సత్యవాణి మృతితో జీహెచ్‌ఎంసీపై కేసు
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని ఒక నాలాలో పడి శామీర్‌పేట్ మండలం అలియాబాద్‌కు చెందిన ముక్కు సత్యవాణి (26) మృతి చెందిన ఘటన తో జీహెచ్‌ఎంసీ అధికారులపై కేసు నమోదైంది. మృతురాలి భర్త ప్రేంరాజ్ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు హయత్‌నగర్ వెళ్లిన సత్యవాణి తిరిగి అలియాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ఒక్కమారుగా భారీ వర్షం కురవడంతో సికింద్రాబాద్ రహదారులన్నీ జలమయమయ్యాయి.
గత్యంతరం లేని పరిస్థితితో ఒలిఫెంటా వంతెన సమీపంలోని ఒక నాలా పైకప్పుపై నుంచి నడిచేందుకు ప్రయత్నించింది. అప్పటికే పూర్తిగా శిథిలావస్థకు చేరిన నాలా పైకప్పు సత్యవాణి కాలు మోపడంతోనే కుప్పకూలింది. బంధువుల కళ్ల ముందే నాలాలోకి మునిగిపోయిన సత్యవాణి అక్కడికక్కడే మృతి చెందింది. జీహెచ్‌ఎంసీ అధికారులు నాలాపై కప్పును మరమ్మతు చేయని కారణంగానే తన భార్య నాలాలో పడిమృతి చెందిందని మృతురాలి భర్త ప్రేంరాజ్ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీపై 304 ఏ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.