హైడ్రోజన్ బాంబేస్తే మన్‌హట్టన్ బూడిదే!
ప్యాంగ్‌యాంగ్: తాము తయారు చేసిన హైడ్రోజన్ బాంబు మాజీ సోవియట్ యూనియన్ తయారు చేసిన బాంబుకన్నా శక్తివంతమైనదని, దీన్ని ఖండాంతర క్షిపణి ద్వారా ప్రయోగించినట్లయితే అమెరికా న్యూయార్క్ సిటీలోని మన్‌హట్టన్‌ను బూడిద చేయగలదని, మనుషులెవరూ మిగలరని ఉత్తర కొరియా పరోక్షంగా అమెరికాను హెచ్చరించింది. అమెరికాను తాకే శక్తివంతమైన ఖండాంతర క్షిపణులు తమవద్ద ఉన్నాయని పేర్కొంది. నాలుగవ అణు పరీక్ష నిర్వహించిన రెండు నెలలకే ఉత్తర కొరియా ఇలాంటి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.
మానవత్వాన్ని మంటగలుపుతున్న ఉత్తర కొరియా నియంత కిమ్‌జాంగ్ ఉన్, ఆయన సీనియర్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఇన్వెస్టిగేటర్ మార్జుకి దర్సుమేన్ సమతి మానవ హక్కుల సమావేశంలో పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఇలాంటి హెచ్చరిక వెలువడింది. ఈ సమావేశాన్ని ‘డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ బహిష్కరించింది. అమెరికా, ఐరోపా యూనియన్ మద్దతిచ్చింది. ఉత్తర కొరియాకు సన్నిహితంగా ఉండే చైనా మాత్రం మానవ హక్కులను రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించింది.