నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్నుపడింది. కబ్జాకు పథక రచన చేస్తోంది. వీరి పన్నాగం విజయవంతమైతే.. నీటితో కళకళలాడాల్సిన 5 కుంటల ఉనికి సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుంది. దీంతో ఇక్కడి పంట పొలాలు ఎడారిగా మారి.. వందలాది రైతుల జీవనాధారం ఛిద్రమయ్యే పరిస్థితి నెలకొంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం.. రియల్టర్ల అక్రమాలతో నాలా నామరూపాల్లేకుండా కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఇటీవలే ప్రారంభమైన నాలా కబ్జా వ్యవహారాన్ని తక్షణం అడ్డుకోకపోతే ఎంతో మంది రైతుల ఉపాధికి ప్రమాదం వాటిల్లడమే కాకుండా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటే ముప్పు పొంచి ఉంది. కుంటలు మూసుకుపోతే జాలర్ల జీవితాలపై కూడా పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలంలోని రాయ్‌పోల్ గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న సాకలామెకుంట ప్రధాన నాలాను కొంతమంది రియల్టర్లు మూసివేసేందుకు యత్నిస్తున్నారు. నాలాకు కొనసాగింపుగా ఉన్న కాల్వను ఇప్పటికే పెద్దపెద్ద బండరాళ్లతో దిగ్బంధనం చేశారు. సాకలామెకుంట నాలాను మూసేస్తే.. ఈ నాలా నుంచి పారే నీటితోనే నల్ల కంచె, ఎర్ర కంచె, మొగుళ్లవంపు కుంట, దిల్‌వానికుంట, పెద్దకుంట తదితర కుంటల్లోకి చుక్క నీరు కూడా చేరదు.
మారిన రూపురేఖలు
కిలో మీటర్ల మేర ఉన్న నాలా స్వరూపం ప్రస్తుతం పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. నాలా పరీవాహక ప్రాంతంలో తీవ్రంగా శ్రమిస్తే తప్ప దీని ఉనికిని కనిపెట్టడం సాధ్యం కాదు. ప్రారంభంలో 20 అడుగుల పొడవు ఉండే నాలా ప్రస్తుతం 2 అడుగుల మేర కుంచించుకుపోయింది. 15 అడుగులు మేర ఉండాల్సిన నాలా 5 అడుగుల వరకు కుదించుకుపోయింది. ఓ వైపు నాలా మూసివేతలు మరోవైపు కొరవడిన నిర్వహణ లోపం.. భారీ వర్షాలు కురిసినా వీటిలోంచి నీరు పారని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన జలాశయం తట్టిఖానా చెక్‌డ్యాం వరకు ఉన్న నీటి కుంటలకు నీరందించే ప్రధాన నాలాను చెడగొట్టి రోడ్డు వేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు కొంతమంది అడ్డుకొని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తులు నాలాను ఆధునికీకరించే పనులు చేపట్టారు. అయితే నాలాకు అంతర్గతంగా ఉన్న కాల్వను మాత్రం యథేచ్ఛగా మూసివేసే కార్యక్రమం కొనసాగుతోంది. దీన్ని యథాతథంగా పునరుద్ధరిస్తే స్థానిక రైతులకు ఊరట కలుగుతుంది. అధికారుల స్పందనపైనే రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఎటువంటి సమాచారం అందలేదు..
ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. నాలా కబ్జాకు సంబంధించి మాకు ఎలాంటి సమాచాం అందలేదు. కబ్జా వివరాలు వీఆర్వోలు చూసుకోవాలి. నాలా వివరాలు విలేజ్ మ్యాప్‌లో ఉంటాయి. సర్వేనంబర్ తదితర అంశాలు రెవెన్యూ రికార్డుల్లో ఉంటాయి. అయినా కూడా మేం పరిశీలిస్తాం. నాలాల మూసివేతకు సంబంధించి ఎలాంటి వివరాలు తమ దృష్టికి రాలేదని తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. ఆక్రమణలు జరిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాలాపై రియల్ ఎస్టేట్ మాఫియా కన్ను
Published Mon, Oct 20 2014 12:29 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement