
పట్టణం, నగరం... ఏదైనా మురుగునీటి కాల్వలు సర్వసాధారణం కదా. దుర్గంధం వెదజల్లుతూ పలురకాల వ్యాధులకు కారణమవుతున్న మురుగు నీటితో ఈ భూమికి మేలు చేయవచ్చునని అంటున్నారు ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. భూతాపోన్నతికి కారణమవుతున్న కార్బన్‌డయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులను ఒడిసిపట్టేందుకు మురుగుకాల్వలు మేలైన మార్గమని వీరు సూచిస్తున్నారు. ఈ అంశంపై తాము ఇటీవల విస్తృత అధ్యయనం నిర్వహించామని, భూతాపోన్నతికి చెక్ పెట్టేందుకు మురుగునీటి కాల్వలు ఉపయోగపడతాయని తేలినట్లు జేసన్ రెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు నీళ్లు ఉపయోగపడతాయని ఇప్పటివరకూ ఎవరూ ఆలోచించలేదని, మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ద్వారా మిథేన్ ఉత్పత్తితోపాటు అనేక ఇతర విలువైన ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని జేసన్ అంటున్నారు. వాతావరణం నుంచి సేకరించిన కార్బన్‌డయాక్సైడ్‌ను పంపడం ద్వారా జరిగే మురుగునీటి శుద్ధీకరణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. మురుగునీటి ద్వారా విలువైన మిథేన్, కార్బనేట్ ఖనిజాలు, ఎరువులను తయారు చేసేందుకు ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని జేసన్ గుర్తు చేశారు.