెంటనే ‘ఇది చరిత్రాత్మక ఒప్పందం కాదు... చరిత్రాత్మక తప్పిదం’ అంటూ బుసలుకొట్టింది. ఇకనుంచి ఈ ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారబోతున్నదని ఆందోళనవ్యక్తం చేసింది. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా వంటి ఇరాన్ శత్రుదేశాలు ఇజ్రాయెల్ అభిప్రాయంతో గొంతు కలిపాయి. ఇలాంటి ప్రమాదాలున్నాయి గనుకే రానున్న ఆరునెలలూ కీలకమైనవి. ఇప్పుడు కుదిరిన జెనీవా ఒప్పందం తాత్కాలికమైనదే. దీని ప్రాతిపదికన రానున్న ఆరునెలల కాలంలో మరిన్ని చర్చలు కొనసాగి సమగ్రమైన, శాశ్వత ఒప్పందం సాకారం కావాల్సి ఉంది. అది జరిగాకే ఇరాన్‌పై ఇప్పుడున్న ఆంక్షలన్నీ పూర్తిగా తొలగే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పర్యవసానంగా లాభపడే దేశాల్లో మన దేశమూ ఉంటుంది. ఇరాన్ నుంచి నేరుగా చమురును చేరేసే ఇరాన్-పాకిస్థాన్- ఇండియా (ఐపీఐ) పైప్‌లైన్ ప్రాజెక్టు నుంచి మన దేశం మధ్యలోనే వైదొలగింది. ఇందుకు భద్రతాపరమైన కారణాలను చూపింది. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా ఆ ప్రాజెక్టులో మళ్లీ చేరే అవకాశం ఉంది. అలాగే మన దేశంనుంచి ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయి. అయితే, దశాబ్దాలుగా పరస్పర అవిశ్వాసంతో, శత్రుత్వంతో రగిలిపోతున్న దేశాల మధ్య సంపూర్ణ సదవగాహన ఏర్పడటం అంత సులభం కాదు. అందుకు చాలా సమయం పట్టవచ్చు. అది సాకారం కావడానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధితో వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా పశ్చిమాసియాలో ఇన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానా లను సవరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెదిరింపుల ద్వారా ఏమైనా సాధించగలమన్న అభిప్రాయాన్ని అది మార్చుకోవాలి. అందుకు అది ఏమేరకు సిద్ధపడుతుందన్నదాన్నిబట్టి ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలు ఏర్పడతాయి. -
‘అణు’ నియంత్రణకు ఇరాన్ ఓకే!
అగ్రరాజ్యాలతో కీలక ఒప్పందం ఐరాస, ఈయూ, భారత్ హర్షం చారిత్రక తప్పిదం: ఇజ్రాయెల్ వాషింగ్టన్/జెనీవా: తమ దేశంలో అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునే దిశగా ఇరాన్ అగ్రరాజ్యాలతో ఆదివారం ఓ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు ప్రతిగా పీ5 (ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్వత (పర్మినెంట్-పీ) సభ్య దేశాలు ఇరాన్‌పై విధించిన ఆంక్షలు కొన్నింటిని సడలించేలా అంగీకారం కుదిరింది. వివాదాస్పద అంశంపై ఓ ముస్లిం దేశం, పశ్చిమ దేశాల మధ్య సాధించిన అత్యంత ప్రధానమైన, స్పష్టమైన పురోగతిగా దీనిని భావిస్తున్నారు. ఐరాస, భారత్ సహా పలు దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. నాలుగురోజుల పాటు విస్తృతంగా సాగిం చిన చర్చలకు ముగింపు పలుకుతూ పీ5+1 గ్రూపు దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్+జర్మనీ దేశాల ప్రతినిధులు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్యం నెరపేందుకు ఈ దేశాలు గ్రూపుగా ఏర్పడ్డాయి. కాగా జెనీవాలో జరిగిన ఈ ఒప్పందం గురించి ఐరోపా యూనియన్ (ఈయూ) విదేశీ విధాన అధినేత కేథరిన్ ఆష్టన్ ప్రకటన చేశారు. ఈ ఒప్పందం మేరకు ఇరాన్ ఇకపై తన అణు కార్యక్రమాల పరిశీలనకు వచ్చేవారికి సహకరిస్తుంది. అంతేకాదు యురేనియం శుద్ధికి సంబంధించిన కొన్ని పనుల్ని నిలిపివేస్తుంది. యురేనియంను 5 శాతానికి మించి శుద్ధి చేయదు. 5 శాతానికి మిం చి శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గిస్తుంది. యురేనియంను 5 శాతానికి మిం చి శుద్ధి చేస్తే దానిని ఆయుధ పరిశోధనల నిమిత్తం వినియోగించవచ్చు. మరోవైపు పీ5+1 దేశాలు ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఆరు నెలల పాటు ఎత్తివేస్తాయి. ఈ మేరకు ఇరాన్‌కు విలువైన ఖనిజాలతో పాటు వివిధరంగాలపై సుమారు రూ.40 వేల కోట్ల విలువైన ఆంక్షల సడలింపు లభిస్తుంది. కీలకమైన తొలి అడుగు: ఒబామా ప్రాథమిక ఆరు నెలల అవగాహనగా భావిస్తున్న ఈ ఒప్పందంలో.. ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా నిరోధించేందుకు తగిన పరిమితులు కూడా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఈ రోజు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి.. ఇరాన్ అణు కార్యక్రమాలపై తమ ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా ఓ కీలకమైన తొలి అడుగు వేసిందని టీవీలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన పేర్కొన్నారు. యురేనియంను శుద్ధి చేయగలిగిన ఇరాన్ సామర్ధ్యానికి ఈ ఒప్పందం అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. దేశంలో యురేనియంను శుద్ధి చేసే ఇరాన్ హక్కును ఈ ఒప్పందం ద్వారా అగ్రరాజ్యాలు అంగీకరించినట్టయిందన్నారు. అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ కోరుకున్నది ఇచ్చి.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని మాత్రం కొనసాగింపజేసే చెడ్డ ఒప్పందంగా దీనిని అభివర్ణించింది. జెనీవాలో జరిగింది చారిత్రక ఒప్పందం కాదని, చారిత్రక తప్పిదమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. స్వాగతించిన ఐరాస, భారత్: ఐరాస, ఐరోపా యూనియన్‌తో పాటు భారత్, చైనా, రష్యా, బ్రిటన్, సిరియా, ఇరాక్ తదితర దేశాలు ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు, చర్చల కొనసాగింపును అనుమతించే దిశగా.. ఈ స్ఫూర్తిమంతమైన ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకుని సాధ్యమైనవన్నీ చేయాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఇరాన్‌తో పాటు పీ5 దేశాలను కోరారు. చర్చలు, దౌత్యప్రక్రియ ద్వారా ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమస్యల పరిష్కారంపై ఒప్పందం కుదరడాన్ని స్వాగతిస్తున్నట్టు భారత్ తెలిపింది. భారత్‌కు ఒరిగేదేమీ లేదు! వాషింగ్టన్: అణు కార్యక్రమాలపై ఇరాన్ అంతర్జాతీయ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నా దాంతో భారత్‌లాంటి దేశాలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలన్న నిబంధన యథాతథంగా కొనసాగ నుంది. అంటే ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ లాంటి దేశాలు ఎప్పట్లాగే తగ్గించుకోవాల్సి ఉంటుంది. చమురు, ఆర్థిక, బ్యాంకింగ్ అంశాల్లో ఇరాన్‌పై ఆంక్షలు సాగుతాయని అమెరికా తన వాస్తవ పత్రంలో స్పష్టంగా పేర్కొంది. ఇరాన్‌పై ఆంక్షల వల్ల 2012-13 సంవత్సరంలో భారత్ ఆ దేశం నుంచి చమురు దిగుమతులను 26.5 శాతం తగ్గించుకుంది. కేవలం 13.3 మిలియన్ టన్నుల ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది.అంతకుముందు ఏడాది 18.1 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల వల్ల ఇలా దిగుమతుల్లో కోత విధించుకోవాల్సి వస్తోంది. భారత్‌కు అత్యధికంగా చమురు ఎగుమతి చే సే దేశాల్లో గతంలో రెండోస్థానంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది.