పశ్చిమాసియాలో శాంతి వీచిక! | Iranian nuclear deal : brace yourself for a Middle Eastern arms race, America | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో శాంతి వీచిక!

Published Tue, Nov 26 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

Iranian nuclear deal : brace yourself for a Middle Eastern arms race, America

సంపాదకీయం: రెండోసారి గద్దెనెక్కాక అపశ్రుతులు వినడమే అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తొలిసారి ఇది తీపి కబురు. తన అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలకు తలొగ్గే ఒప్పందంపై ఇరాన్ ఆదివారం సంతకం చేసింది. అమెరికా, మరో అయిదు దేశాలకూ... ఇరాన్‌కూ మధ్య జెనివాలో సంతకాలయ్యాయి. మూడున్నర దశాబ్దాలుగా పరస్పరం కత్తులు నూరుకుంటూ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న అమెరికా, ఇరాన్‌లు ఒక ఒప్పందంలో భాగస్వాములు కావడం ఇదే తొలిసారి. అమెరికాకూ, ఇరాన్‌కూ మధ్య మూడునెలలుగా సాగుతున్న చర్చలు ఈ ఒప్పందాన్ని సాకారం చేశాయి.
 
 దశాబ్దాలుగా అమెరికా విధిస్తూ వచ్చిన కఠినమైన ఆంక్షలనుంచి కాస్తయినా వెసులుబాటు లభించేందుకు ఈ ఒప్పందంతో ఇరాన్‌కు అవకాశం ఏర్పడింది. రెండేళ్లక్రితం ఇరాన్ యురేనియం శుద్ధిని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాక పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్, ఇతర పాశ్చాత్య దేశాలు కత్తులు నూరాయి. దారికి రాకపోతే దాడులు తప్పవని హెచ్చరించాయి. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించిందేనని ఇరాన్ చెప్పిన మాటలను ఆ దేశాలు విశ్వసించలేదు. ఒక దశలో యుద్ధం అనివార్యం కావొచ్చన్న స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆరుదేశాలకూ, ఇరాన్‌కూ కుదిరిన ఈ ఒప్పందం ఒక రకంగా ఉద్రిక్తతలను ఉపశమింపజేస్తుంది.
 
 వాస్తవానికి ఇరాన్ అణు కార్యక్రమం రహస్యమైనదేమీ కాదు. 1967లో టెహ్రాన్ లో అణు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సాయపడింది అమెరికాయే. అమెరికాకు ప్రీతిపాత్రుడైన ఇరాన్ షాను అక్కడి విద్యార్థి విప్లవం 1979లో పదవీచ్యుతుణ్ణి చేసే వరకూ రెండు దేశాలమధ్యా సన్నిహిత సంబంధాలుండేవి. అటు తర్వాత ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు మొదలయ్యాయి. ఏ అంతర్జాతీయ సంస్థనుంచీ ఇరాన్‌కు అప్పుపుట్టకుండా చేయడం, తమ దేశంలో ఇరాన్‌కు ఉన్న వేల కోట్ల డాలర్ల బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర ఆస్తుల్ని స్తంభింపజేయడం వంటి చర్యలకు అమెరికా పూనుకుంది. అది ఉత్పత్తి చేస్తున్న చమురును ఏ దేశమూ కొనకూడదన్న ఒత్తిళ్లూ ఎక్కువయ్యాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సైతం ఇరాన్ అణు కార్యక్రమానికి పూనుకున్నది. అయితే, ఈ అణు కార్యక్రమంపై చర్చలకు తాను సిద్ధమేనని ఇరాన్ ఆదినుంచీ చెబుతూనే వచ్చింది. ఈ చర్చలు పశ్చిమాసియాలో పూర్తి అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలన్నది ఇరాన్ వాదన. ఇరాన్‌కు పొరుగున ఉన్న ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే అణ్వస్త్రాలున్నందువల్ల ఈ ప్రతిపాదనకు అమెరికా అంగీకరించలేదు.  ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేయాలన్న అమెరికా, పాశ్చాత్య దేశాలు ఒక మెట్టు దిగొచ్చాయి. యురేనియం శుద్ధిని 5 శాతానికి మించనీయొద్దని ఈ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇప్పటికే నిల్వ ఉన్న శుద్ధిచేసిన యురేనియంను పలచన చేయాలని లేదా ఆక్సైడ్‌గా మార్చాలని ఒప్పందం సూచించింది.
 
 ఇరాన్ వద్దనున్న సెంట్రిఫ్యూజుల సంఖ్యను పెంచకూడదని కూడా స్పష్టం చేసింది. ఇరాన్ కూడా తన వంతుగా ఒక మెట్టు దిగింది. మొత్తంగా అణ్వస్త్ర నిషేధానికి దారితీసేవిధంగా చర్చలుండాలన్న తన షరతును సడలించుకుంది. ఒప్పందం పర్యవసానంగా ఇకపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ జరిపే తనిఖీలకు ఇరాన్ సహకరించాల్సి ఉంటుంది.  దశాబ్దకాలం నుంచి కొనసాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమానికి ఈ ఒప్పందం ద్వారా తొలిసారి అడ్డుకట్ట వేయగలిగామని అమెరికా సంతృప్తిపడుతుండగా, స్తంభింపజేసిన ఖాతాల్లోని 400 కోట్ల డాలర్ల చమురు అమ్మకాల సొమ్ము తన చేతికొస్తుందని... బంగారం, పెట్రోకెమికల్స్, కార్లు, విమానాల విడిభాగాలపై ఉన్న ఆంక్షలు సడలుతాయని ఇరాన్ ఊపిరిపీల్చుకుంటున్నది.
 
 అయితే, ఈ ఒప్పందం సిమెంటు రోడ్డుమీది ప్రయాణంలా సాఫీగా సాగి పోతుందని చెప్పడానికి వీల్లేదు. పాశ్చాత్య ప్రపంచంతో ఎలాంటి రాజీకైనా ససేమిరా అంగీకరించని ఛాందసవాదుల ప్రాబల్యం ఇరాన్‌లో బలంగానే ఉంది. అలాగే, ఇరాన్ పై బలప్రయోగం చేసి పాదాక్రాంతం చేసుకోవాలి తప్ప, ఆ దేశంతో చర్చలేమిటని ప్రశ్నించే ఇజ్రాయెల్ అమెరికా మిత్రదేశంగా ఉంది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు వెలువడిన వెంటనే ‘ఇది చరిత్రాత్మక ఒప్పందం కాదు... చరిత్రాత్మక తప్పిదం’ అంటూ బుసలుకొట్టింది. ఇకనుంచి ఈ ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారబోతున్నదని ఆందోళనవ్యక్తం చేసింది. పశ్చిమాసియాలోని సౌదీ అరేబియా వంటి ఇరాన్ శత్రుదేశాలు ఇజ్రాయెల్ అభిప్రాయంతో గొంతు కలిపాయి. ఇలాంటి ప్రమాదాలున్నాయి గనుకే రానున్న ఆరునెలలూ కీలకమైనవి. ఇప్పుడు కుదిరిన జెనీవా ఒప్పందం తాత్కాలికమైనదే. దీని ప్రాతిపదికన రానున్న ఆరునెలల కాలంలో మరిన్ని చర్చలు కొనసాగి సమగ్రమైన, శాశ్వత ఒప్పందం సాకారం కావాల్సి ఉంది. అది జరిగాకే ఇరాన్‌పై ఇప్పుడున్న ఆంక్షలన్నీ పూర్తిగా తొలగే అవకాశం ఉంది. ఈ ఒప్పందం పర్యవసానంగా లాభపడే దేశాల్లో మన దేశమూ ఉంటుంది. ఇరాన్ నుంచి నేరుగా చమురును చేరేసే ఇరాన్-పాకిస్థాన్- ఇండియా (ఐపీఐ) పైప్‌లైన్ ప్రాజెక్టు నుంచి మన దేశం మధ్యలోనే వైదొలగింది.
 
 ఇందుకు భద్రతాపరమైన కారణాలను చూపింది. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా ఆ ప్రాజెక్టులో మళ్లీ చేరే అవకాశం ఉంది. అలాగే మన దేశంనుంచి ఎగుమతులు కూడా భారీగా పెరుగుతాయి. అయితే, దశాబ్దాలుగా పరస్పర అవిశ్వాసంతో, శత్రుత్వంతో రగిలిపోతున్న దేశాల మధ్య సంపూర్ణ సదవగాహన ఏర్పడటం అంత సులభం కాదు. అందుకు చాలా సమయం పట్టవచ్చు. అది సాకారం కావడానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధితో వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా పశ్చిమాసియాలో ఇన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానా లను సవరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెదిరింపుల ద్వారా ఏమైనా సాధించగలమన్న అభిప్రాయాన్ని అది మార్చుకోవాలి. అందుకు అది ఏమేరకు సిద్ధపడుతుందన్నదాన్నిబట్టి ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలు ఏర్పడతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement