సుదిర్మన్ కప్‌లో భారత్‌కు విజయావకాశాలు: సింధు
ముంబై: త్వరలో జరగనున్న సుదిర్మన్ కప్ వరల్డ్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మంచి విజయావకాశాలున్నాయని భారత షట్లర్ పి.వి.సింధు అభిప్రాయపడింది. ‘భారత జట్టు గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయి. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాబట్టి, స్త్రీ, పురుష జట్లు కలిసి బాగా ఆడే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్లో ఇండోనేషియా, డెన్మార్క్‌లతో తలపడాలి. అన్ని మ్యాచుల్లో గెలుస్తామనే ఆశిస్తున్నాం’ అని సింధు చెప్పింది. ఆస్ట్రేలియాలో ఈ నెల 21 నుంచి 28 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.
ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో ఉన్న భారత జట్టు, గ్రూప్ 1డిలో డెన్మార్క్, ఇండోనేషియాలతో ప్రిలిమ్స్‌లో పోటీపడుతుంది. ఈ టోర్నమెంటులో భారత జట్టు పి.వి.సింధుపైనే ఎక్కువగా ఆశలుపెట్టుకుంది. ప్రస్తుతం పి.వి.సింధు ప్రపంచ నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది. సైనా నెహ్వాల్ కుటుంబ కారణాల రీత్యా ఈ టోర్నమెంటులో పాల్గొనడం లేదు. అయితే సైనా లేకపోవడం జట్టుకు పెద్ద సమస్య కాదని సింధు అభిప్రాయపడింది. ‘సింగిల్స్‌లో, డబుల్స్‌లో ఒక్కరే అవసరం.
కాబట్టి సైనా లేకపోవడం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం నేను నాలుగో ర్యాంకులో ఉన్నాను. టోర్నీ ముగిసేసరికి మెరుగైన ప్రతిభతో మూడో ర్యాంకుకు చేరుకుంటానని భావిస్తున్నాను. ఇప్పటికే నేను టాప్–2కి చేరుకున్నాను. టాప్ ర్యాంకుకి చేరుకోవాలనుకుంటున్నాను. కానీ దానికంటే ముందు మంచి ప్రతిభ కనబర్చడం చాలా ముఖ్యం. బాగా ఆడితే నెం.1 ర్యాంకు వచ్చితీరుతుంది’ అని సింధు వివరించింది.