వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం అమెరికాను ఆందోళన పరుస్తోంది. కొన్ని నెల్లలోనే అమెరికాపై దాడి చేయగల అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం ఉత్తర కొరియా సొంతంకాబోతుండటంతో తీవ్ర కలవరం రేపుతోందని ఆ దేశ కేంద్ర నిఘా ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ మైక్ పాంపియో తెలిపారు. సీఏఐ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజాగా బీబీసీతో మాట్లాడారు.
ఉ. కొరియా నుంచి, ముఖ్యంగా కిమ్ జాంగ్ ఉన్ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి తాము నిరంతరం చర్చిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. కొన్ని నెలల్లోనే అమెరికాను ఢీకొట్టే అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం కొరియా సొంతం కాబోతున్న అంశంపై ప్రధానంగా తమ మంతనాలు సాగుతున్నాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించే కర్తవ్యం తమపై ఉందని, దౌత్యేతర మార్గాల్లో ఈ ప్రత్యామాయాలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఉత్తర కొరియాపై బలప్రయోగం వల్ల ఈ ప్రాంతంలో పెద్దస్థాయిలో ప్రాణనష్టం జరిగే అవకాశముందన్న విషయాన్ని తాము గుర్తించామని చెప్పారు. ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రపక్షాలైన దక్షిణ కొరియా, జపాన్ ఉండటంతో బలప్రయోగంతో ఇక్కడ తలెత్తబోయే పరిణామాలను తమ దృష్టిలో ఉన్నాయని, కిమ్‌ను తొలగించడం లేదా అమెరికాపై దాడి చేయగల అణ్వాయుధ సామర్థ్యాన్ని పరిమితం చేయడం వంటివాటిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే.. ఉ.కొరియా అధినేత కిమ్‌తో మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. తన అణ్వాయుధ ఆశయాలను కిమ్ పరిమితం చేసుకోకపోతే పెను పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment