Naala
-
నాలాలో పడి బాలుడి గల్లంతు
ఓల్డ్‌మలక్‌పేట: ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం నగరంలోని ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన తరుణ్ ఇంటి బయట ఆడుకుంటుండుంగా ప్రమాదవశాత్తూ నాలాలోపడి కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకి లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
విచ్చలవిడిగా లేఅవుట్లు నిబంధనలకు తూట్లు
అధికారుల కళ్లుగప్పి అమ్మేసుకుంటున్న రియల్టర్లు ముడుపులు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్లు నాలా పన్ను కూడా చెల్లించని తీరు గుడివాడ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. సీఆర్డీఏ పరిధిలో గుడివాడతో పాటు పరిసర ప్రాంత మండలాలు ఉన్నాయి. దీంతో సీఆర్డీఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి లేకుండా ఎటువంటి లేఅవుట్లూ వేయకూడదని ప్రభుత్వం తేల్చి చెబుతున్నా ఇక్కడ రియల్టర్లు మాత్రం విచ్చలవిడిగా ప్లాట్లువేసి విక్రయాలు జరుపుతున్నారు. రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల కళ్లుగప్పి కనీసం భూమి మార్పిడి పన్ను కూడా చెల్లించకుండా పంట పొలాల్లో రోడ్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు తూట్లు... మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడివాడకు అవుటర్ రింగ్‌రోడ్ భూషణగుళ్ల పంచాయతీ పరిధిలోని ఏఎన్నార్ కళాశాల వెనుక వైపు ఉంది. గతంలో ఆప్రాంతంలో ప్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 100 అడుగుల అవుటర్ రింగ్‌రోడ్డును వదిలేశాడు. ఇటీవల దీని పక్కనే ప్లాట్లు వేస్తున్న వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న 18 సెంట్ల భూమిని కూడా ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నాడు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేసిన ఈ వ్యక్తి కనీసం నాలా పన్ను కూడా చెల్లించలేదని సమాచారం. సీఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని వెంచర్లూ తప్పనిసరిగా సీఆర్డీఏ నిబంధనలు తీసుకుని ప్లాట్లు విక్రయించాలి. ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావటంతో పాటు అనుమతులు రావటం లేదని చెప్పి ప్లాట్లుగా వేసి అమ్మేసుకుంటున్నారు. ఇటువంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినా రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పే ఒక డాక్యుమెంటరీ రైటర్ సాయంతో కార్యాలయంలోని అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి ఆ ప్రక్రియా పూర్తి చేస్తున్నట్లు వినికిడి. అవుటర్ రింగ్ రోడ్డును కూడా రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నిబంధనల ప్రకారం అన్ని రోడ్లూ 60 అడుగులు ఉండాలి. డ్రైనేజీ, వీధిలైట్లతో పాటు పది శాతం సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలి. ఇన్ని నిబంధనలు గాలికి వదిలి ప్లాట్లు అమ్మేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. ఇది వెంచర్ సమీపంలో మరో ఎకరంన్నర పంట పొలాన్ని ప్లాట్లుగా విక్రయించటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం... సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా వేసిన అనుమతి లేని ప్లాట్లపై చర్యలు తీసుకుంటామని గుడివాడ ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. నాలా పన్ను చెల్లించకుండా రోడ్లు వేసిన రియల్టర్‌పై పెనాల్టీ విధించి ఆ ప్లాట్లను దున్నేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. గురువారం గుడివాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి అనధికార లేఅవుట్ల వ్యవహారాన్ని విలేకరులు తీసుకెళ్లగా, అనుమతులు లేని ప్లాట్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్యకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అటువంటి ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోరాదని ప్రజలకు సూచించారు. -
సత్యవాణి మృతితో జీహెచ్ఎంసీపై కేసు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని ఒక నాలాలో పడి శామీర్‌పేట్ మండలం అలియాబాద్‌కు చెందిన ముక్కు సత్యవాణి (26) మృతి చెందిన ఘటన తో జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదైంది. మృతురాలి భర్త ప్రేంరాజ్ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హయత్‌నగర్ వెళ్లిన సత్యవాణి తిరిగి అలియాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఒక్కమారుగా భారీ వర్షం కురవడంతో సికింద్రాబాద్ రహదారులన్నీ జలమయమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితితో ఒలిఫెంటా వంతెన సమీపంలోని ఒక నాలా పైకప్పుపై నుంచి నడిచేందుకు ప్రయత్నించింది. అప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరిన నాలా పైకప్పు సత్యవాణి కాలు మోపడంతోనే కుప్పకూలింది. బంధువుల కళ్ల ముందే నాలాలోకి మునిగిపోయిన సత్యవాణి అక్కడికక్కడే మృతి చెందింది. జీహెచ్ఎంసీ అధికారులు నాలాపై కప్పును మరమ్మతు చేయని కారణంగానే తన భార్య నాలాలో పడిమృతి చెందిందని మృతురాలి భర్త ప్రేంరాజ్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీపై 304 ఏ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలాలు... నల్లతాచులు
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి మనుషులపైకి మృత్యువును ఉసిగొల్పుతున్నాయి. నిన్న సత్యవేణి.. రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లో ఒకరు... కొంతకాలం క్రితం అంబర్‌పేటలో బ్యాంకు ఉద్యోగిని.. ఇలా వాన వచ్చిన ప్రతిసారీ ప్రజల ప్రాణాలు నీటిలో కలసిపోతున్నాయి. నాలాలపైనే అంతస్తులకు అం తస్తులు వెలియడంతో ఈ దుస్థితి నెలకొంది. 2000 సంవత్సరంలో వచ్చిన వరదలు నేర్పిన అనుభవంతో నాలాలను ఆధునీకరించాలనుకున్నారు. రూ.264 కోట్లతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏటా ఆ అంచనాలు పెరుగుతూ వచ్చాయి తప్పితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. నాలాల కబ్జాలు ఆగలేదు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. రూ.10వేల కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే ఓ గర్భిణి నాలాలో పడి మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే వీటిని ఆధునికీకరించాలని...ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వానిదే బాధ్యత బన్సీలాల్‌పేట్: ‘సత్యవాణి మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఆమె కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, ఆదుకోవాలి. అధికారులు వచ్చేవరకూ పోస్టుమార్టం నిర్వహించొద్దు. నగరంలోని నాలాలను మూసివేయండ’ంటూ గాంధీ ఆస్పత్రి మార్చురీ ఎదుట సత్యవాణి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి నాలాలో పడి మృతిచెందిన సత్యవాణి(25) మృతదేహానికి గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సత్యవాణి భర్త ప్రేమ్‌రాజ్, తల్లిదండ్రులు లక్ష్మి, భాస్కర్, బంధువులు, సీపీఎం, సీఐటీయూ నాయకులతో కలిసి గాంధీ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్, అధికారులు వచ్చే వరకు పోస్టుమార్టం నిర్వహించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మార్చురీ వద్ద మోహరించారు. గోపాలపురం పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సీపీఎం నాయకులు కేఎన్ రాజన్న, సీఐటీయూ నాయకులు కిష్టప్ప, మల్లేష్, అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. రూ.3.5 లక్షలు పరిహారం సత్యవాణి కుటుంబానికి రూ.3.5 లక్షలు పరిహారాన్ని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ రఘురాంశర్శ గాంధీ మార్చురీకి వచ్చి బాధితులను పరామర్శించారు. రెవెన్యూ విభాగం తరఫున ప్రకృతి వైపరీత్యాల రిలీఫ్ ఫండ్ కింద రూ.1.50 లక్షలతో పాటు ఓ ఇల్లు కేటాయిస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఉత్తర మండలం ఇన్చార్జ్ జోనల్ కమిషనర్ హరికృష్ణ వెల్లడించారు. జీహెచ్ఎంసీ క మిషనర్, మేయర్లతో మాట్లాడిన అనంతరం బాధితుల తరఫున వచ్చిన ప్రతినిధి బృందానికి ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజ్ మాట్లాడుతూ సత్యవాణి మృతి దురదృష్టకరమని పేర్కొన్నారు. నాలా సమస్యలపై టీడీపీ ధర్నా సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని నాలా సమస్యలపై టీడీపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీలో గురువారం ధర్నా నిర్వహించారు. గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశానికి ముందు ఈ ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాలాల్లో వ్యర్థాలను తొలగించాలని, వాటిని అభివృద్ధి చేయాలని ఎంతో కాలంగా తాము విజ్ఞప్తులు చేస్తున్నా కమిషనర్ పట్టించుకోలేదన్నారు. గత ఆరునెలలుగా పన్ను వసూలుపై చూపిన శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపలేదని విమర్శించారు. మేయర్, కమిషనర్ల నిర్లక్ష్యం వల్ల గర్భవతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు హేమలత యాదవ్, భానుప్రసాద్, వెంకట సామ్రాజ్యం, మాధవరపు రంగారావు, బాబూరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. -
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. కబ్జాకు పథక రచన చేస్తోంది. వీరి పన్నాగం విజయవంతమైతే.. నీటితో కళకళలాడాల్సిన 5 కుంటల ఉనికి సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుంది. దీంతో ఇక్కడి పంట పొలాలు ఎడారిగా మారి.. వందలాది రైతుల జీవనాధారం ఛిద్రమయ్యే పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రియల్టర్ల అక్రమాలతో నాలా నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఇటీవలే ప్రారంభమైన నాలా కబ్జా వ్యవహారాన్ని తక్షణం అడ్డుకోకపోతే ఎంతో మంది రైతుల ఉపాధికి ప్రమాదం వాటిల్లడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటే ముప్పు పొంచి ఉంది. కుంటలు మూసుకుపోతే జాలర్ల జీవితాలపై కూడా పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని రాయ్‌పోల్ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న సాకలామెకుంట ప్రధాన నాలాను కొంతమంది రియల్టర్లు మూసివేసేందుకు యత్నిస్తున్నారు. నాలాకు కొనసాగింపుగా ఉన్న కాల్వను ఇప్పటికే పెద్దపెద్ద బండరాళ్లతో దిగ్బంధనం చేశారు. సాకలామెకుంట నాలాను మూసేస్తే.. ఈ నాలా నుంచి పారే నీటితోనే నల్ల కంచె, ఎర్ర కంచె, మొగుళ్లవంపు కుంట, దిల్వానికుంట, పెద్దకుంట తదితర కుంటల్లోకి చుక్క నీరు కూడా చేరదు. మారిన రూపురేఖలు కిలో మీటర్ల మేర ఉన్న నాలా స్వరూపం ప్రస్తుతం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. నాలా పరీవాహక ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తే తప్ప దీని ఉనికిని కనిపెట్టడం సాధ్యం కాదు. ప్రారంభంలో 20 అడుగుల పొడవు ఉండే నాలా ప్రస్తుతం 2 అడుగుల మేర కుంచించుకుపోయింది. 15 అడుగులు మేర ఉండాల్సిన నాలా 5 అడుగుల వరకు కుదించుకుపోయింది. ఓ వైపు నాలా మూసివేతలు మరోవైపు కొరవడిన నిర్వహణ లోపం.. భారీ వర్షాలు కురిసినా వీటిలోంచి నీరు పారని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన జలాశయం తట్టిఖానా చెక్‌డ్యాం వరకు ఉన్న నీటి కుంటలకు నీరందించే ప్రధాన నాలాను చెడగొట్టి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు కొంతమంది అడ్డుకొని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులు నాలాను ఆధునికీకరించే పనులు చేపట్టారు. అయితే నాలాకు అంతర్గతంగా ఉన్న కాల్వను మాత్రం యథేచ్ఛగా మూసివేసే కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని యథాతథంగా పునరుద్ధరిస్తే స్థానిక రైతులకు ఊరట కలుగుతుంది. అధికారుల స్పందనపైనే రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎటువంటి సమాచారం అందలేదు.. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. నాలా కబ్జాకు సంబంధించి మాకు ఎలాంటి సమాచాం అందలేదు. కబ్జా వివరాలు వీఆర్వోలు చూసుకోవాలి. నాలా వివరాలు విలేజ్ మ్యాప్‌లో ఉంటాయి. సర్వేనంబర్ తదితర అంశాలు రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. అయినా కూడా మేం పరిశీలిస్తాం. నాలాల మూసివేతకు సంబంధించి ఎలాంటి వివరాలు తమ దృష్టికి రాలేదని తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.