అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)
ప్యాంగ్‌యాంగ్: అమెరికా విధానాలు తమకు హాని చేసేవిగా ఉన్న కారణంగా ఆ దేశంతో స్నేహం కొనసాగించడంపై ఉత్తర కొరియా పునరాలోచన చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. ఉత్తర కొరియా ప్రజలకు వాషింగ్టన్‌తో దీర్ఘకాలిక ముప్పు పొంచి ఉన్నందున.. వారికి దీటుగా బదులిచ్చేందుకు తమ సైనిక వ్యవస్థను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు విదేశాంగ మంత్రి రీ సర్ గ్వాన్ ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించింది. పరస్పర విమర్శలు, సవాళ్లు, అనేక పరిణామాల అనంతరం 2018, జూన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోన్ ఉంగ్‌ల మధ్య సింగపూర్‌లో చారిత్రాత్మక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ‘కొరియా ద్వీపకల్పంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంతోపాటు అణునిరాయుధీకరణకోసం ఇరుదేశాలు శత్రుత్వం నుంచి బయటకు వచ్చి పరస్పర అవగాహనతో ముందుకెళ్లాలి’ అని కిమ్ పేర్కొన్నారు. (అమెరికాపై డ్రాగన్ ఫైర్.. తైవాన్ కౌంటర్!)
అదే విధంగా ట్రంప్ సైతం.. ‘‘అణ్వాయుధాలను త్యజించిన తర్వాత ఉత్తరకొరియా సాధించే ప్రగతికి పరిమితుల్లేవని.. ప్రపంచంతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకున్న తర్వాత పురోగతి పరుగులు పెడుతుంది. కిమ్ ముందడుగుతో ప్రపంచం ఓ భారీ అణువిపత్తు నుంచి ఓ అడుగు వెనక్కు వేసింది’’ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఉత్తర కొరియా అధికార మీడియా శుక్రవారం ఓ కథనం ప్రచురించింది. ‘‘ట్రంప్ పాలనా యంత్రాంగం రాజకీయ పాయింట్లు స్కోర్ చేయడంపై మాత్రమే దృష్టి సారించింది. అణ్వాయుధ దాడులు, పాలనా మార్పు పేరిట ఉత్తర కొరియాను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వాగ్గాదానాలకు కట్టుబడకుండా ఉండటం కంటే నయవంచన ఇంకేమీ ఉండదు. విజయాలు సాధించేందుకు అమెరికా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు మరో ప్యాకేజీ అందించలేం’’ అని రీ సన్ అమెరికా తీరును విమర్శించినట్లు పేర్కొంది. కాగా అమెరికా విదేశాంగ శాఖ, శ్వేతసౌధ వర్గాలు ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు.(ఇక చాలు.. అన్నీ బంద్: ఉత్తర కొరియా)
ఎన్నికలు సాఫీగా జరగాలా? వద్దా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సాఫీగా జరగాలంటే అగ్రరాజ్యం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఉత్తరకొరియా గురువారం హెచ్చరించింది. ఇక ఈ విషయంపై స్పందించిన అమెరికా దౌత్యవేత్త.. ట్రంప్‌తో భేటీ ఉత్తర కొరియా పలుకుబడిని పెంచిందని.. అయితే వాళ్లు మాత్రం అధ్యక్ష ఎన్నికల ముందు ఆయనపై ఒత్తిడి పెంచి.. మరోసారి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారని విమర్శించారు. రీ సన్ వ్యాఖ్యలను బట్టి అణ్వాయుధాల విషయంలో ఉత్తర కొరియా వద్ద మరో ప్లాన్ ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు రామన్ పచెకో పార్దో అభిప్రాయపడ్డారు.(కిమ్ సోదరి హెచ్చరిక.. తలొగ్గిన దక్షిణ కొరియా!)
Comments
Please login to add a commentAdd a comment