అధికారుల కళ్లుగప్పి అమ్మేసుకుంటున్న రియల్టర్లు
ముడుపులు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్లు
నాలా పన్ను కూడా చెల్లించని తీరు
గుడివాడ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. సీఆర్‌డీఏ పరిధిలో గుడివాడతో పాటు పరిసర ప్రాంత మండలాలు ఉన్నాయి. దీంతో సీఆర్‌డీఏ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనుమతి లేకుండా ఎటువంటి లేఅవుట్లూ వేయకూడదని ప్రభుత్వం తేల్చి చెబుతున్నా ఇక్కడ రియల్టర్లు మాత్రం విచ్చలవిడిగా ప్లాట్లువేసి విక్రయాలు జరుపుతున్నారు. రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల కళ్లుగప్పి కనీసం భూమి మార్పిడి పన్ను కూడా చెల్లించకుండా పంట పొలాల్లో రోడ్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాస్టర్ ప్లాన్‌కు తూట్లు...
మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడివాడకు అవుటర్ రింగ్‌రోడ్ భూషణగుళ్ల పంచాయతీ పరిధిలోని ఏఎన్నార్ కళాశాల వెనుక వైపు ఉంది. గతంలో ఆప్రాంతంలో ప్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 100 అడుగుల అవుటర్ రింగ్‌రోడ్డును వదిలేశాడు. ఇటీవల దీని పక్కనే ప్లాట్లు వేస్తున్న వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న 18 సెంట్ల భూమిని కూడా ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నాడు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేసిన ఈ వ్యక్తి కనీసం నాలా పన్ను కూడా చెల్లించలేదని సమాచారం. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న అన్ని వెంచర్లూ తప్పనిసరిగా సీఆర్‌డీఏ నిబంధనలు తీసుకుని ప్లాట్లు విక్రయించాలి.
ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావటంతో పాటు అనుమతులు రావటం లేదని చెప్పి ప్లాట్లుగా వేసి అమ్మేసుకుంటున్నారు. ఇటువంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకూడదని తెలిసినా రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పే ఒక డాక్యుమెంటరీ రైటర్ సాయంతో కార్యాలయంలోని అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి ఆ ప్రక్రియా పూర్తి చేస్తున్నట్లు వినికిడి. అవుటర్ రింగ్ రోడ్డును కూడా రిజిస్ట్రేషన్ చేయించే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం అన్ని రోడ్లూ 60 అడుగులు ఉండాలి. డ్రైనేజీ, వీధిలైట్లతో పాటు పది శాతం సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలి. ఇన్ని నిబంధనలు గాలికి వదిలి ప్లాట్లు అమ్మేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. ఇది వెంచర్ సమీపంలో మరో ఎకరంన్నర పంట పొలాన్ని ప్లాట్లుగా విక్రయించటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం...
సీఆర్‌డీఏ నిబంధనలకు విరుద్ధంగా వేసిన అనుమతి లేని ప్లాట్లపై చర్యలు తీసుకుంటామని గుడివాడ ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. నాలా పన్ను చెల్లించకుండా రోడ్లు వేసిన రియల్టర్‌పై పెనాల్టీ విధించి ఆ ప్లాట్లను దున్నేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. గురువారం గుడివాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దృష్టికి అనధికార లేఅవుట్ల వ్యవహారాన్ని విలేకరులు తీసుకెళ్లగా, అనుమతులు లేని ప్లాట్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎస్.వెంకటసుబ్బయ్యకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అటువంటి ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోరాదని ప్రజలకు సూచించారు.
విచ్చలవిడిగా లేఅవుట్లు నిబంధనలకు తూట్లు
Published Fri, Apr 17 2015 4:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement
Advertisement