భారత దేశాన్ని అణు విజ్ఞాన రంగంలో శక్తివంతమైన శాస్త్రీయ శక్తిగా ఉద్భవించేలా నడిపించన వ్యక్తి డాక్టర్ హోమీ జహంగీర్ భాభా. ఆయన్ను అణు కార్యక్రమ పితామహుడిగా కూడా పిలుస్తారు. ఈ రోజు ఆయన 114వ జయంతి(అక్టోబర్ 30 హోమీ జహంగీర్ భాభా జన్మదినం) సందర్భంగా ఆయన ప్రస్థానం, అణు కార్యక్రమంలో చేసిన విశేష కృషి తదితరాల గురించే ఈ కథనం!.
ఆయన నేపథ్యం..
డాక్టర్ భాభా అక్లోబర్ 30, 1909న బొంబాయిలో ఒక ప్రసిద్ధ పార్సీ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జెహంగీర్ హోర్ముస్‌జీ భాభా న్యాయవాది. తల్లి మెహెరీన్. అతని ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తిచేయగా, మిగతా విద్యాభ్యాసం అంతా ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగింది. భాభా కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్‌లో ఉత్తీర్ణత సాధించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించాడు. అతనికి గణితం, భౌతకి శాస్త్రం అన్నా అత్యంత మక్కువ. తండ్రి పెట్టిన షరతు ప్రకారం కేంబ్రిడ్జిలో మెకానికల్ విద్యను పూర్తి చేసి, పాల్‌డ్రిక్ ఆధ్వర్యంలో గణితంలో ట్రిపోస్ పూర్తి చేశాడు. ఈ సమయంలో అణు భౌతిక శాస్త్రం అతడిని ఆకర్షించింది. కాలక్రమేణ అపారమైన రేడియేషన్‌ను విడుదల చేసే కణాలపై ప్రయోగాలు చేయడం అతని అభిరుచిగా మారింది.
పరిశోధనల దిశగా అడుగులు
ఆ అణు సైద్ధాంతిక బౌతిక శాస్త్రంలో డాక్టరేట్ కోసం పరిశోధనలు చేయడంలో భాగంగా కావెండిష్ ప్రయోగశాలలో పనిచేశాడు. ఆ సమయంలో భాభా ప్రచురించిన "ది అబ్సార్‌ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్" అనే పరిశోధన పత్రానికి ఐజాక్ న్యూటన్ స్టూడెంట్ షిప్‌ని గెలుచుకున్నాడు. అందులో ఆయన విశ్వ కిరణాలలో శోషణ లక్షణాలు, ఎలక్ట్రాన్ షవర్ ఉత్పత్తి గురించి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఈ స్టూడెంట్‌షిప్‌ని ఆయనే గెలుచుకున్నారు. ఇక రాల్ఫ్ హెచ్ ఫౌలర్ ఆధ్వర్యంలో భాభా తన సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశారు. అంతేగాదు ఆయన ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని నిర్ణయించే మొదటి గణనను చేశాడు. ఆ తరువాత కాలంలో అతని సేవలకు గుర్తింపుగా ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణను భాభా పరిక్షేపణ" (భాభా స్కాటరింగ్) పిలిచారు. అలాగే 1936లో కాస్మిక్ కిరణాలలో ఎలక్ట్రాన్, పాజిట్రాన్ షవర్ల ఉత్పత్తి సిద్ధాంతాన్ని రూపొందించాడు. దీనిని భాభా-హీట్లర్ సిద్ధాంతం అని పిలుస్తారు. ఇలా ఆయన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనే తన పరిశోధనలు కొనసాగించారు.
భారత్‌కి రాక..
1939 సెప్టెంబరు లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడంతో.. భాభా సెలవు తీసుకొని భారతదేశంలో కొద్ది కాలం ఉండటానికి వచ్చారు. అయితే ఆ యుద్ధం కారణంగానే ఆయన ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భాభా నోబెల్ బహుమతి గ్రహీత సి వి రామన్ నేతృత్వంలో బెంగళూరులో నడుస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా పనిచేశారు.
అణు కార్యక్రమాల ఏర్పాటు..
మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం అణు రంగంలో చాలా వెనుకబడి ఉంది. అందుకు సంబంధించిన ప్రయోగశాలు, కళాశాలలు లేకపోవడం బాధించింది. దీంతో ఆయన ప్రతిష్ఠాత్మక అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముఖ్యంగా భారతదేశపు మొదటి ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించి విజయం సాధించారు. అందుకోసం అని కాస్మిక్ కిరణాల పరిశోధనా విభాగాన్ని కూడా అతను స్థాపించాడు. అతను పాయింట్ కణాల కదలిక సిద్ధాంతంపై పనిచేయడం ప్రారంభించాడు. స్వతంత్రంగా 1944లో అణ్వాయుధాలపై పరిశోధనలు చేశాడు. 1945లో అతను ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ సంస్థలను స్థాపించాడు.
ఆ తర్వాత నెహ్రు వాటికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా భాభాని నియమించారు. ఆయన ఆ సంస్థలో డైరెక్టర్‌గా, భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా విశేష సేవలందించారు. అలా ఆయన అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించాడు. అయితే అణు కార్యక్రమాలకు యురేనియం నిల్వలు కావాల్సి ఉంటుంది. కానీ భారత్‌లో ఆ నిల్వలు తక్కువ, అందుకని మనకు లభ్యమవుతున్న థోరియం నిల్వల నుంచే అణు శక్తిని వెలికి తీసే వ్యూహాంతో మూడు దశల్లో అణుకార్యక్రమానికి నాంది పలికారు. దీంతో అతను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు 1955 లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడమే గాక 1958లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు.
వివాదంగా ఆయన మరణం..
1966 జనవరి లో, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు. భారతదేశంలో అణు కార్యక్రమాన్ని స్తంభింపజేయాలనే దురుద్దేశంతో సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) భాభా విమాన ప్రమాదానికి కుట్ర చేసిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఐతే 2012లో విమానం కూలిన ప్రాంతం సమీపంలో క్యాలెండర్లు, వ్యక్తిగత లేఖకు సంబంధించిన భారతీయ దౌత్య సంచి తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గ్రెగోరి డగ్లోస్ అనే జర్నలిస్ట్ తాను ప్రచురించిన కాన్వర్‌సేషన్ విత్ ద క్రో" అనే పుస్తకంలో హోమిభాభాను హత్య చేయడానికి సిఐఎ కారణమని రాయడం గమనార్హం.
ఆయనకు లభించిన అవార్డులు!
ఆయన 1942లో ఆడమ్స్ ప్రైజ్. 1954 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1951, 1953, 1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన మరణానంతరం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. అంతేగాదు అయన పేరు మీదుగా ముంబెలో డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెన్సు ఎడ్యుకేషన్ సెంటర్ తదితరాలను ఏర్పాటు చేసి అత్యున్నత గౌరవం ఇచ్చింది భారత ప్రభుత్వం.
(చదవండి: '70 గంటలు పని'..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment