homi jehangir bhabha
-
ఆ యుద్ధమే అతడిని భారత్‌కి రప్పించింది! అణు పితామహుడిగా మార్చింది!
భారత దేశాన్ని అణు విజ్ఞాన రంగంలో శక్తివంతమైన శాస్త్రీయ శక్తిగా ఉద్భవించేలా నడిపించన వ్యక్తి డాక్టర్ హోమీ జహంగీర్ భాభా. ఆయన్ను అణు కార్యక్రమ పితామహుడిగా కూడా పిలుస్తారు. ఈ రోజు ఆయన 114వ జయంతి(అక్టోబర్ 30 హోమీ జహంగీర్ భాభా జన్మదినం) సందర్భంగా ఆయన ప్రస్థానం, అణు కార్యక్రమంలో చేసిన విశేష కృషి తదితరాల గురించే ఈ కథనం!. ఆయన నేపథ్యం.. డాక్టర్ భాభా అక్లోబర్ 30, 1909న బొంబాయిలో ఒక ప్రసిద్ధ పార్సీ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జెహంగీర్ హోర్ముస్జీ భాభా న్యాయవాది. తల్లి మెహెరీన్. అతని ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తిచేయగా, మిగతా విద్యాభ్యాసం అంతా ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో జరిగింది. భాభా కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్‌లో ఉత్తీర్ణత సాధించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించాడు. అతనికి గణితం, భౌతకి శాస్త్రం అన్నా అత్యంత మక్కువ. తండ్రి పెట్టిన షరతు ప్రకారం కేంబ్రిడ్జిలో మెకానికల్ విద్యను పూర్తి చేసి, పాల్‌డ్రిక్ ఆధ్వర్యంలో గణితంలో ట్రిపోస్ పూర్తి చేశాడు. ఈ సమయంలో అణు భౌతిక శాస్త్రం అతడిని ఆకర్షించింది. కాలక్రమేణ అపారమైన రేడియేషన్‌ను విడుదల చేసే కణాలపై ప్రయోగాలు చేయడం అతని అభిరుచిగా మారింది. పరిశోధనల దిశగా అడుగులు ఆ అణు సైద్ధాంతిక బౌతిక శాస్త్రంలో డాక్టరేట్ కోసం పరిశోధనలు చేయడంలో భాగంగా కావెండిష్ ప్రయోగశాలలో పనిచేశాడు. ఆ సమయంలో భాభా ప్రచురించిన "ది అబ్సార్ప్షన్ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్" అనే పరిశోధన పత్రానికి ఐజాక్ న్యూటన్ స్టూడెంట్ షిప్‌ని గెలుచుకున్నాడు. అందులో ఆయన విశ్వ కిరణాలలో శోషణ లక్షణాలు, ఎలక్ట్రాన్ షవర్ ఉత్పత్తి గురించి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా ఈ స్టూడెంట్‌షిప్‌ని ఆయనే గెలుచుకున్నారు. ఇక రాల్ఫ్ హెచ్ ఫౌలర్ ఆధ్వర్యంలో భాభా తన సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో డాక్టరల్ అధ్యయనాలను పూర్తి చేశారు. అంతేగాదు ఆయన ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని నిర్ణయించే మొదటి గణనను చేశాడు. ఆ తరువాత కాలంలో అతని సేవలకు గుర్తింపుగా ఎలక్ట్రాన్-పాసిట్రాన్ పరిక్షేపణను భాభా పరిక్షేపణ" (భాభా స్కాటరింగ్) పిలిచారు. అలాగే 1936లో కాస్మిక్ కిరణాలలో ఎలక్ట్రాన్, పాజిట్రాన్ షవర్ల ఉత్పత్తి సిద్ధాంతాన్ని రూపొందించాడు. దీనిని భాభా-హీట్లర్ సిద్ధాంతం అని పిలుస్తారు. ఇలా ఆయన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనే తన పరిశోధనలు కొనసాగించారు. భారత్‌కి రాక.. 1939 సెప్టెంబరు లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవ్వడంతో.. భాభా సెలవు తీసుకొని భారతదేశంలో కొద్ది కాలం ఉండటానికి వచ్చారు. అయితే ఆ యుద్ధం కారణంగానే ఆయన ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భాభా నోబెల్ బహుమతి గ్రహీత సి వి రామన్ నేతృత్వంలో బెంగళూరులో నడుస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా పనిచేశారు. అణు కార్యక్రమాల ఏర్పాటు.. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం అణు రంగంలో చాలా వెనుకబడి ఉంది. అందుకు సంబంధించిన ప్రయోగశాలు, కళాశాలలు లేకపోవడం బాధించింది. దీంతో ఆయన ప్రతిష్ఠాత్మక అణు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ముఖ్యంగా భారతదేశపు మొదటి ప్రధానిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించి విజయం సాధించారు. అందుకోసం అని కాస్మిక్ కిరణాల పరిశోధనా విభాగాన్ని కూడా అతను స్థాపించాడు. అతను పాయింట్ కణాల కదలిక సిద్ధాంతంపై పనిచేయడం ప్రారంభించాడు. స్వతంత్రంగా 1944లో అణ్వాయుధాలపై పరిశోధనలు చేశాడు. 1945లో అతను ముంబైలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ సంస్థలను స్థాపించాడు. ఆ తర్వాత నెహ్రు వాటికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా భాభాని నియమించారు. ఆయన ఆ సంస్థలో డైరెక్టర్‌గా, భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా విశేష సేవలందించారు. అలా ఆయన అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించాడు. అయితే అణు కార్యక్రమాలకు యురేనియం నిల్వలు కావాల్సి ఉంటుంది. కానీ భారత్‌లో ఆ నిల్వలు తక్కువ, అందుకని మనకు లభ్యమవుతున్న థోరియం నిల్వల నుంచే అణు శక్తిని వెలికి తీసే వ్యూహాంతో మూడు దశల్లో అణుకార్యక్రమానికి నాంది పలికారు. దీంతో అతను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు 1955 లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అణుశక్తి యొక్క శాంతియుత ఉపయోగాలపై ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించడమే గాక 1958లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యారు. వివాదంగా ఆయన మరణం.. 1966 జనవరి లో, అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిర్వహిస్తున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి ఆస్ట్రియాలోని వియన్నాకు వెళ్తుండగా మోంట్ బ్లాంక్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో భాభా మరణించారు. భారతదేశంలో అణు కార్యక్రమాన్ని స్తంభింపజేయాలనే దురుద్దేశంతో సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) భాభా విమాన ప్రమాదానికి కుట్ర చేసిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఐతే 2012లో విమానం కూలిన ప్రాంతం సమీపంలో క్యాలెండర్లు, వ్యక్తిగత లేఖకు సంబంధించిన భారతీయ దౌత్య సంచి తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గ్రెగోరి డగ్లోస్ అనే జర్నలిస్ట్ తాను ప్రచురించిన కాన్వర్సేషన్ విత్ ద క్రో" అనే పుస్తకంలో హోమిభాభాను హత్య చేయడానికి సిఐఎ కారణమని రాయడం గమనార్హం. ఆయనకు లభించిన అవార్డులు! ఆయన 1942లో ఆడమ్స్ ప్రైజ్. 1954 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 1951, 1953, 1956లలో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన మరణానంతరం ముంబైలోని అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్‌మెంటును భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌గా మార్చారు. అంతేగాదు అయన పేరు మీదుగా ముంబెలో డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెన్సు ఎడ్యుకేషన్ సెంటర్ తదితరాలను ఏర్పాటు చేసి అత్యున్నత గౌరవం ఇచ్చింది భారత ప్రభుత్వం. (చదవండి: '70 గంటలు పని'..నారాయణ మూర్తి వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!) -
ISRO@60: ఆకాశంతో పోటీ.. నాకెవ్వరు సాటి!
సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్షపరిశోధనా సంస్థ స్థాపించి 59 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. 1961లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిగా ఆవిర్భవించింది. ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతాన.. దేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాబాయ్, స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట దీవి కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించారు. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లతో 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలు, 13 స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు, మూడు గ్రహాంతర ప్రయోగాలు, రెండు ప్రయివేట్ ప్రయోగాలు చేశారు. ఆర్యభట్ట ఉపగ్రహంతోనే మొదటి అడుగు 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. ►శ్రీహరికోట రాకెట్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇన్1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ►1980 జూలై 18న ఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ►ఆ తరువాత జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఐదు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు ఉపయోగపడేలా జీఎస్ఎల్వీ మార్క్ –3 రాకెట్‌ను రూపొందించారు. ►ఆరు రకాల రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు అస్ట్రోశాట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్థం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు) గ్రహాంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–2) లాంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు. వాణిజ్యపరమైన అభివృద్ధి వైపు పయనం ►1992 మే 5న వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ సీ–02 రాకెట్ ద్వారా జర్మనీ దేశానికి చెందిన టబ్‌శాట్ అనే శాటిలైట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ►35 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు గుర్తింపు తెచ్చారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ అనే సంస్థలను ఏర్పాటు చేసి ప్రయివేట్‌గా ఉపగ్రహాలు, రాకెట్లను కూడా ప్రయోగించే స్థాయికి భారతీయ శాస్త్రవేత్తలు ఎదిగారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ వారి సహాయంతో ఇటీవలే ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ద్వారా వన్‌వెబ్ అనే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రయివేట్‌గా రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో పాటుగా గగన్‌యాన్–1, చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1 అనే చాలెంజింగ్ ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
తిరిగి దక్కించుకునేదెలా?
హోమీబాబా బంగ్లాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షి, ముంబై: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమీబాబా బంగ్లాను తిరిగి దక్కించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవలే వేలం వేసిన ఈ బంగ్లాను తిరిగి దక్కించుకొని, దానిని మ్యూజియంగా మార్చాలని యోచిస్తున్నాయి. అయితే వేలం వేసిన బంగ్లాను దక్కించుకునే విషయమై నిపుణుల నుంచి న్యాయసలహాలు తీసుకుంటున్నాయి. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు కూడా ఇరు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. హోమీబాబాకు చెందిన ‘మెహరంగీర్’ బంగ్లాకు హెరిటేజ్ హోదా కల్పించి దాన్ని మ్యూజియంగా మార్చాలని కోరుతూ వివిధ సేవాసంస్థలు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశాయి. అయితే కోర్టు నుంచి తీర్పు రాకముందే ‘నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ (ఎన్సీపీఏ) కొద్ది రోజుల కిందటే ఈ బంగ్లాను రూ.372 కోట్లకు వేలంలో విక్రయించింది. కాగా ఈ వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆటమిక్ ఎనర్జీ వర్కర్స్ అండ్ స్టాఫ్ యూనియన్ అధ్యక్షుడు ప్రశాంత్ వర్లీకర్, నేషనల్ ఫోరమ్ ఫర్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయిస్(న్యూక్లియర్ శాఖ) అధ్యక్షుడు రామ్‌ధురి కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎటువంటి తీర్పును ఇవ్వకముందే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చేందుకు కేంద్రం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకు సంబంధించిన లేఖను ప్రధాని కార్యాలయం, న్యాయశాఖకు పంపింది. వేలంలో విక్రయించిన బాబా బంగ్లాను దక్కించుకునేందుకు న్యాయపరమైన సలహాలు ఇవ్వాలని న్యాయశాఖను కోరింది. కాగా న్యాయశాఖ కూడా ఈ విషయమై అధ్యయనం చేస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బాబా బంగ్లాను వారసత్వ కట్టడంగా గుర్తించి, దాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యూక్లియర్ కమిషన్ డిమాండ్ చేసింది. ఈ కట్టడాన్ని మ్యూజియంగా మారిస్తే హోమీ బాబాకు మరింత గౌరవం కల్పించినట్లవుతుందని పేర్కొంది. మేధావుల అభ్యంతరం... హోమీబాబా బంగ్లాను మ్యూజియంగా మార్చాలనే డిమాండ్ వినిపించడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోమీబాబా నివసించినట్లుగా చెబుతున్న ‘మెహరంగీర్’ బంగ్లాను మ్యూజియంగా మార్చాలని కోరుతున్నవారికి చరిత్ర తెలియదని వాదిస్తున్నారు. నిజానికి మెహరంగీర్ బంగ్లాలో బాబా కొన్నిరోజులు మాత్రమే నివసించారని, ఆయన పెడ్డర్ రోడ్డులోని కెనిల్‌వర్త్‌లోనే ఎక్కువ రోజులు గడిపారని చెబుతున్నారు. -
కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
అణుశక్తి 1. ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్ ఎక్కడ ఉంది? ముంబై 2. భారత అణుశక్తి పితామహుడు? డా. హోమీ జహంగీర్ బాబా 3. కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? కర్ణాటక 4. ఒక రేడియో ధార్మిక కేంద్రకం నుంచి బీటా వికిరణం విడుదలవడం ద్వారా పరమాణు సంఖ్య ఎన్ని ప్రమాణాలు పెరుగుతుంది? ఒక ప్రమాణం 5. నరోర అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ర్టంలో ఉంది? ఉత్తరప్రదేశ్ 6. భారతదేశ మొదటి రియాక్టర్ నిర్మాణానికి సహకరించిన అమెరికా సంస్థ? జనరల్ ఎలక్ట్రిక్ 7. మొదటి దేశీయ రియాక్టర్ ఏది? రావటభట్ట అటామిక్ పవర్ స్టేషన్-2 8. మొదటి 540 MW సామర్థ్యమున్న దేశ అణు రియాక్టర్? తారాపూర్ అటామిక్ పవర్‌స్టేషన్&IV 9. కూడంకుళంలోని మొదటి రియాక్టర్ సామర్థ్యం? 1000 MW 10. మూడో దశ దేశ అణుశక్తి రియాక్టర్? అడ్వాన్సడ్ హెవీ వాటర్ రియాక్టర్ 11. గుజరాత్‌లోని ఏ ప్రాంతంలో కొత్త అణు రియాక్టర్‌ను నిర్మించదలిచారు? మితివర్ది 12. మూడో దశ రియాక్టర్లో ఇంధనం? థోరియ-యురేనియం-233 మిశ్రమం 13. 2022లో మొత్తం అన్ని అణురియాక్టర్లను మూసివేయాలని నిర్ణయించిన మొదటి దేశం? జర్మనీ 14. U-233 పై పనిచేసే పరిశోధన రియాక్టర్? కామిని, కల్పక్కం 15. రేడియోధార్మిక ఐసోటోపులను ఎగుమతి చేస్తున్న భారత అణుశక్తి విభాగ సంస్థ? బోర్డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ 16. ఏ కంపెనీ నుంచి దిగుమతి చేసుకున్న టోకమ్యాక్ను సాహా ఇన్స్టిట్యుట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వద్ద ఏర్పాటు చేశారు? తోషిబా (జపాన్) 17. రక్తంలో ఏర్పడిన అవరోధాన్ని తొలగించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు? సోడియం-24 18. బోర్డ ఫర్ రీసెర్చ ఇన్ న్యూక్లియర్ సెన్సైస్ ఎక్కడ ఉంది? ముంబై 19. అణు రియాక్టర్లలో వాడే నియంత్రణ కడ్డీలు? బోరాన్ స్టీల్, కాడ్మియం కడ్డీలు 20. తొలిసారిగా భారత్ అణు పరీక్షలను ఎప్పుడు నిర్వహించింది? 1974 21. హిరోషిమాపై అమెరికా అణుబాంబును ఎప్పుడు వేసింది? ఆగస్టు 6, 1945 22. నత్రజనిపై ఆల్ఫా వికిరణాన్ని తాడనం చేయడం ద్వారా ఆది ఏ కేంద్రకంగా మారుతుంది? ఆక్సిజన్ 23. తొలిసారిగా హోమీ జహంగీర్ బాబా ఏ కేంద్రం వద్ద అణుపరీశోధనలను నిర్వహించాడు? టీఐఎఫ్ఆర్ (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ) 24. మొదటి దశ రియాక్టర్లో లభించే దేన్ని యురేనియంతో కలిపి రెండో దశ రియాక్టర్ ఇంధనంగా వినియోగిస్తారు? ఫ్లుటోనియం 25. హరీష్ చంద్ర రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? అలహాబాద్ 26. టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది? కోల్‌కతా 27. జైతాపూర్ వద్ద ఏర్పాటు చేయదల్చిన రియాక్టర్? ఎవల్యూషనరీ పవర్ రియాక్టర్ 28. 2020 నాటికి అణుశక్తి ఉత్పాదన లక్ష్యం? 20,000 MW 29. అణు రియాక్టర్లలో కూలెంట్‌గా వాడేది? సాధారణ జలం, భారజలం 30. సెరామిక్స్, వైట్ పిగ్మెంట్ను ఉత్పత్తి చేసే అణుశక్తి విభాగ కేంద్రం? ఇండియా రేర్ ఎర్‌త్స లిమిటెడ్