నాలాలు... నల్లతాచులు
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి.
నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి మనుషులపైకి మృత్యువును ఉసిగొల్పుతున్నాయి. నిన్న సత్యవేణి.. రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లో ఒకరు... కొంతకాలం క్రితం అంబర్‌పేటలో బ్యాంకు ఉద్యోగిని.. ఇలా వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలసిపోతున్నాయి. నాలాలపైనే అంతస్తులకు అం తస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు నేర్పిన అనుభవంతో నాలాలను ఆధునీకరించాలనుకున్నారు. రూ.264 కోట్లతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఏటా ఆ అంచనాలు పెరుగుతూ వచ్చాయి తప్పితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. నాలాల కబ్జాలు ఆగలేదు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. రూ.10వేల కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే ఓ గర్భిణి నాలాలో పడి మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే వీటిని ఆధునికీకరించాలని...ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదాలు ఊపందుకున్నాయి.
ప్రభుత్వానిదే బాధ్యత
బన్సీలాల్‌పేట్: ‘సత్యవాణి మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఆమె కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, ఆదుకోవాలి. అధికారులు వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహించొద్దు. నగరంలోని నాలాలను మూసివేయండ’ంటూ గాంధీ ఆస్పత్రి మార్చురీ ఎదుట సత్యవాణి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి నాలాలో పడి మృతిచెందిన సత్యవాణి(25) మృతదేహానికి గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సత్యవాణి భర్త ప్రేమ్‌రాజ్, తల్లిదండ్రులు లక్ష్మి, భాస్కర్, బంధువులు, సీపీఎం, సీఐటీయూ నాయకులతో కలిసి గాంధీ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, అధికారులు వచ్చే వరకు పోస్టుమార్టం నిర్వహించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మార్చురీ వద్ద మోహరించారు. గోపాలపురం పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సీపీఎం నాయకులు కేఎన్ రాజన్న, సీఐటీయూ నాయకులు కిష్టప్ప, మల్లేష్, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రూ.3.5 లక్షలు పరిహారం
సత్యవాణి కుటుంబానికి రూ.3.5 లక్షలు పరిహారాన్ని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాంశర్శ గాంధీ మార్చురీకి వచ్చి బాధితులను పరామర్శించారు. రెవెన్యూ విభాగం తరఫున ప్రకృతి వైపరీత్యాల రిలీఫ్ ఫండ్ కింద రూ.1.50 లక్షలతో పాటు ఓ ఇల్లు కేటాయిస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఉత్తర మండలం ఇన్‌చార్జ్ జోనల్ కమిషనర్ హరికృష్ణ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ క మిషనర్, మేయర్‌లతో మాట్లాడిన అనంతరం బాధితుల తరఫున వచ్చిన ప్రతినిధి బృందానికి ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజ్ మాట్లాడుతూ సత్యవాణి మృతి దురదృష్టకరమని పేర్కొన్నారు.
నాలా సమస్యలపై టీడీపీ ధర్నా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలా సమస్యలపై టీడీపీ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీలో గురువారం ధర్నా నిర్వహించారు. గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందు ఈ ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాలాల్లో వ్యర్థాలను తొలగించాలని, వాటిని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా తాము విజ్ఞప్తులు చేస్తున్నా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. గత ఆరునెలలుగా పన్ను వసూలుపై చూపిన శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపలేదని విమర్శించారు.
మేయర్, కమిషనర్‌ల నిర్లక్ష్యం వల్ల గర్భవతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు హేమలత యాదవ్, భానుప్రసాద్, వెంకట సామ్రాజ్యం, మాధవరపు రంగారావు, బాబూరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.