Wastewater
-
ఫ్యుకుషిమా నుంచి అణు జలాల విడుదల
ఒకుమా: జపాన్ను 12 ఏళ్ల క్రితం కుదిపేసిన పెను భూకంపం, సునామీతో దెబ్బ తిన్న ఫ్యుకుషిమా అణు ప్లాంట్ నుంచి వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. ఇరుగు పొరుగు దేశాల నిరసనల మధ్య గురువారం నాడు తొలి విడతగా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మొదలు పెట్టినట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) ప్రకటించింది. వివిధ దశల్లో శుద్ధి చేసిన జలాలు అణు ప్లాంట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విడుదల ప్రారంభానికి సంబంధించిన వీడియో కవరేజ్‌ను జపాన్ మీడియా లైవ్‌లో చూపింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నీటి విడుదల కార్యక్రమం మొదలైనట్టుగా అణుప్లాంట్ ఆపరేటర్ చెప్పారు. ఈ అణు జలాల విడుదలపై సొంత దేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. నీటి విడుదలతో సముద్ర జలాలు విషతుల్యంగా మారి మత్స్య సంపదకు అపార నష్టం చేకూరుతుందని జపాన్, చైనా, దక్షిణకొరియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణం, మనుషుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందని జపాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అయితే జపాన్ ప్రభుత్వం తన చర్యను సమర్థించుకుంది. అణు ప్లాంట్‌ను మూసేయాలంటే జలాలు విడుదల చేయక తప్పదని స్పష్టం చేసింది. 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు వెయ్యి ట్యాంకుల్లో భద్రపరిచామని, ఆ ట్యాంకులకు ప్రమాదమేదైనా జరిగితే మరింత ముప్పు వాటిల్లుతుందని టెప్కో పేర్కొంది. అణు జలాలను శుద్ధి చేసి అవి సురక్షితమని తేలాక విడుదల చేస్తున్నట్టు సెంటర్ ఫర్ రేడియేషన్ రీసెర్చ్ డైరెక్టర్ టోనీ హూకర్ చెప్పారు. జపాన్ సీఫుడ్‌పై నిషేధం: చైనా జపాన్‌ది పూర్తిగా స్వార్థపూరిత, బాధ్యతారహిత చర్య అని చైనా మండిపడింది. జపాన్ నుంచి సీఫుడ్‌పై నిషేధం విధించింది. జపాన్ చేస్తున్న పనితో సముద్రంలో మత్స్య సంపదకి, వాతావరణానికి ఎంత ముప్పు ఉంటుందో ఎవరూ అంచనా వేయలేరని ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. జపాన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటూ వివిధ దేశాలు జలాల విడుదలను ఖండిస్తున్నాయి. -
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
ఆక్వా చెరువుల్లోకి ఓఎన్జీసీ వ్యర్థాలు
ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలోని జీఎంఏఏ ఓఎన్జీసీ సైట్ నుంచి వెలువడిన వ్యర్థ జలాలు పంట కాలువలో చేరి ఆక్వా, చేపల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ సైట్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గోపవరం గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్)గా వ్యవహరించే ఈ సైట్లో ముడిచమురుతో వచ్చే వ్యర్థ జలాలను సెపరేటర్ల ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలిస్తారు. రెండు మూడు రోజులుగా వ్యర్థ జలాలు పంట కాలువలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి లీకేజీ ఎక్కువ కావడంతో కాలువ నిండా వ్యర్థ జలాలు చేరాయి. ఈ విషయం తెలియని ఆక్వా రైతులు కాలువలోని నీటిని చెరువుల్లోకి తోడారు. సుమారు 3 వందల ఎకరాల ఆయకట్టున్న ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాలకు ఇంజన్లతో ఆ నీటిని తోడారు. దీంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలగా రొయ్యలు మృత్యువాత పడి అడుగు భాగానికి చేరినట్లు గుర్తించారు. దీంతో రైతులు అల్లూరి రమేష్‌రాజు, సామంతకూరి జగన్రాజు తదితరులు స్థానిక నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో జగ్గరాజుపేటలో ధర్నాకు దిగారు. ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఆమేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చల్లపల్లి సర్పంచ్ ఇసుకపట్ల జయమణి ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందించారు. ఓఎన్జీసీ ఇన్స్టలేషన్ మేనేజర్ (ఐఎం) పి.జగన్నాథరావు అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. సాంకేతిక బృందం నివేదిక మేరకు పరిహారం అందజేస్తామని చెప్పారు. -
మురికి ఇటుకలు...
మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం ఈ కాలంలో సహజమే. పర్యావరణానికి మంచిది కూడా. అయితే ఒక చిక్కుంది. నీళ్లన్నీ శుద్ధి అయిపోయిన తరువాత మిగిలిపోయే మడ్డి వృథాగా మిగిలిపోతూంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం కనుక్కున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ మడ్డిని భవన నిర్మాణానికి ఉపయోగపడే ఇటుకలుగా మార్చడంలో వీరు విజయం సాధించారు. ఇటుకలు మొత్తం ఈ మడ్డితో తయారు కాలేదుగానీ.. నాలుగోవంతును వాడటం ద్వారా అనేక ప్రయోజనాలు సాధించవచ్చునని అంటున్నారు ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అబ్బాస్ మొహర్జానీ. మడ్డి వాడినప్పటికీ ఈ ఇటుకలు దుర్వాసన ఏమాత్రం వెలువరించవు. అదే సమయంలో తయారీ సమయంలో సగం ఇంధనాన్ని మాత్రమే వాడుకుంటుంది. అంతేకాకుండా.. మడ్డిలోని భారలోహాలు కూడా ఇటుకల్లోకి చేరిపోవడం వల్ల పర్యావరణ సమస్యలను తగ్గించవచ్చునని వివరించారు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త రకం ఇటుకలను మరింత విస్తృతంగా పరిశీలించాల్సి ఉందని ఆ తరువాత మాత్రమే భవన నిర్మాణానికి వాడుకోవచ్చునని వివరించారు. -
మురుగు శుద్ధితో భూతాపోన్నతికి చెక్!
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్‌డయాక్సైడ్‌ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు. -
‘సాగు’తున్న మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు
సాక్షి, మచిలీపట్నంటౌన్: పట్టణంలోని 42వ వార్డు గుమస్తాల కాలనీ సమీపాన చేపట్టిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయనే వాదలను వినవస్తున్నాయి. ఈ పనులు ప్రారంభానికి గత మే నెల 21వ తేదీన ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకు పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ ఈ పనులను వేగవంతంగా కాకుండా నత్త నడకన చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. శంకుస్థాపన జరిగి ఆరు నెలలు గడిచినా ఇంకా గ్రౌండ్ పనులే జరుగుతున్నాయే తప్ప పూర్తి స్థాయి పనులు చేపట్ట లేదంటున్నారు. పట్టణంలోని ఈడేపల్లి మేజర్ డ్రెయిన్ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసేందుకు గాను ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ పథకం ఫేజ్–2 నుంచి విడుదలైన రూ. 16.76 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ఆరు నెలలుగా ఈ పనులు ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయే తప్ప పూర్తి స్థాయికి చేరుకోలేదని అంటున్నారు. కొద్ది నెలలుగా పనులను ఆపేసి ఇటీవలే పనులు ప్రారంభించారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై సంబంధిత పబ్లిక్‌హెల్త్ అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోందనే చెబుతున్నారు. నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది, కార్మికులు వారి ఇష్టానుసారంగాపనులు చేస్తున్నారంటున్నారు. నాణ్య తపై అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. ఇప్పటిౖనా పాలకులు, అధికారులు దృష్టి సారించి మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ పనులు వేగవంతంగా, నాణ్యతగా నిర్మించేలా చూడాల్సి ఉంది. -
మంచినీటికి బదులు మురుగు నీరు
నగరంలోని పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం మంచినీటికి బదులు మురుగు నీరు సరఫరా జరిగింది. సీతారాంబాగ్, మల్లేపల్లి, బోయిగూడ కమాన్, మంగళహాట్, ఆగాపురా, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఈరోజు మురుగునీరు సరఫరా అయింది. ఈ నీటిని తోడుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా వాటర్ వర్క్స్ అధికారులు ఇలాంటి నీటినే సరఫరా చేస్తుండటంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘గాలి నీటి’తో పంటల సాగు!
నేల, నీరు కాలకూట విషమైపోయినప్పుడు ఆరోగ్యదాయకమైన ఆహారం పండించేదెలా? పెరూ దేశంలోని బుజమ ప్రాంత రైతులను, వినియోగదారులకు ఎదురైన పెద్ద సవాలు ఇది. ఈ జటిల సమస్యకు అక్కడి యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (యూటెక్) విద్యార్థులు చక్కని పరిష్కారం కనుగొన్నారు. గనుల వ్యర్థజలాలు కలవడంతో రిమక్ నదిలో నీరు భార ఖనిజాలతో విషతుల్యమైపోయాయి. ఆ నీటితో సాగయ్యే ఆహారం తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో యూటెక్ విద్యార్థులు శుద్ధమైన నీటిని వాతావరణం నుంచే ఒడిసిపట్టే ప్రక్రియను దేశీయ పరిజ్ఞానంతోనే కనుగొన్నారు. అక్కడ వీచే గాలిలో 98% తేమ ఉంటుంది. ఆ తేమను శుద్ధమైన నీరుగా మార్చే డీహ్యుమిడిఫయర్లను రూపొందించారు. యూనివర్సిటీ వద్ద ఎత్తయిన బిల్ బోర్డును నిర్మించి.. అందులో డీహ్యుమిడిఫయర్లను అమర్చారు. అది ఒడిసిపట్టే శుద్ధమైన నీటిని తాగు నీటిగా వాడటంతోపాటు.. ఆ నీటితో విజయవంతంగా ఆకుకూరలు పండించారు. హైడ్రోపోనిక్ పద్ధతిలో ద్రవరూప పోషకాలతో సలాడ్స్‌లో వాడే లెట్యూస్ మొక్కలు పెంచారు. పొడవాటి 48 పీవీసీ పైపులను తీసుకొని, ఒక్కోదానికి 51 బెజ్జాలు పెట్టి.. వాటిలో తడవకు 2,448 లెట్యూస్ మొక్కలను పెంచి అటుగా వెళ్లే వారికి ఉచితంగా పంచారు. కష్టకాలంలో ఇలా కూడా ఆరోగ్యదాయకమైన పంటలు పండించే వీలుందని వారికి పచ్చని మొక్కలందిస్తూ తెలియ చెప్తున్నారు. అన్నట్టు.. శుద్ధమైన నీటిని ఒడిసిపట్టే మొట్టమొదటి బిల్‌బోర్డు ఇదేనట. విద్యార్థులు చూపిన పచ్చని బాట బాగుంది కదూ..! -
తక్కువ నీరు.. ఎక్కువ సేద్యం
పరిగి రూరల్: బిందుసేద్యంతో నీటి వృథాను అరికట్టడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసిరెడ్డిపల్లిలో కావలి మల్లేష్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకే గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారన్నారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందిస్తూ వ్యవసాయం చేయడం వల్ల నీరు వృథా అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్రిప్ కావాల్సిన రైతులు ఆల్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తున్న రైతులు మూడు నెలలకోసారైనా డ్రిప్ పైపుల్లో పట్టిన నాచును తొలగించేందుకు యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. అనంతరం యాసిడ్ ట్రీట్మెంట్ చేసే విధానం గురించి రైతులకు అర్థమయ్యేలా చేసి చూపించారు. అవగాహన సదస్సులో మైక్రో ఇరిగేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బిచ్చయ్య, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు మధుప్రసాద్, జీవన్‌రెడ్డి, ఏరియా ఆఫీసర్ రాంరెడ్డి విజయ్, రాజనర్సింహులు, బాగన్న, శ్రీశైలం, జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, వినాయకరెడ్డి, నర్సింహులు,వెంకటయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. -
నాలాలు... నల్లతాచులు
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి మనుషులపైకి మృత్యువును ఉసిగొల్పుతున్నాయి. నిన్న సత్యవేణి.. రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లో ఒకరు... కొంతకాలం క్రితం అంబర్‌పేటలో బ్యాంకు ఉద్యోగిని.. ఇలా వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలసిపోతున్నాయి. నాలాలపైనే అంతస్తులకు అం తస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు నేర్పిన అనుభవంతో నాలాలను ఆధునీకరించాలనుకున్నారు. రూ.264 కోట్లతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏటా ఆ అంచనాలు పెరుగుతూ వచ్చాయి తప్పితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. నాలాల కబ్జాలు ఆగలేదు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. రూ.10వేల కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే ఓ గర్భిణి నాలాలో పడి మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే వీటిని ఆధునికీకరించాలని...ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వానిదే బాధ్యత బన్సీలాల్‌పేట్: ‘సత్యవాణి మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఆమె కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, ఆదుకోవాలి. అధికారులు వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహించొద్దు. నగరంలోని నాలాలను మూసివేయండ’ంటూ గాంధీ ఆస్పత్రి మార్చురీ ఎదుట సత్యవాణి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి నాలాలో పడి మృతిచెందిన సత్యవాణి(25) మృతదేహానికి గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సత్యవాణి భర్త ప్రేమ్‌రాజ్, తల్లిదండ్రులు లక్ష్మి, భాస్కర్, బంధువులు, సీపీఎం, సీఐటీయూ నాయకులతో కలిసి గాంధీ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు వచ్చే వరకు పోస్టుమార్టం నిర్వహించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మార్చురీ వద్ద మోహరించారు. గోపాలపురం పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సీపీఎం నాయకులు కేఎన్ రాజన్న, సీఐటీయూ నాయకులు కిష్టప్ప, మల్లేష్, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. రూ.3.5 లక్షలు పరిహారం సత్యవాణి కుటుంబానికి రూ.3.5 లక్షలు పరిహారాన్ని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాంశర్శ గాంధీ మార్చురీకి వచ్చి బాధితులను పరామర్శించారు. రెవెన్యూ విభాగం తరఫున ప్రకృతి వైపరీత్యాల రిలీఫ్ ఫండ్ కింద రూ.1.50 లక్షలతో పాటు ఓ ఇల్లు కేటాయిస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఉత్తర మండలం ఇన్చార్జ్ జోనల్ కమిషనర్ హరికృష్ణ వెల్లడించారు. జీహెచ్ఎంసీ క మిషనర్, మేయర్లతో మాట్లాడిన అనంతరం బాధితుల తరఫున వచ్చిన ప్రతినిధి బృందానికి ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజ్ మాట్లాడుతూ సత్యవాణి మృతి దురదృష్టకరమని పేర్కొన్నారు. నాలా సమస్యలపై టీడీపీ ధర్నా సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలా సమస్యలపై టీడీపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీలో గురువారం ధర్నా నిర్వహించారు. గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందు ఈ ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాలాల్లో వ్యర్థాలను తొలగించాలని, వాటిని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా తాము విజ్ఞప్తులు చేస్తున్నా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. గత ఆరునెలలుగా పన్ను వసూలుపై చూపిన శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపలేదని విమర్శించారు. మేయర్, కమిషనర్ల నిర్లక్ష్యం వల్ల గర్భవతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు హేమలత యాదవ్, భానుప్రసాద్, వెంకట సామ్రాజ్యం, మాధవరపు రంగారావు, బాబూరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.