అవసరమైతే ఏకపక్షంగా చూసుకుంటాం: ట్రంప్
ఉత్తర కొరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగే ఇచ్చారు. అవసరమైతే ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను నిరోధించడానికి ఏకపక్షంగానే చూసుకుంటామని తెలిపారు. ఉత్తరకొరియా పరిస్థితిని మార్చడంలో చైనా విఫలమైతే తాము రంగప్రవేశం చేస్తామన్నారు. ఉత్తర కొరియా విషయంలో తమకు చైనా సాయం చేయాలనుకుంటోందో లేదో ఆ దేశం నిర్ణయించుకుని చెప్పాలని ఓ అమెరికన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. వాళ్లంతట వాళ్లు ముందుకొచ్చి కొరియాను నియంత్రిస్తే అది చైనాకే మంచిదని, అలా చేయకపోతే ఎవరికీ మంచిది కాదని అన్నారు.
ఉత్తరకొరియా అణ్వస్త్ర కార్యక్రమం గురించి ట్రంప్ ప్రభుత్వం ముందునుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తర కొరియా అణ్వస్త్ర వ్యాప్తికి ప్రధాన బాధ్యత చైనాదేనని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. చైనా నుంచి అందిన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉత్తర కొరియా చెలరేగిపోతోందని ఆయన ఇంతకుముందు వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్స గత నెలలో చైనాకు వెళ్లొచ్చారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావిస్తారని తెలుస్తోంది.