'భారత్ది అతిపెద్ద అణు కార్యక్రమం!'
వాషింగ్టన్: అతిపెద్ద అణుశక్తి కార్యక్రమాన్ని చేపడుతున్న అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి అని అమెరికాకు చెందిన మేధోసంస్థ పేర్కొంది. 2014నాటికి 75 నుంచి 125 అణ్వాయుధాలు తయారుచేసుకోగల ప్లూటోనియం నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొంది. 'భారత్ వద్ద ఉన్న ఆయుధ స్థాయి ప్లూటోనియం బట్టి.. దానివద్ద ఉన్న అణ్వాయుధ సంపత్తిని అంచనా వేయవచ్చు. దీనిని ఆధారంగా భారత్ వద్ద 110 నుంచి 175 అణ్వాయుధాలు ఉండే అవకాశముందని, దాదాపు 138 అణ్వాయుధాలు ఉండవచ్చునని అంచనా వేయవచ్చునని ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కొంది.
అయితే వేపన్ గ్రేడ్ ప్లూటోనియం నిల్వల నుంచి భారత్ తయారుచేస్తున్న అణ్వాయుధాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేయవచ్చునని, వేపన్ గ్రేడ్ యూరేనియం నిల్వల నుంచి 70శాతం మాత్రమే అణ్వాయుధాలు కోసం వాడి ఉంటుందని భావించవచ్చునని ఆ సంస్థ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ నివేదికను రూపొందించిన రచయితల్లో ఒకరైన డేవిడ్ అల్ బ్రైట్ గతంలో అణు కార్యక్రమం విషయంలో భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడ్డాడు. భారత్-అమెరికా అణు ఒప్పందం కుదరకుండా ప్రయత్నాలు చేసిన అమెరికా సంస్థల్లో ఈ మేధో సంస్థ కూడా ఉంది.