భారత్‌కు నిరాశ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కీలకదశలో తడబాటుకు లోనైన భారత జట్టు సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఓటమితో ప్రారంభించింది. సోమవారం జరిగిన గ్రూప్1–డి తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పీవీ సింధు విజయం మినహా... మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 15–21, 21–16, 17–21తో జోకిమ్ ఫిషెర్ నీల్సన్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడింది.
రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ కేవలం 27 నిమిషాల్లో 12–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 17–21, 15–21తో మథియాస్ బో–కార్‌స్టెన్ మోగెన్‌సన్ జోడీ చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది.
నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–18, 21–6తో లైన్ జార్‌ఫెల్ట్‌ను ఓడించడంతో భారత్ బోణీ చేసింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 21–18, 15–21, 21–23తో కామిల్లా రైటర్ జుల్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడిపోయింది. భారత జట్టుకు నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేడు (మంగళవారం) ఇండోనేసియా జట్టుతో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.